ఆంధ్రప్రదేశ్‌పై పెను ప్రభావం చూపనున్న మొంథా తుపాను ఉపరితల ఆవర్తనంతో అండమాన్ సముద్రంలో మొదలైంది. అది అంచెలంచెలుగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారి కాకినాడ వద్ద తీరాన్ని దాటనుంది. 2025 సంవత్సరంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి తుపాను ఇదే. అరేబియా సముద్రంలో ఇప్పటికే ఈనెల 3న శక్తి తుపాను ఏర్పడింది. సాధారణంగా బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల సీజనులో ఒకట్రెండు తుపానులు సంభవిస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం ఒక్క తుపానుకూ ఆస్కారం లేకుండా ‘నైరుతి’ సీజను ముగిసింది. ఇక ఈశాన్య రుతుపవనాల సీజను అక్టోబర్ మూడో వారం నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సీజనులోనే ఆంధ్రప్రదేశ్‌లో తుపానులు ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. బంగాళాఖాతంలో ఎక్కడ ఏర్పడినా అవి పలుమార్లు ఆంధ్రప్రదేశ్‌లోనే తీరాన్ని తాకుతుంటాయి. అప్పుడప్పుడు తమిళనాడులోనూ ల్యాండ్ ఫాల్ అవుతుంటాయి.
అక్టోబర్‌లో ఆంధ్ర తీరాన్ని దాటిన తుపాన్లు..
ఈశాన్య రుతుపవనాల సీజను మొదలయ్యాక గత 20 ఏళ్లలో అక్టోబర్ నెలలో రాష్ట్రంలో ఏర్పడిన తుపానులను పరిశీలిస్తే.. 2006 అక్టోబర్ 30న ఒగ్ని తుపాను ఒంగోలు–మచిలీపట్నంల మధ్య, 2014 అక్టోబర్ 12న సూపర్ సైక్లోన్ హుద్‌హుద్ విశాఖపట్నంలో, 2018 అక్టోబర్ 11న తిత్లీ అతి తీవ్ర తుపాను శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో తీరాన్ని దాటింది. కాగా అక్టోబర్ 25న క్యాంట్ తుపాను ఏర్పడినా అది ఆంధ్రప్రదేశ్ తీరంలో వాయుగుండంగా బలహీనపడింది.
మొంథా తుపాను కూడా ఏపీ తీరంలోనే..
అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులకు మూలం ఉపరితల ఆవర్తనాలే. ఈ ఉపరితల ఆవర్తనాలు బలపడి తొలుత అల్పపీడనంగాను, ఆపై వాయుగుండంగాను, అనంతరం తుపానులుగానూ రూపాంతరం చెందుతాయి. అల్పపీడనాలు వాయుగుండాలు, తుపానులుగా బలపడడానికైనా, బలహీన పడడానికైనా సముద్ర వాతావరణం దోహదపడుతుంది. సముద్ర ఉష్ణోగ్రతలు, గాలి తీరు, గాలిలో తేమ వంటివి ప్రభావం చూపుతాయి. మరో రెండ్రోజుల్లో ఏర్పడనున్న తుపానును పరిశీలిస్తే.. ఇది తొలుత రెండ్రోజుల క్రితం దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అపై ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం అల్పపీడనంగా మారింది. అనంతరం శనివారం ఉదయానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారనుంది. 27వ తేదీ నాటికి తుపానుగా, 28 నాటి తీవ్ర తుపానుగాను బలపడనుంది. ఈ మొంథా తీవ్ర తుపాను 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం–కళింగపట్నంల మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావం కోస్తాంధ్ర అంతటా ఉంటుందని తెలిపింది.
మొంథా ప్రభావం తీవ్రంగానే..
మొంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. సాధారణంగా వాయుగుండాలే అధిక గాలులతో పాటు భారీ వర్షాన్ని తెస్తాయి. తుపానులైతే అవి మరింత ఉధృతమవుతాయి. అలాంటిది తీవ్ర తుపానులు పెనుగాలులు, కుంభవృష్టిని కురిపించి ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి. మొంథా తుపాను ప్రభావంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 10–15 సెం.మీల వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వీటి వల్ల రోడ్లు, కచ్చా ఇళ్లు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయని అంచనా వేసింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.