జంటహత్యలు–విజయవాడలో కలకలం
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.;
విజయవాడ నగరంలో ఓ రౌడీషీటర్ హడలెత్తించాడు. ఇద్దరు యువకులను చంపి భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనతో విజయవాడ నగరం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. జమ్ము కిశోర్ అనే రౌడీషీటర్ బుధవారం ఇద్దరు యువకులను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. విజయవాడ గవర్నరుపేటలోని అన్నపూర్ణ సినిమా హాలుకు సమీపంలో ఈ జంట హత్యల ఘటన చోటుచేసుకుంది. మరణించిన యువకులు విజయనగరం జిల్లాకు చెందిన ఎం రాజు, గాదె వెంకట్‌గా గుర్తించారు. హత్యకు గురైన యువకులు విజయనగరం జిల్లా నుంచి విజయవాడకు వచ్చి క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గవర్నరుపేట అన్నపూర్ణ సినిమా హాలుకు సమీపంలో అద్దె గదుల్లో ఉంటున్నారు. విజయవాడలో కలకలం రేపిన ఈ ఘటన మీద పోలీసులు రంగంలోకి దిగారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీమ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు పాల్పడిన రౌడీషీటర్ కిశోర్ కోసం గాలింపులు చేపట్టారు.