రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు వస్తాయి.. చెప్పిన కేంద్రమంత్రి

‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు త్వరలోనే పలు విమానాశ్రయాలు మంజూరు అవుతాయి. వీటికి ఎప్పటి నుంచే ప్రతిపాదనలు ఉన్నాయి’’ అని కేంద్ర ఏవియేషన్ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

Update: 2024-08-11 14:11 GMT

‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు త్వరలోనే పలు విమానాశ్రయాలు మంజూరు అవుతాయి. వీటికి ఎప్పటి నుంచే ప్రతిపాదనలు ఉన్నాయి’’ అని కేంద్ర ఏవియేషన్ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా సాగుతున్న భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న విమానాశ్రయ ప్రాజెక్ట్‌ల నుంచి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఎప్పటి నుంచో పలు విమానాశ్రయాల నిర్మాణికి ప్రతిపాదనలు ఉన్నాయని, వాటికి ఆమోద ముద్ర వేసే దిశగా కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. అయితే ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చబోతున్న ప్రాజెక్ట్ ఈ భోగాపురం విమానాశ్రయమని కూడా చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా మారుతుందని, అందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఈ విమానాశ్రయం పనుల్లో సాధిస్తున్న పురోగతిని ప్రతి నెలా ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పారాయన.

36శాతం పనులు పూర్తి

‘‘భోగాపురం విమానాశ్రయ పనులు ఇప్పటివరకు 36శాతం పూర్తయ్యాయి. ఈ నెలలో 4శాతం పురోగతిని సాధించాం. ఈ విమానాశ్రయాన్ని అనుకున్న సమయం కన్నా ముందే పూర్తి చేస్తాం. ఆ దిశగానే పనులను పరుగులు పెట్టిస్తున్నాం. నిర్మాణ సంస్థలు కూడా అదే విధంగా పని చేస్తున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. అక్కడ భూసేకరణ కార్యక్రమం కూడా ప్రారంభించనున్నాం. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

తెలంగాణలో ఆ ప్రాంతాల్లోనే

‘‘ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా కొత్త విమానాశ్రయాలకు ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం, రామగుండంలో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని కోరుతున్నాం. వీటి నిర్మాణాల్లోని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. అతి త్వరలోనే వీటి విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాం. వీలైనంత త్వరగా వీటికి ఆమోద ముద్ర పడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం జరిగేలానే అన్ని నిర్ణయాలు తీసుకుంటాం’’ అని వెల్లడించారు.

మరిన్ని ఎయిర్‌పోర్ట్‌లు అవసరం

‘‘దేశంలో మరిన్ని ఎయిర్‌పోర్ట్‌ల అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఎయిర్‌పోర్ట్‌ల కోసం భూమి సేకరించడం కష్టం అవుతుంది. అందుకని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడే కనీసం భూమినైనా సేకరించేలా కసరత్తులు చేస్తున్నాం. దేశాభివృద్ధికి ఈ విమానాశ్రయాలు చాలా కీలకం. ఉడాన్ స్కీమ్ వల్ల దేశ విమానయాన శాఖ ప్రపంచంలోనే ఉన్నతంగా తయారైంది’’ అని రామ్మోహన్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News