మహాతత్వవేత్త సర్వేపల్లి

‘ఉపాధ్యాయ దినోత్సవం’ సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళి;

Update: 2025-09-05 04:17 GMT

-నందిరాజు రాధాకృష్ణ


స్వాతంత్య్రానంతరం భారతదేశ ప్రథమ ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై ఆ తర్వాత రాష్ట్రపతి పదవి అలంకరించి ఆ పదవికే వన్నె తెచ్చిన మహానీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. బాల్యం నుండే ఆయనకు దైవభక్తి, దేశభక్తి ఎక్కువ. ఆయన ఏక సంతాగ్రాహి. ఆయన అద్భుత జ్ఞాపక శక్తికి ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్య పోయేవారు.. గొప్ప తత్వవేత్తగా, ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించిన రాధాకృష్ణన్ జన్మదినాన్ని ప్రభుత్వం ప్రతియేటా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నది. తత్వశాస్త్రంలో ఎం.ఏ. పూర్తి చేసిన రాధాకృష్ణన్ చిన్నప్పటి నుండే వివిధ మతాచార్యుల బోధనలు విని అందులో విషయ సారాన్ని మిత్రులతో,గురువులతో చర్చించేవాడు.

మతాలనేవి మంచిని పెంపొందించాలని, సకల మానవాళి అభ్యున్నతే అన్ని మతాల సారమని విశ్వసించిన మహానీయుడు రాధాకృష్ణన్ మద్రాస్ లోని తిరుత్తణి గ్రామంలో 1888 సెప్టెంబర్ 5 న వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. రాధాకృష్ణన్ రాసిన వేదాంత నీతిశాస్త్రం గ్రంథం పండితుల ప్రశంసలు పొందింది. ఈ గ్రంథం ఎం.ఏ. విద్యార్థులకు పఠనీయ గ్రంథంగా నిర్ణయించారు. తత్వశాస్త్ర సారమంతా ఈ గ్రంథంలో ఇమిడి ఉంది. ఆదర్శ విద్యార్థియే కాక ఆదర్శ ఉపాద్యాయుడు కూడా. విద్యార్థి దశలోనే ఆయన అనేక మంది పేద విద్యార్థులకు బొఢించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో, మైసూర్ విశ్వవిద్యాలయంలో, కాశీ విశ్వవిద్యాలయంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో తత్వశాస్త్ర ఆచార్యునిగా విశేషమైన పేరు గడించారు.

ఈయన రాసిన ఇండియన్ ఫిలాసఫీ(భారతీయ తత్వము) గ్రంథం మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. అమెరికా మొదలైన దేశాల విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథమైంది. తత్వవేత్తల ప్రవచనాలలోని సత్యాసత్యాలను, బౌద్ధ, జైన, హిందు మొదలైన మతాచార్యులు వెలువరించిన అభిప్రాయాలలోని సారాన్ని గ్రహించిన మహామేధావి రాధాకృష్ణన్. ఆయన ప్రతిభకు గుర్తింపుగా వివిధ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ నిచ్చి సత్కరించాయి. తత్వశాస్త్రంలోని ఆయన ఉపన్యాసాలన్ని ఆదర్శ జీవన దృక్పథం ; పేరిట గ్రంథంగా వెలువడింది. మతం మానవాళికి జీవామృతం అనీ, మత విశ్వాసం శాంతి సాధనమనీ, దైవభక్తి మానవుడిని పతనం నుండి రక్షిస్తుందనీ ఆయన ప్రభోదించారు.

రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా భారత రాజ్యాంగ రచనలో తనవంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1954లో ఆయనకు భారత రత్న అవార్డును ప్రకటించింది. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా పరిగణించి సెప్టెంబర్ 5 న ప్రత్యేకంగా ఉపాధ్యాయులను సత్కరిస్తున్నారు.బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా గాంధీజీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని భారతమాతను దాస్య శృంఖలాలనుండి విముక్తి చేయాలని భావించారు. ఉపన్యాసాల ద్వారా స్వాతంత్ర్య ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమ కాంక్షను రాధాకృష్ణన్ నెలకొల్పారు. రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17 న భౌతికంగా మరణించినప్పటికీ అపరిమిత విజ్ఞానవేత్తగా ఆదర్శప్రాయుడిగా, తత్వవేత్తగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రజలందరి మదిలో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు. 
(నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)


Tags:    

Similar News