Train carriages on fire| రైలు బోగీల్లో ఎగసిన మంటలు..
తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఘటన.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-14 09:47 GMT
రైలు బోగీలో రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. రైల్వే అధికారులకు కూడా వెంటనే అప్రమత్తం అయ్యారు.
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఔటర్ సిగ్నల్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన కలకలం రేపింది.
అదృష్టవశాత్తు ట్రైన్ మొత్తం ఖాళీగా ఉండడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. సంఘటన సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు అదుపు చేయడానికి శసతవిధాల ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు.
రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న తమిళనాడులోని తిరువల్లూరు వద్ద ఇంధనంతో వెళుతున్న గూడ్స్ వ్యాగన్లు మంటల్లో దగ్ధమయ్యాయి. ఆదివారం జరిగిన ఈ సంఘటనతో బెంగళూరు, కుప్పం నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలను నిలుపుదల చేశారు. ఈ సంఘటన మరువక ముందే..
తిరుపతి రైల్వే స్టేషన్ లో కలకలం
దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు కనెక్టివిటీ ఉంది. ఇక్కడ నుంచి అనేక నగరాలకు రైలు బయలుదేరుతూ ఉంటాయి.
తిరుపతి నుంచి సికింద్రాబాద్కు వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఒకటి.
తిరుపతి నుంచి షిర్డీ వెళ్లే ఎక్స్ప్రెస్ మరో రైలు.
ఈ రెండు రైళ్లు సోమవారం ఉదయం తిరుపతికి చేరుకున్నాయి. ప్రయాణికులు ప్లాట్ఫారంపై దిగేసిన తర్వాత. ఆ రెండు రైళ్ళను లూప్ లైన్ లో ఉంచడానికి షంటింగ్ జరుగుతుంది. అంటే మెయిన్ లైన్ నుంచి పార్కింగ్ పట్టాలపై నిలపడం సర్వసాధారణం.
షిరిడి ఎక్స్ ప్రెస్ బోగీలో..
మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లకు తిరుపతి షిర్డీ ఎక్స్ప్రెస్ రైలును తీసుకువచ్చే సమయంలో ఇంజిన్ వెనక భాగంలో ఉన్న ఖాళీ స్లీపర్ కోచ్ లో మంటలు చేరేగాయి. ఆ పక్క లైన్ లోనే ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ బోగీకి కూడా మంటలు వ్యాపించాయి.
తిరుపతి ఆర్ఓబి (rain over bridge -ROB) కి సమీపంలోని పట్టాలపై రైళ్లు భోగీలు తగలబడుతున్న దృశ్యాలు చూసిన వాహనదారులు కూడా ఆందోళన గురయ్యారు. ఈ పట్టాలకు సమీపంలోని ఉన్న ప్రైవేటు స్టార్ హోటల్ లో కూడా పొగ వ్యాపించడంతో యాత్రికులు ఇబ్బంది పడ్డారు.
ఆ రెండు రైళ్లను లూప్ లైన్ లోకి తీసుకురావడానికి ఇంజిన్ నడుపుతున్న డ్రైవర్, పర్యవేక్షించే సూపర్వైజర్ వెంటనే తిరుపతి స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు కూడా భోగిలకు అంటుకున్న మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.