జనం నుంచి మళ్లీ వనంలోకి...
చిరుతకు విముక్తి కల్పించిన అటవీశాఖ.;
By : SSV Bhaskar Rao
Update: 2025-08-18 12:57 GMT
తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో బందీగా చిక్కిన ఓ మగ చిరుత మళ్లీ వనంలోకి చేరింది. అటవీశాఖాధికారులు ఆ చిరుతను గుర్తుతెలియని ప్రదేశంలో వదిలారు.
తిరుమల శేషాచలం అడవులకు దిగువ భాగంలో అలిపిరి నుంచి తిరుపతి జూ పార్కు మార్గంలోని అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగింది. దీంతో మనుషులకు ప్రమాదం లేకుండా అటవీశాఖాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మార్గంలో ఇప్పటికి మూడుసార్లు చిరుతలు దాడులకు పాల్పడ్డాయి. ప్రాణనష్టం మాత్రం జరగలేదు.
ఈ మార్గంలో ప్రయాణం సాగించే వారిలో భయాందోళనలు తొలగించడానికి చిరుత సంచారంపై ట్రాప్ కెమెరాలతో అటవీశాఖ నిఘా ఉంచింది. చిరుతను బంధించడానికి నాలుగు ప్రదేశాల్లో బోన్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు మూడు వారాల పాటు అటవీశాఖాధికారులు నిరీక్షించారు.
శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం వెనుక భాగంలో చదునైన ప్రదేశంలోకి చిరుత వస్తున్నట్లు సీసీ కెమెరాల పుటేజీ ద్వారా గమనించారు. దీంతో ఇక్కడ కూడా అటవీశాఖ వైల్డ్ లైఫ్ బయాలజిస్టు లక్ష్మీ సౌజన్య సిబ్బంది ద్వారా ఓ బోను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో ట్రాప్ కెమెరా కూడా ఏర్పాటు చేయించారు.
ఆదివారం రాత్రి 11.30 గంటలకు చిరుత బోనులో చిక్కినట్లు సంకేతం అందుకున్నారు. సోమవారం ఉదయం ఎస్వీయూ ఆవరణలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత సమీపానికి ఎవరూ రాకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు.
సైరన్ మోతతో దట్టమైన అడవిలో...
చిరుత బోను ఓ వాహనంలోకి ఎక్కించిన తరువాత శేషాచలం అటవీ ప్రాంతానికి తరలించారు. దట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని ప్రదేశంలో బోనులో చిరుతను తీసుకుని వెళ్లిన వాహనాన్ని నిలిపారు. ఓ పక్క పచ్చటి పరదా ఉంచి, మరో పక్క అటవీశాఖ వాహనం నిలిపారు. చిరుత బందీగా ఉన్న బోనుపై అటవీశాఖ సిబ్బంది నిలబడ్డారు. అదే సమయంలో సమీపంలోని వాహనం నుంచి సైరన్ మోత అటవీప్రాంతంలో ప్రతిధ్వనిస్తోంది. అదే సమయంలో బోనుపై నిలబడిన సిబ్బంది మెల్లగా బోను తలుపు పైకి లాగారు. కొద్దిగా మార్గం ఏర్పడగానే ఒక్క గెంతులో బయటికి దూకిన చిరుత క్షణాల్లో అడవిలోకి పారిపోయింది.
తిరుపతి తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (Tirupati forest range officer FRO) సుదర్శన రెడ్డి మాట్లాడుతూ,
"బంధించిన చిరుతను మళ్లీ దాని గమ్యస్థానానికి చేర్చాం" అని చెప్పారు. వన్యప్రాణుల వల్ల జనాలకు ప్రమాదం లేకుండా, నివారించడంతో పాటు అడవి జంతువులకు ముప్పు లేకుండా కాపాడడానికి ప్రాధాన్యం ఇచ్చామని ఆయన వివరించారు.
పెరిగిన చిరుతల సంఖ్య?
శేషాచలం అటవీప్రాంతంలో కొన్ని చిరుత పులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చిరుతపులుల మేటింగ్ కు ఇది సీజన్ గా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
"ఆహారం తో పాటు ప్రశాంత కోసం కూడా చిరుతలు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాయి" అని వైల్డ్ లైఫ్ బయాలజిస్టు లక్ష్మీ సౌజన్య చెప్పారు.
తిరుమల గిరులతో పాటు నడకమార్గంలో కూడా నిత్యం జన సంచారం ఉంటుంది. చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులతో పాటు విజిలెన్స్ , టీటీడీ అటవీశాఖాధికారులు కూడా దాదాపు సంవత్సరం నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అలిపిరి నడకమార్గంలో యాత్రికులు ఒంటరిగా కాకుండా గుంపులుగా పంపించడం ద్వారా వ్యక్తిగత భద్రతా సూత్రాలు వివరిస్తున్నారు. తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతల సంతతి కూడా పెరిగినట్టు భావిస్తున్నారు.
"అటవీప్రాంతం, నడకమార్గాల్లో ట్రాప్ కెమెరాలతో నిఘా ఉంచాం" అని వైల్డ్ లైఫ్ బయాలజిస్టు లక్ష్మీ సౌజన్య చెబుతున్నారు. చిరుతల సంచారం తోపాటు వాటి సంతతి పెరుగుదలపై కూడా అధ్యయనం జరుగుతోందని ఆమె వివరించారు. ఇది నిరంతర ప్రక్రియగా అధ్యయనం జరుగుతోందని ఆమె తెలిపారు.
కొన్ని సందర్భాల్లో అనివార్యంగా బంధించే వన్యమృగాల మానసిక స్థితిని పరిశీలించే విధానం కూడా ఉంటుందని ఆమె చెబుతున్నారు. బంధించిన చిరుత లేదా మరేదైన వన్యప్రాణి కదలికలను అధ్యయనం చేసిన, తరువాత మళ్లీ అడవిలో వదలాలా? లేదా? జూ (Zoo) కు తరలించాలా అనేది వివిధ దశల్లో పరిశీలన జరుగుతుందని ఆమె విశ్లేషించారు.