చింతూరు వద్ద లోయలో పడిన టూరిస్టు బస్సు, 10 మంది మృతి
విషాదంగా మారిన తీర్థయాత్ర
మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 10 మంది వరకు చనిపోయినట్టు అనధికార వర్గాల సమాచారం. మృతుల సంఖ్యను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
అధికారికంగా ప్రకటించలేదు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. టూరిస్టులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఒకటి లోయలో పడి పోయింది.
దీంతో అక్కడికక్కడే 8 మంది టూరిస్టులు చనిపోయినట్టు ప్రాధమిక సమాచారం. మరో ఇద్దరు ఆ తర్వాత మరణించారని తెలిసింది. బస్సు లోయలో పడినపుడు బస్సులో సుమారు 35 మంది వరకు యాత్రికులు ఉన్నట్టు స్థానికుల కథనం.
ఈ బస్సు చిత్తూరు జిల్లా లో రిజిస్ట్రేషన్ అయింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది.
భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం.
మారేడుమిల్లికి 32 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు 27 అడుగుల లోతులో పడిపోయింది.
పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి...
ఈ బస్సు ప్రమాదంపై సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతి చెందగా, గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
లోకేశ్ ప్రగాఢ సంతాపం...
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో దుర్మరణం పాలవడం బాధాకరం. గాయపడిన వారికి అవసరమైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.