CPM | తిరుపతి : 25ఏళ్ల తరువాత.. సీపీఎం రాష్ట్ర కమిటీ మీట్
తిరుపతిలో ఆ పార్టీ మూడు రోజుల రాష్ట్ర కమిటీ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మూడేళ్ల కాలానికి అజెంగా సిద్ధం చేయనున్నారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-07 11:00 GMT
తిరుపతిలో ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పోలీస్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై చర్చించి, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాట కార్యక్రమాలు రూపొందించనున్నారు. 25 ఏళ్ల తరువాత తిరుపతిలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు యశోద నగర్ లోని వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర రాజకీయలపై ప్రత్యేక తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉంది.
తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రం ( సీపీఎం కార్యాలయం)లో మంగళవారం ఉదయం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి. వాడ నాగరాజుతో కలిసి రాష్ట్ర నేత కందారపు మురళి మీడియాతో మాట్లాడారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు ఏమన్నారంటే..
"రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది" అని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కార్పొరేట్ శక్తులకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఆరోపించారు.
ప్రధాని మోదీ ప్రభుత్వం అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలో కూడా రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. ముఖ్యంగా విభజన హామీల ఊసే లేదన్నారు. వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి పైసా నిధులు కూడా ఇవ్వలేదని నాగరాజు గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై మాట్లాడకుండా దాటవేయడం దారుణం అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను ఆపి, ప్రభుత్వం నడిపించాలని కోరారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ సమస్యలపై పోరాటాలు చేయడం లేదని ఆరోపించారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నియోజకవర్గంలో పేదల ఇల్లు పూజ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధ్యత రహితంగా ఉందని విమర్శించారు.
"రాష్ట్రంలో కోటి మందిపైగా కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు పెరిగిన వారి సమస్యలపై పోరాటాలకు సీపీఎం సమాయత్తం అవుతోంది" అని నాగరాజు వెల్లడించారు. రైతాంగ సమస్యలు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల సమస్యలపై సిపిఎం పోరాటాలు సాగిస్తుందన్నారు.
తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు ఇవ్వాలి
తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి డిమాండ్ చేశారు.
"కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వెచ్చించకూడదు" అని బిజెపి నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది అని కందారపు మురళీ వ్యాఖ్యానించారు. రోజుకు లక్ష మందిపైగా తిరుపతికి వచ్చే యాత్రికులతో పాటు స్థానిక నివాసితులకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇవి పట్టించుకోని బిజెపి నేతలు టీటీడీ నిధులు నగర అభివృద్ధికి వాడకూడదు అని చెప్పడం మంచిది కాదన్నారు.
తిరుపతికి కాకుండా పొరుగు ప్రాంతాల్లో కళ్యాణ మండపాల నిర్మాణం పేరుతో నిధులు మళ్లించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
"టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సిమ్స్ ,బర్డ్, రుయా, మెటర్నటీ ఆసుపత్రికి నిధులు సక్రమంగా కేటాయించడం లేదు. పేదలకు ఉచిత వైద్యం కూడా చేయడం లేదు. అని ఆందోళన వ్యక్తం చేశారు. గరుడ వారిధి నిర్మాణాన్ని అడ్డకున్న బిజెపి తిరుపతి పారిశుద్ధ్యానికి టిటిడి నిధులు వెచ్చించకుండా టీటీడీని అడ్డుకోవడం దారుణం అని కందారపు మురళీ అభ్యంతరం తెలిపారు. మున్సిపల్ కార్మికులు విద్యుత్, ఆశ, మధ్యాహ్నం భోజనం ,ప్రభుత్వ,, ప్రైవేట్ రంగాల్లో పనిచేసిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రానున్న రోజుల్లో సిపిఎం చేపట్టబోయే పోరాటాలు ఈ సమస్యలపైనే ఉంటాయన్నారు.
నేడుబహిరంగ సభ
తిరుపతిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా ఈనెల ఎనిమిదో తేదీన రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశం అవుతుంది. అదే రోజు సాయంత్రం మూడున్నర గంటలకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి విగ్రహం నుంచి భారీ ప్రజా ప్రదర్శన నిర్వహిస్తారు. అనంతరం తుడా కార్యాలయం ఆవరణలోని కచ్చపి ఆడిటోరియంలో సభ నిర్వహించనున్నారు.