వంశీకి ఆరోగ్యం బాగలేదు..నేలపైనే పడుకోబెట్టారు
జగన్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని వంశీ భార్య పంకజశ్రీ చెప్పారు.;
By : Admin
Update: 2025-02-15 08:42 GMT
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం మీద ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం అరెస్టై విజయవాడ జైలులో ఉన్న వంశీని ఆయన భార్య పంకజశ్రీ శనివారం కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లబుచ్చుకున్నారు. జైలులో వంశీకి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదన్నారు. తన భర్త వంశీకి ఆరోగ్యం సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. వంశీ మీద తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. ఆయన రిమాండ్‌లో మాత్రమే ఉన్నారని, కేసులు ఇంకా నిర్థారణ కాలేదన్నారు. కావాలసే వంశీని జైల్లో పెట్టారని, జైల్లోనే తన భర్త వంశీకి ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వంశీని నేలపైనే పడుకోబెట్టారని చెప్పారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంశీని కలుస్తారని చెప్పినట్లు వంశీ భార్య పంకజశ్రీ వెల్లడించారు. జగన్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, లీగల్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు జగన్ భరోసా ఇచ్చినట్లు చెప్పారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే అని, సత్యవర్థన్‌ను అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందుకు ఎందుకు ప్రవేశ పెట్టలేదని పంకజశ్రీ ప్రశ్నించారు.
వంశీకి ప్రస్తుతం ఆరోగ్యం బాగా లేదన్నారు. వెన్ను నొప్పి, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇలా అనారోగ్యంతో ఉన్న వంశీని కావాలనే నేలపైనే పడుకోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వంశీని పోలీసులు మెంటల్‌గా టార్చర్ పెడుతున్నారని, వంశీ ఆరోగ్యం బాగున్నట్లు వైద్యులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పంకజశ్రీ చెప్పారు. మానసికంగా కుంగదీస్తున్నారని చెప్పారు. దీనిపైన కోర్టుకు వెళ్తామన్నారు. వంశీని జైలులో ఎవరినీ కలవనీకుండా చేస్తున్నారని, వంశీ ఉన్న బారక్‌లో 60సీసీ కెమేరాలు పెట్టారని వెల్లడించారు.