సేవకు వెళాయే.. 15 నెలలకు కుదిరిన ముహూర్తం..

తిరుపతి గంగమ్మ ఆలయం సహా ఏడు ఆలయాల పాలక మండళ్ల ఏర్పాటు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-12 04:23 GMT
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం (షైల్)

తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేస్తూ, దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని యాదవ సామాజికవర్గానికి చెందిన నైనార్ మహేష్ యాదవ్ ను గంగమ్మ ఆలయ చైర్మన్ గా నియమించింది. ఆయనతో సహా 11 మంది పాలక మండలి సభ్యులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా యాదవ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది.


తిరుపతి నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్ చైర్మగా నియమించిన కమిటీలో ఆ పార్టీ నుంచి ఆరుగురు, జనసేన నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఒకరికి పాలక మండలి సభ్యత్వం కల్పిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీ. నరసింహయాదవ్ కు మహేష్ సమీప బంధువు. మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మకు అనుచరుడిగా ఉన్న మహేష్ యాదవ్ గత ఎన్నికలకు ముందు జనసభనా నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులుకు చేరువ అయ్యారు.

తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును కలిసిన మహేష్

సర్దుబాటు కోసమే ఆలస్యం...
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత నామినేటెడ్ పోస్టుల భర్తీలో తాత్సారం జరిగింది. కూటమిలో టీడీపీ తోపాటు జనసేన, బీజేపీ కూడా భాగస్వామ్య పక్షాలుగా ఉండడం వల్ల నామినేటెడ్ పదవుల్లో సమతూకం పాటించడంలో జాప్యం జరిగింది. ప్రాంతాన్ని బట్టి, పార్టీల ప్రతినిధులకు అవకాశం కల్పించడంలో అనేక సమీకరణలను పరిశీలించింది. దీంతో ఎట్టకేలకు కూటమిలోని ఆశావహులకు అవకాశం కల్పించింది. అందులో..
టీడీపీ కూటమి ఏర్పడిన 15 నెలల తరువాత గురువారం రాష్ట్రంలోని ఏడు దేవస్థానాలకు ఆలయ కమిటీలను నియమిస్తూ, దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
1. తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం, తిరుపతి.
2. కుమార రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, సామర్లకోట, కాకినాడ జిల్లా.
3. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా.
4. వీరేశ్వరస్వామి వారి దేవస్థానం, మురమళ్ళ గ్రామం, అంబేద్కర్ కోనసీమ జిల్లా.
5. అస్వర్త నారాయణ & భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏ.పప్పూరు గ్రామం, అనంతపురం జిల్లా.
6. చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం, నందవరం గ్రామం, నంద్యాల జిల్లా.
7. సహస్ర లింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, పొన్నూరు, గుంటూరు జిల్లా.
ఆధ్యాత్మిక క్షేత్రాల నిలయంలో..
రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు జిల్లా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయం. తిరుమలలో శ్రీవారి ఆలయం. శ్రీకాళహస్తిలోని ముక్కంటి క్షేత్రం. పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరుమలకు వచ్చిన యాత్రికులు మిగతా క్షేత్రాలను సందర్శించినదే తిరిగి వెళ్లరు. ఇవన్నీ సీఎం చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలోనే ఉండడం గమనార్హం.
తిరుమల మినహా మిగతా ఏ ఆలయాలకు ఇంతవరకు పాలక మండళ్లు ఏర్పాటు కాలేదు. పదవులను ఆశిస్తున్న నాయకుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. మూడు పార్టీల మధ్య సమన్వయం అనడం కంటే సమతూకం పాటించడంలో జాగ్రత్తలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలిని గత ఏడాదే నియమించింది. మిగతా ఆలయాలకు కమిటీలను ఏర్పాటు చేయడంలో తీవ్ర తాత్సారం చేసింది. పార్టీ నేతల మధ్య సమన్వయం సాధించడం, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంలోనే జాప్యం జరుగుతోంది. దీంతో జిల్లాలోని శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల ఉత్సవాలు కూడా ముగిశాయి. పదవుల కోసం తీవ్ర పోటీ ఏర్పడడం వల్ల పాలక మండలి కూర్పులో జాప్యం జరుగుతోంది.
Tags:    

Similar News