అబ్బబ్బా... ఎన్ని రకాల డ్రోన్లో.. ఆ ఫోటోలు చూడండి!
డ్రోన్లు.. నిన్న మొన్నటి వరకు పెద్దగా తెలియని పదం. ఇప్పుడది అందరి నోళ్లలో నానుతోంది. చివరకు గ్రామాల్లోనూ డ్రోన్లేమిట్రా అబ్బాయ్ అని పెద్దలు అడగడం గమనార్హం.
డ్రోన్లు.. నిన్న మొన్నటి వరకు పెద్దగా తెలియని పదం. ఇప్పుడది అందరి నోళ్లలో నానుతోంది. చివరకు గ్రామాల్లోనూ డ్రోన్లేమిట్రా అబ్బాయ్ అని పెద్దలు అడగడం గమనార్హం. రాబోయే రోజుల్లో వీటి వినియోగం పెరిగి మరిన్ని సౌకర్యాలు జనానికి వనగూడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. విజయవాడలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఏపీ డ్రోన్ సమ్మిట్-2024 ప్రజల్ని విశేషంగానే ఆకట్టుకుంది. మంగళవారం రాత్రి అంటే అక్టోబర్ 22న కృష్ణానది పున్నమీ ఘాట్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శన జనాన్నిఅబ్బురపరిచింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో రకరకాల డ్రోన్లను ఉంచారు. వాటిలో మనుషుల్ని తీసుకువెళ్లేవి మొదలు అరచేతిలో ఇమిడేంత చిన్నవీ ఉన్నాయి. ఇప్పటికే అంబులెన్స్ డ్రోన్లు వచ్చాయి. వీటి ద్వారా పేపెంట్లను తరలిస్తున్నారు. మందుల్ని ఇళ్లకు పంపిస్తున్నారు. ఈ ప్రదర్శనలో ఆకట్టుకున్న డ్రోన్ల చిత్రాలు..
చేపలకు మేత వేసేందుకు ‘ఏజీ365హెచ్’ పేరుతో మారుత్ డ్రోన్స్...
టేథర్డ్ డ్రోన్..నిఘారంగం....
ఈ డ్రోన్లను నిఘా (సర్వైలెన్స్) కోసం వినియోగిస్తారు. ఇప్పటికే గుజరాత్ పోలీసులు దీన్ని ఉపయోగిస్తున్నారు.
డ్రైవర్ లేకుండా నడిచే హెలికాప్టర్- హైడ్రోజన్ ఎలక్ట్రిక్ పవర్డ్ వీటీఓఎల్ ఎయిర్‌క్రాఫ్ట్...
వజ్ర డ్రోన్.. నిఘా నేత్రం...
ఏరో 360కి చెందిన వజ్ర డ్రోన్ అత్యధికంగా 75 నిమిషాల పాటు గాల్లో ఉండగలదు. ఇది అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లో 10 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. పంట పర్యవేక్షణ, ఏరియల్ సర్వే, అటవీ పర్యవేక్షణ, ఖనిజాన్వేషణ, పైప్‌లైన్ పర్యవేక్షణ, ట్రాఫిక్ మేనేజిమెంట్, సెర్చ్-రెస్క్యూ, ఏరియల్ పెట్రోలింగ్, సరిహద్దు భద్రత, వన్యప్రాణ సంరక్షణ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
వైద్యరంగంలో సేవల కోసం ఈ డ్రోన్..
ఈ డ్రోన్‌ను రెడ్‌వింగ్ అనే కంపెనీ పేరుతోనే ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని మందులు, ఇతర ఆసుపత్రుల అవసరాల కోసం ఉపయోగించేలా రూపొందించారు. రక్త నమూనాలు, మందులు, టీకాలను తీసుకువెళ్లేందుకు వినియోగిస్తున్నారు. 3కేజీల బరువును, 50కి.మీ. మేర తీసుకెళ్లగలదు. మందులను భద్రపరిచేందుకు కోల్డ్‌స్టోరేజీ కూడా ఏర్పాటుచేశారు.
మ్యాపింగ్ కోసం ఈ డ్రోన్లను వినియోగిస్తారు...
ఈ డ్రోన్‌ను సర్వైలెన్స్, మ్యాపింగ్ కోసం వినియోగిస్తున్నారు. వీటిని మైనింగ్, రియల్‌ఎస్టేట్, సోలార్ ప్లాంట్లు, వ్యవసాయం, వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి వాటికీ వినియోగిస్తున్నారు. ఎక్కడైనా గ్యాస్ లీకైతే సులువుగా కనిపెట్టి, ప్రమాదాలను నివారించవచ్చు.
రక్షణ రంగంలో అవసరాల కోసం...
రక్షణరంగ అవసరాల కోసం ‘కామికాజీ డ్రోన్’ను వీయూ డైనమిక్స్ సంస్థ అభివృద్ధి చేసింది. అత్యవసర సమయాల్లో డ్రోన్ సాయం అందిస్తోంది. మనం వెళ్లలేని ప్రాంతాలకూ సరకులు, మందులు తీసుకెళ్లుతుంది. బుడమేరు వరదల్లో అది చేసిన సాయం చూశాం. అలాంటి డ్రోన్‌ను సమ్మిట్‌లో ప్రదర్శించారు.