పెద్దిరెడ్డి కన్నా.. రోజాకే జగన్ పెద్దపీట వేశారా?

చిత్తూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పెద్దన్నపాత్ర పోషిస్తారు. ఆయన మద్దతుదారులపై రోజా ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు? పార్టీ పదవితో పట్టు సాధించిన ఆమె సమాంతరంగా నిలిచారా?

Update: 2024-09-14 10:23 GMT

చిత్తూరు జిల్లా వైసీపీలో రెండు భిన్నధ్రువాలు ఏర్పడ్డాయి. అసమ్మతి, అసంతృప్తి సెగల మధ్య ఓటమి చెందిన మాజీ మంత్రి "ఆర్కే రోజా అధికార ప్రతినిధి పదవి"తో పట్టు సాధించారు. తన ఓటమికి కారణమైన వారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుల్లో కీలకమైన దంపతులను పార్టీ నుంచి బహిష్కరింప చేయడంలో సఫలమయ్యారు. ఈ పరిణామాలు కాస్త చిత్తూరు జిల్లా వైసీపీలో రెండు ధ్రువాలు ఏర్పడడానికి ఆస్కారం కలిపించినట్లు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పెద్దిరెడ్డికి కూడా వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడిగా కీలక పదవి దక్కింది. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా ఆయనకే కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ కాలం నుంచి...
రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ సజీవంగా ఉంది. దివంగత సీఎం డా. వైయస్సార్ కాలంలో కూడా టీడీపీలో ఫైర్ బ్రాండ్, సినీ కథానాయకి ఆర్కే. రోజా విమర్శలు గుప్పించడంలో ఎక్కడా రాజీపడలేదు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో దివంగత సీఎం డాక్టర్ వైయస్సార్ కు అంతరంగకుడిగా ఉన్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సారధ్యంలో అప్పటి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆర్కే రోజా సచివాలయంలో నే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2004 ఎన్నికలకు ముందు నుంచి దివంగత సీఎం వైయస్సార్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి రాజకీయంగా సఖ్యత లేదు. దీంతో ఆయనకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కూడా దక్కలేదు. అయితే,.
2009 ఎన్నికల తర్వాత వైయస్సార్ తో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ రాజీ కుదరడం, మంత్రి కావడం జరిగింది. అప్పటికే టీడీపీ నుంచి ఆర్కే రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగిపోయింది. (అంతకుముందు ఆమె 2004, 2009 ఎన్నికల్లో చంద్రగిరి, నగరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు)
ఆ తర్వాత కొంతకాలానికి డాక్టర్ వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆర్కే రోజా రాజకీయంగా కొన్ని రోజులు స్తబ్దతగా ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా డోలాయమానంలో ఉన్నారు. ఆ తర్వాత, కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న ప్రణామాల నేపథ్యంలో వైసీపీ ఊపిరి పోసుకుంది. దీంతో..
2014 ఎన్నికల నాటికి వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో పోటీ చేసిన వారిలో చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితంగా, ఆంతరంగికంగా మెలిగిన వారిలో తిరుపతి నుంచి భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి నుంచి ఆర్కే రోజా, మదనపల్లి నుంచి డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, జీడి నెల్లూరు నుంచి కలతూరు నారాయణస్వామి, శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన రెడ్డి విజయం సాధించారు. ఈ చరిత్ర వెనుక ప్రధాన కారణం కూడా ఉంది.
జిల్లాలో పెద్దన్న
కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు నుంచి మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో పెద్దన్న పాత్ర పోషించారు. ఆ తరువాత వైసీపీలో కూడా. అయితే, తిరుపతి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాలపై మాత్రం ఆయన పెత్తనం సాగలేదు. ఇక్కడి నుంచి నాయకత్వం వహించిన భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే. రోజా వంటి వారంతా వైఎస్. జగన్ కోటరిలో ఉన్న వారు కావడమే. వారంతా నేరుగా అధినేతతో కాంటాక్ట్లో ఉంటున్నారు. అయితే,
2014 ఎన్నికల నాటికి గతంలో ఓటమి చెందిన సీనీ కధానాయకి ఆర్కే. రోజా వైసీపీ గూటికి చేరారు. అదే సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన అనుయాయులుగా ఉన్న నగరి నియోజకవర్గంలోని ప్రధాన నేతల్లో నిండ్ర మండల నేత రెడ్డివారి చక్రపాణిరెడ్డి, నగరి నుంచి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కేజే. శాంతి, ఆమె భర్త కేజే.కుమార్, వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధరరెడ్డి, పుత్తూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలుమలై (అములు), తో పాటు మిగతా కీలక నాయకులు కూడా వైసీపీలోకి వచ్చారు.
అందరి సహకారంతో
నగరి నియోజవర్గంలో పెద్దిరెడ్డికి విధేయులుగా ఉన్న నాయకులందరి ఇళ్లకు వెళ్లిన ఆర్కే. రోజా మద్దతు కోరారు. పార్టీ వ్యవహారాలను భుజస్కందాలకు ఎత్తుకున్న పెద్దిరెడ్డితో పాటు ఆయన విధేయవర్గం వైఎస్ఆర్ అభిమాన శ్రేణులు అండగా నిలిచాయి. దీంతో,
2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి మొదటిసారి  గాలి ముద్దుకృష్ణమనాయుడుపై సంచలన విజయం సాధించారు. ఆరు మండలాల నాయకులు ఏకతాటిపై నిలిచినా, రోజాకు దక్కిన మెజారిటీ 858 ఓట్లు మాత్రమే. ఆ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ తరువాత ఆమె వ్యవహరించిన తీరువల్ల పార్టీలో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. మళ్లీ..
2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్. జగన్ మెప్పు పొంది టికెట్ సాధించి, టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గాలి భానుప్రకాశ్ పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి వర్గం మొత్తం ఏకతాటిపై నిలిచినా, దక్కింది 2,708 ఓట్ల మెజారీటీ మాత్రమే.
తిరుగుబాటు
నగరి నుంచి రెండు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించినా ఆర్.కే. రోజా 2019 లో అధికారంలోకి వచ్చిన తరువాత రెండెసారి మంత్రివర్గ విస్తరణలో క్యాబినెట్ హోదా దక్కించుకున్నారు. ఆ తరువాత ఆమె సోదరులు కుమారస్వామిరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి పెత్తనం ఎక్కువైంది. అన్ని వ్యవహారాల్లో వారితో పాటు రోజా భర్త ఆర్కే. సెల్వమణి ప్రమేయం పెరిగింది. దీంతో "మాకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. టీడీపీ నుంచి వచ్చిన వారికి మాత్రమే ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారు" అని పెద్దిరెడ్డి విధేయులు నిరసన స్వరాలు వినిపించారు. ఇందులో సర్దుబాట్లకు ఆస్కారం లేకుండా పోయిన స్థితిలో వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధరరెడ్డి బాహాటంగా బయటికి వచ్చారు.
"నేను చేసిన పనులకు బిల్లులు కూడా మంజూరు చేయకుండా అడ్డుపడుతున్నారు. నియోజకవర్గం మొత్తం మీద తన మండలంలోనే వైసీపీకి మెజారిటీ తెప్పించాను" అని పదేపదే ప్రకటనలు చేశారు. ఈ వ్యవహారం మరింత ముదిరింది. అదిఎంతదాకా వేళ్లిదంటే...
2024 ఎన్నికల్లో నగరి నుంచి "ఆర్.కే.రోజాకు టిక్కెట్ ఇవ్వవద్దు. ఇస్తే ఆమె ఓటమికి మా బాధ్యత కాదు" అని ఆరు మండలాల అసమ్మతి నేతలు పార్టీ అధిష్టానానికి హెచ్చరిక చేశారు. "నియోజకవర్గంలో మాలో ఎవరికైనా టికెట్ ఇవ్వండి. లేదంటే, అభ్యర్థిని మార్చండి" అని కూడా అల్టిమేటం ఇచ్చారు. అయినా,
ప్రేక్షకపాత్ర?
వైసీపీ రాయలసీమ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రేక్షకపాత్ర వహించారు. అసమ్మతివర్గం డిమాండ్లను కూడా వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. తాడేపల్లి కార్యాలయం, సచివాలయానికి రావాలనే పిలుపుతో వెళ్లిన అసమ్మతివర్గం నేతల సహనానికి పరీక్ష పెట్టారు. దీనిని భరించలేని వారంతా తిరిగి వచ్చేశారు. దీనిపై కొందరు ఎద్దేవా చేయడంతో సమాధానం చెప్పలేని స్థితిలో ఎన్నికలకు ముందు వారంతా టీడీపీలోకి వెళ్లారు. ఆ తరువాత కూడా వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. పట్టుబట్టి టికెట్ సాధించిన ఆర్కే. రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ చేతిలో ఓటమి చెందారు.
పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఆర్.కే. రోజా నిరాశ వ్యక్తం చేశారు. "మా పార్టీ వాళ్లే నన్ను ఓడించడానికి యత్నిస్తున్నారు" అని చెప్పడం ద్వారా ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో 45,004 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ విజయం సాధించారు.
టీడీపీ క్యాడర్ తోపాటు వైసీపీ నుంచి వెళ్లిన పెద్దిరెడ్డి మద్దతుదారులు ప్రత్యర్థి విజయం కోసం పనిచేశారు. అంతేకాకుండా, వైసీపీలోనే కొనసాగిన రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ కేజే. శాంతి, ఆమె భర్త కేజే. కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు మురళీధరరెడ్డి తోపాటు మరో నలుగురు కీలక నేతలు తటస్థంగా ఉండిపోయారు. వారిని కదిలించడానికి, నష్టనివారణ చర్యలకు కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి చొరవ తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఈ పరిణామాలపై గుర్రుగా ఉన్న రోజా ఫలితాలు వెలువడిన మూడు నెలల నుంచి స్థానికంగా అందుబాటులో లేరు. పది రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించకుని వచ్చిన ఆమె జిల్లాలో కాస్త యాక్టివ్ అయ్యారు. ఫలితాల తరువాతి నుంచి ప్రతీకారం కోసం నిరీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆ.. కిటుకు ఏందన్నా...


ఈ పరిణామాల నేపథ్యంలో నగరిలో ఆర్.కే. రోజా ఓటమితో పాటు చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల వైసీపీ అస్థిత్వం లేకుండా పోయింది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి, రాజంపేట నుంచి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఫలితాల తరువాత తనతో పాటు విజయం సాధించిన 11 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ నిర్వహించిన సమీక్షలో పెద్దిరెడ్డిని ఉద్దేశించి, చురుకైన కామెంట్ చేశారని సమాచారం.

"చిత్తూరు జిల్లాలో అందరూ ఓటమి చెందారు. మీరిద్దరు (పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి) విజయం సాధించారు. ఈ కిటుకు ఏదో నాకు చెప్పి ఉండొచ్చుకదన్నా. మన వాళ్లు అందరూ గెలిచేవారు" అని సెటైర్ వేశారని తెలిసింది. దీంతో లేని నవ్వు ముఖంపై పులుముకున్న పెద్దిరెడ్డి తనదైన సహజశైలిలో మీసాలు సరిచేసుకుంటా, అందరితో నవ్వులు కలిపారంట! ఇదిలావుండగా...
అధికారం కోల్పోయిన మూడు నెలల తరువాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ పార్టీ నిర్మాణంపై మళ్లీ దృష్టి సారించారు. ఇందులో రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు జిల్లా నుంచి తన ప్రధాన అంతరంగికుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ప్రధాన కార్యదర్శి పదవి గత నెలలో కట్టబెట్టారు. తాజాగా పెద్దిరెడ్డికి రాజకీయ వ్యవహారాల సలహా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించిన వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ జిల్లాలో తన కోటరీలోని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో పాటు మాజీ మంత్రి ఆర్.కే రోజాకు అధికార ప్రతినిధుల హోదా కల్పించడం కూడా చర్చనీయాంశంగా మారింది.
రెండు ధృవాలే కదా?
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరవర్గంతో ఓటమి పాలైన మాజీ మంత్రి ఆర్కే. రోజాకు కూడా పార్టీలో ప్రధాన పదవి అప్పగించడం కూడా రెండు పక్షాలను సమన్వయం చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు.
వ్యూహం అమలు


ఎన్నికల నాటి నుంచి గుర్రుగా ఉన్న రోజా తనకు వ్యతిరేకంగా పనిచేసిన నగరి సెగ్మెంట్లోని నేతలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని సమాచారం. వారంతా వైసీపీలోకి పెద్దిరెడ్డి ద్వారా వచ్చిన వారే అని, ఎన్నికల వేళ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని కూడా ఫిర్యాదులో ఆరోపించినట్లు పార్టీ వర్గాల సమచారం. ఫలితాలు వెలువడిన మూడు నెలల తరువాత, వైసీపీ అదిష్టానం మేల్కొన్నట్లు ఉంది. దీంతో నగరిలో కీలక నేతల్లో ప్రధానమైన కేజీ. శాంతి, కేజీ. కుమార్ దంపతులను పార్టీ నుంచి బహిష్కరించడంలో రోజా తనదైన శైలిలో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఆ మేరకు వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్సీ భరత్ ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పెద్దిరెడ్డి, వైఎస్. జగన్ అంతరంగిక నేతల మధ్య సమన్వయం ఎలా కుదురుతుందనేది ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న చర్చ. ఇదిలావుండగా,
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అదనంగా చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల సమన్వయ బాధ్యత కూడా అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. పార్టీలో ఎన్ని కేంద్రాలు ఏర్పడతాయో అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద తనకు వ్యతిరేకంగా పనిచేసిన పెద్దిరెడ్డి విధేయులను పార్టీ నుంచి సాగనంపడంలో మాజీ మంత్రి ఆర్కే. రోజా సఫలం అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News