చంద్రబాబుకు సూటిగా ఐదు ప్రశ్నలు.. 3 రాష్ట్రాల ఎన్నికలే కారణమా?

సరిగ్గా 3 రాష్ట్రాలు- జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో తిరుపతి లడ్డూ వివాదం తెరపైకి తేవడం వెనుక ఆంతర్యం ఏమిటీ?

By :  Admin
Update: 2024-09-23 06:56 GMT

తిరుమల తిరుపతి లడ్డూపై దుమారం కొనసాగుతోంది. ఎవరికి అనువైన వాదనలు వారు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ప్రతిపక్ష వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇదే అదునుగా బీజేపీ కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటూ సరికొత్త రాగాన్ని వినిపిస్తోంది. సరిగ్గా మూడు రాష్ట్రాలు- జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో హిందూ మనోభావాలకు విఘాతమనే అంశం తెరపైకి రావడం దేనికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెంకటేశ్వర (తిరుపతి) ఆలయం దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ అందించే లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆ లడ్డూ నిజంగానే చాలా విశిష్టమైంది. అటువంటి ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో 'గొడ్డు కొవ్వు, పందికొవ్వు' నుంచి తీసిన పదార్థాలను కలిపి వాడారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఆరోపించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని ప్రకటించారు. , తిరుపతి ప్రసాదం అపవిత్రతకు చంద్రబాబు ఆయన సహచర పార్టీలు గత జగన్ ప్రభుత్వం వైపు వెలెత్తి చూపుతున్నాయి. చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన మూడు నెలల తర్వాత ఈ ఆరోపణ చేశారు.

ఈ ప్రసాదం నమూనాలను బిజెపి పాలిత గుజరాత్‌లోని పశువుల ల్యాబ్‌కు పంపారు. ఎందుకంటే ఇలాంటి ల్యాబ్‌లు ఎక్కడా లేకపోవడం వల్ల అక్కడికి పంపినట్టు చెబుతున్నారు. నమూనాలను జూలై 9న అక్కడికి పంపితే జూలై 16న నివేదిక వచ్చింది. అందులో తేలినదాని ప్రకారం పందికొవ్వు, బీఫ్, చేప నూనె వంటి నమూనాలు కనిపించాయని ఆ నివేదిక పేర్కొంది.
ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందీ?
మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు - జమ్మూ, కాశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా ఈ దశలో హిందూ మనోభావాలు దెబ్బతినేలా తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి వచ్చింది. ఇది బీజేపీకి మేలు చేసేలా ఉందన్నది కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే ఆరోపించింది. హిందూ సెంటిమెంట్ తో ఈ రాష్ట్రాల్లో గెలవాలని బీజేపీ విస్తృత ప్రచారం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ విషయాన్నే ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. అందుకు టీటీడీ లడ్డూను కూడా వినియోగించుకోవాలనుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
విచిత్రమేమిటంటే, ఈ షాకింగ్ ఫలితాల గురించి అటు ప్రభుత్వం కానీ ఇటు టీటీడీ గాని స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఓ సందర్భంగా ఓ ఆరేడు కీలక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?
1) 2016 నుంచి ప్రసాదాన్ని పరీక్షించడానికి టీటీడీ వద్ద ఒక అద్భుత ప్రయోగశాల ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. అలాంటపుడు గుజరాత్ ల్యాబ్‌కు నమూనాలను ఎందుకు పంపాలి? సెకండ్ ఓపీనియన్ కోసం వేరే ల్యాబ్ కు ఎందుకు పంపలేదు?
2) టీడీడీ ల్యాబ్ పని చేస్తోందా లేక పని చేయడం లేదా? అసలు ఉందా లేదా? గతంలో లడ్డూల నాణ్యతను పరీక్షించినట్లయితే ఆ నివేదికలు ఎక్కడ ఉన్నాయి?
3) జూలై 16నాటి నివేదిక అకస్మాత్తుగా సెప్టెంబరులో ఎందుకు బయటకు వచ్చింది? ముఖ్యమంత్రి చెప్పేంత వరకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న టీటీడీ పాలకమండలి ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు?
4) ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు జూలైలో డాక్టర్ మహదేవన్, డాక్టర్ బి. సురేంద్రనాథ్, డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణ లతలతో కూడిన డైరీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఏమైందీ? ఎందుకు బయటపెట్టలేదు? అదే విధంగా ప్రసాదం తయారీకి ఉపయోగించే దినుసుల కొనుగోలు కమిటీ సభ్యులుగా ఈనాడు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న ఆనాటి వైసీపీ ఎమ్మెల్యే కె.పార్ధసారధి, ప్రస్తుత టీటీడీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి (గతంలో ఈమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎంపీ), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడైలన కృష్ణమూర్తి వైద్యనాథన్ సభ్యులుగా ఉన్నమాట నిజమైతే వాళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు?
5) కర్నాటక మిల్క్ ఫెడరేషన్ నందిని నెయ్యి ఉత్పత్తిదారు. 2023లో ఈ కంపెనీ నుంచి నెయ్యి కొనడాన్ని ఆపేశారు. నాణ్యత లేకనా ధరలు పెంచిందనా?
6) 'కల్తీ' నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే ప్రక్రియలో బోర్డు ఉందని టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె.శ్యామలరావు అంటున్నారు. మరి అటువంటప్పుడు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్ పేరు ఎందుకు ప్రకటించలేదు?
7)చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో సహా మొత్తం టీటీడీ పాలకమండలి రాజీనామా చేసింది. ఇంతవరకు నియమించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు?
ఈ ప్రశ్నలలో దేనికీ ఖచ్చితమైన సమాధానాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ ప్రతీకార చర్యలు ఆనవాయితీగా వస్తున్నాయి. చంద్రబాబును వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంతకాలం పాటు కటకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడు జగన్ వంతేమోనన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా తోడయితే ఇరువురికీ ఉపయోగపడేలా తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి వచ్చి ఉండవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను పరిశీలించే నాగార్జున యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు.
Tags:    

Similar News