తిరుపతి:భద్రత ఇవ్వకుంటే.. దండన తప్పదు..
ప్రయివేటు బస్సుల్లో తనిఖీలతో దడ పుట్టించిన పోలీస్, ఆర్టీఏ అధికారులు
By : SSV Bhaskar Rao
Update: 2025-10-25 15:24 GMT
కర్నూలు వద్ద ప్రైవేటు బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో ఆర్టీఓ (Road Transport Officer RTO), పోలీస్ (Police) అధికారులు రంగంలోకి దిగారు. ఆర్టీసీకి సమాంతర వ్యవస్థగా మారిన ప్రయివేటు బస్సుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికులతో కూడా మాట్లాడారు. భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.
తిరుపతి జిల్లాలో కొద్దిసేపటి కిందట (శనివారం రాత్రి) పోలీసు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా సిబ్బందితో కలిసి బస్సుల్లో పరిశీలించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో రోడ్డునే అడ్డాగా మార్చుకుని ప్రయాణికులను ఎక్కిస్తున్న ప్రయివేటు బస్సుల వద్దకు ఆర్టీఓ కొర్రపాటి మురళీ మోహన్, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి సారధ్యంలోని సిబ్బంది చేరుకున్నారు.
"జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఆర్టీఏ అధికారులు, సిబ్బందితో కలిసి ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించాం" అని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు. ప్రయాణికుల భద్రత ప్రధానం అని, ప్రైవేట్ బస్సుల యాజమానులు బస్సుల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయన హెచ్చరించార. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు.
బస్సుల్లో భద్రతా ప్రమాణాలతో పాటు రికార్డులు కూడా ఆర్టీఓ మురళీమోహన్, అదనపు ఎస్పీ రవిమనోహరాచారి స్వయంగా తనిఖీ చేశారు.
1. ప్రమాద సమయంలో అత్యవసర తలుపులు సరిగా పనిచేస్తున్నాయా? అని పరిశీలించారు.
2. గాజు బ్రేకర్లు, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు
3. బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ లైసెన్సులు, అనుమతులు సక్రమంగా ఉన్నాయా అని నిర్ధారణ.
4. లగేజ్ కంపార్ట్‌మెంట్లలో మండే పదార్థాలు లేదా చట్టవిరుద్ధ వస్తువులు రవాణా అవుతున్నాయా అని తనిఖీ
5. డ్రైవర్లు రవాణా శాఖ నిబంధనల ప్రకారం పత్రాలు కలిగి ఉన్నారో లేదో పరిశీలించారు.
అదనపు ఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ,
"ప్రయాణికుల భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్నీ సహించం. బస్సులు బయలుదేరే ముందు అన్ని భద్రతా ఏర్పాట్లను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవు" అని అదనపు ఎస్పీ రవిమనోహరాచారి హెచ్చరించారు.
ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు, డ్రైవర్లు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆయన గుర్తు చేశారు. వారివెంట డీటీఓ మురళీమోహన్, ట్రాఫిక్ డిస్పి రామకృష్ణ ఆచారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.