తిరుపతి: మళ్ళీ బాంబు హెచ్చరికలు అలర్ట్ అయిన పోలీసులు

తిరుపతిలో మళ్ళీ కలకలం చెలరేగింది. హోటళ్లలో బాంబులు ఉన్నాయనే హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Update: 2024-10-26 09:18 GMT

దేశంలోని హై అలర్ట్ (High Alert) నగరాల్లో తిరుపతి కూడా ప్రధానమైంది. ఈ పట్టణం నుంచి దేశంలోని అన్ని నగరాలకు ఆకాశయానం, రోడ్డు, రైల్వే కనెక్టవిటీ ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, వీఐపీలు, వీవీఐపీల రాక ఎక్కువగా ఉంటుంది. విదేశీయుల రాక కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉంటారు ఈ పరిస్థితుల్లో...


యాత్రిక నగరం తిరుపతికి రెండోసారి మళ్లీ శనివారం బాంబు హెచ్చరికలు అందాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉదయం నుంచి కపిలతీర్థం ప్రాంతంతో పాటు హోటళ్లలో తనిఖీలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో యాత్రికుల రద్దీతో పాటు స్టార్ హోటళ్లు ఉన్నాయి. చెన్నూ నగరం తరహాలోని భారీ హోటళ్లు యాత్రికులతో రద్దీగా ఉంటుంది. కాగా, శనివారం మళ్ళీ అలిపిరి పోలీస్ స్టేషన్ కు సమీపంలోని హోటళ్లలో బాంబులు ఉన్నాయనే హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. డాగ్, బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించారు. సివిల్ పోలీసులతో పాటు పోలీస్ అధికారులు, కపిలతీర్థం ప్రాంతం, హోటళ్లు, ఆవరణలో ప్రతి అణువూ సునిశితంగా తనిఖీ చేశారు. పోలీసులు సాగించిన తనిఖీల నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని యాత్రికులు కూడా ఆందోళనకు గురయ్యారు. హోటళ్లలో బస చేసిన వారికి ధైర్యం చెప్పడంతో పాటు, వారి వస్తువులను బాంబ్ స్క్వాడ్ బృందం మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రికుల వసతి భవనాల సముదాయం, రద్దీ ప్రాంతాల్లో కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇదిలావుండగా,

"తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్ కు జైలు శిక్ష పడడం. దీనికి తమిళనాడు సీఎం స్టాలిన్ సహకారం అందించడం మాకు నచ్చలేదు" అని అజ్ఞాత వ్యక్తులు ఆ హోటళ్లకు ఈ-మెయిల్ పంపించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా "తమిళనాడు సమీపంలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో హోటళ్లను కూడా పేల్చి వేస్తాం" అని ఆ ఈ-మెయిల్ లో హెచ్చరించారు. తిరుపతి నగరంలోని ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి అలిపిరి మార్గంలో ఉన్న ప్రధాన హోటళ్లకు గురువారం రాత్రి కూడా ఈ-మెయిల్ అందిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు సందేహాస్పద ప్రాంతాలన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వాటిని ఫేక్ మెయిల్స్ గా నిర్ధారించారు. కాగా,


తిరుపతి నగరం కపిలతీర్థం సమీపంలోని ప్రధాన హోటళ్లకు శనివారం మళ్లీ మెయిల్ రావడం, అవన్నీ అలిపిరి పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉండడం వల్ల పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సమాచారం అందిన వెంటనే ఆయా ప్రదేశాలను పోలీసులు జల్లెడ పట్టారు. హోటళ్లలోని గదులను కూడా తనిఖీ చేశారు. ఆ తరువాత అక్కడికి వచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడారు. "హోటళ్లకు అందిన మెయిల్ ఫేక్ " అని నిర్ధారించారు. "కొన్ని రోజుల కిందట తిరుపతి విమానాశ్రయానికి కూడా హెచ్చరిక అందిందని, నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకున్నాం" అని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ఈ పనికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Tags:    

Similar News