TIRUPATI BALOSTAVAM | ప్రతిభకు పదును పెట్టే 'తిరుపతి బాలోత్సవం'

పిల్లల కోసం మూడేళ్లుగా ఓ పండుగ నిర్వహిస్తున్నారు. రెండు రోజుల 'తిరుపతి బాలోత్సవం' ఎలా ఉంటుందో చూద్దాం రండి..

Update: 2024-12-28 04:47 GMT

చిన్ననాటి నుంచే పిల్లల్లో ఏదో ఒక ప్రత్యేక కళ దాగి ఉంటుంది. దానిని గుర్తించి, మరింత సానుపెట్టడానికి ప్రోత్సాహం అవసరం. ఇది తల్లిదండ్రుల తరువాత టీచర్లకే సాధ్యం. ఆ బాధ్యతలను సమాజహితం కోసం ఓ వ్యక్తి తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగి, సీఐటీయూ నేత మల్లారపు నాగార్జున 'తిరుపతి బాలోత్సవం' పేరిట పిల్లల కోసం ఏటా రెండు రోజుల పండుగ నిర్వహిస్తున్నారు.

ఇంకొద్ది సేపటిలో (శనివారం ఉదయం) ఈ పండుగ ప్రారంభం కానున్నది.

తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పిల్లలు పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. తిరుపతి బాలోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, హస్తకళలే కాదు. క్రీడలు, ఏకపాత్రాభినయాలు, పాటల పోటీలు, ఇందులో కూడా దేశభక్తి, జానపద గేయాలు, చిత్రలేఖనం వంటి 30 అంశాల్లో 70 విభాగాల పోటీలు నిర్వహిస్తున్నట్లు 'తిరుపతి బాలోత్సవం' వ్యవస్థాపకుడు మల్లారపు నాగార్జున ' ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
చిన్నారుల్లోని ప్రతిభకు పదును పెట్టడానికి ‘తిరుపతి బాలోత్సవం ’ పేరిట వేదిక ఏర్పాటు చేశారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు
తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ లో పండుగ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవం నిర్వహణకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు నాగార్జున తెలిపారు. ఇందులో తిరుపతి జిల్లాలోలని ప్రభుత్వ, ప్రైవేటు విద్య సంస్థల్లో ఉన్న దాదాపు పది వేల మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనడానికి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు.
వీరందరికి పోటీల నిర్వహణకు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో ప్రత్యేక వేదికలు కూడా ఏర్పాటు చేశారు.
తిరుపతి బాలోత్సవంలో సాంస్కృతిక, హస్త కళలు, క్రీడలు, అకడమిక్‌ విభాగాల్లో మొత్తం 30 అంశాల్లో 70 విభాగాలుగా విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో చిన్నారులకు పోటీలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు వేరువేరుగా పోటీలు, బహుమతులు వుంటాయి.
అకడమిక్ విభాగంలో..

చిత్రలేఖనం, వక్తృత్వం, బొమ్మకు కథ, పద్యం భావం, స్పెల్‌ బి (ఇంగ్లీషు), పదకేళి, కథ చెబుతా...ఊకొడుతారా, గణితం`తర్కం, లేఖా రచన తదితర అంశాల్లో పోటీలు వుంటాయి. సాంస్కృతిక, హస్త కళల విభాగాల్లో ఏకపాత్రలు, జానపద నృత్యం, జానపద గీతాలు, దేశభక్తి గీతాలాపన, క్లాసికల్‌ డాన్స్‌, ఫ్యాన్సీ డ్రెస్‌, శాస్త్రీయ సంగీతం, కోలాటం, ఇన్‌స్ట్రుమెంట్‌, మట్టితో బొమ్మలు తదితర అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. క్రీడా విభాగంలో చెస్‌ పోటీలు కూడా ఏర్పాటు చేశారు.
స్పందన బాగుంది..

తిరుపతి బాలోత్సవం పేరిట 2022లో మొదట పిల్లల కోసం ప్రత్యేక పండుగ నిర్వహించాం. అని 'తిరుపతి బాలోత్సవం' వ్యవస్థాపకుడు మల్లారపు నాగార్జున తెలిపారు. "దాదాపు 3,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. 2023లో ఆసంఖ్య 5,700 వరకు పెరిగింది. ఈ ఏడాది దాదాపు పది వేల మంది విద్యార్థులకు చేరింది" అని నాగార్జున వివరించారు. దీంతో ఏటా డిసెంబర్ లో ఈ ఉత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పోటీలకు అన్ని రంగాల్లో ప్రతిభ కలిగిన వారిని న్యాయ నిర్ణేతలుగా ఏర్పాటు చేసి, పిల్లలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
Tags:    

Similar News