ఇంటి యజమానిని హత్య చేసిన పని మనిషి

విజయవాడలో దారుణం, నమ్మక ద్రోహానికి నిలువెత్తు సాక్ష్యమా?;

Update: 2025-07-11 05:06 GMT
ప్రతీకాత్మక చిత్రం
విజయవాడ నగరంలో విషాదం చోటు చేసుకుంది. పని మనిషిగా వచ్చిన వ్యక్తి చివరకు ఆ ఇంటి యజమాని ప్రాణాలనే తీసి పరారై పోలీసులకు పట్టుబడిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున (జూలై 11 )న జరిగింది. ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న70 ఏళ్ల బొద్దులూరి వెంకట రామారావును పని మనిషి అనూష అమానుషంగా హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు. వెంకటరామారావు తల్లి సరస్వతితో కలిసి ఉంటున్నారు. గతంలో బ్యాంకులో ఉద్యోగం చేసిన రామారావు సొంత ఇంటిలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. తల్లిని ప్రేమతో చూసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇద్దరికీ వయసు మీద పడడంతో సాయం కోసం మూడు రోజుల కిందట అనూషను పనికి పెట్టుకున్నారు. ఆమె కూడా వారితో పాటే ఉండే ఏర్పాటు చేశారు.

రామారావు, తల్లితోపాటు ఆమెను కూడా కుటుంబ సభ్యురాలిగా చూశారు. ఆ మానవత్వాన్ని, నమ్మకాన్ని అనూష భంగపరిచింది. ఒంటిగంట ప్రాంతంలో రామారావును ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు ఆయన తల్లి సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే...
శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైటు వెలిగింది. తల్లి సరస్వతి అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా రామారావు అచేతనంగా మంచంపై పడి ఉన్నారు. ఎక్కడా రక్తం మరకలు లేకపోయినా ఆమె కంగారు పడి చుట్టుపక్కల వారిని లేపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా రామారావు ముఖంపై కారం చల్లినట్టు కనిపించింది. పనిమనిషి అనూష కనిపించలేదు. బీరువా పగలగొట్టి ఉంది.
తల్లి ముందే శవమైన కొడుకు...
మాచవరం పోలీసులు ఆధారాలు సేకరించారు. వేగంగా అనూష కదలికలు గుర్తించారు. తెల్లవారుజామున అనూషను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఒంటరిగా కాదు – తన భర్త సాయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. దిండుతో ముఖాన్ని ఒత్తి ఊపిరాడకుండా చేసి రామారావును హత్య చేశారు. తరువాత ఇంట్లో ఉన్న బంగారం, నగలు అపహరించి పరారయ్యారు.
ఈ ఘటనతో ఎన్టీఆర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నమ్మి పనికి పెట్టుకుంటే ఇంతటి ఘాతుకానికి పాల్పడిందేమిటని పలువురు నివ్వెరపోతున్నారు. ఇంతకు మించిన బాధేమిటంటే కన్న తల్లి కన్నుల ముందే కొడుకు ప్రాణం పోవడం. స్వార్థం, నీతి, నమ్మకం అన్నీ ప్రశ్నార్థకంగా నిలిచాయి.
Tags:    

Similar News