TTD | బాబు కళ్లలో ఆనందమే లక్ష్యంగా 'తిరుమల విజన్- 2047'
ఆధ్యాత్మిక తిరుమల నగరంగా మారుతోంది. సీఎం విజన్ టీటీడీ అందిపుచ్చుకుంది. దీనిని సమర్థించమని బీజేపీ చెబుతోంది. ఇంతకీ ఈ విజన్ కథేంటి?
By : SSV Bhaskar Rao
Update: 2024-12-20 15:00 GMT
యాత్రికులకు వసతి. శ్రీవారి దర్శనం. ప్రశాంతంగా ఇళ్లకు తిరుగుముఖం పట్టడం. తిరుమలలో ఇవి ప్రధానం. ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న తిరుమలను నగరంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలతో ముందుకు సాగాలని సంకల్పించారు. ఈ అంశంమే చర్చకు తెరతీసింది.
వినూత్న పథకాలు అమలుకు సీఎం చంద్రబాబుకు ఓ ప్రయోగశాల. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రణాళిక సిద్దం చేస్తారు. తాజాగా ఆయన "స్వర్ణాంధ్ర విజన్ 2047" లక్ష్యంగా డాక్యుమెంట్ సిద్ధం చేశారు. రాష్అభివృద్ధి, వనరుల సమీకరణ, ఆదాయం పెంపుదలకు ఇవి అవసరమే. ఇందులో సందేహం లేదు. దీనిని..
టీటీడీ కూడా అందిపుచ్చుకుంది. కూటమి ప్రభుత్వంలో మొదటి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీఆర్. నాయుడు కూడా చంద్రబాబు బాటలో పయనించాలని భావిస్తున్నారు. టీటీడీ "తిరుమల విజన్ - 2047" కోసం ప్రతిపాదనలకు ఆహ్వానించారు.
ఇందులో ఆయన ప్రస్తావించిన అంశాల్లో
"తిరుమలలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించడం" అనే లక్ష్యాలు ఎంచుకున్నారు. దీనికోసం ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం ఆర్ఎస్పీని విడుదల చేసింది. గత నెల 18వ తేదీ ఆ మేరకు టీటీడీ పాలకమండలిలో కూడా తీర్మానం చేసినట్లు చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఐదేళ్లు అధికారంలో ఉంటుంది. మళ్లీ అధికారంలోకి రావచ్చు. రాకపోవచ్చు. ప్రజల మెప్పు పొందే పథకాలైతే మాత్రం ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చే పార్టీ దానిని పేరు మార్చి అయినా, కొనసాగిస్తుంది. లేదంటే, మళ్లీ ఐదేళ్ల తరువాత అధికారంలోకి వస్తే, బూజు దులిపి, తిరిగి ఆ పథకాన్ని తెరపైకి తీసుకువస్తుంది. టీటీడీలో అలా ఆ పరిస్థితి ఉందా? బోర్డు పదవీకాలం రెండేళ్లు మాత్రమే. ఆ తరువాత వచ్చే చైర్మన్ తనకంటే ప్రత్యేకత ఉండాలని భావిస్తారు. మళ్లీ కొత్త కార్యక్రమం చేపట్టడం. ఇలా మారుతుంది. పరిస్థితి
ఇదిగో సాక్ష్యం
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీడీ ైర్మన్ గా పనిచేసిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే బి.కరుణాకరరెడ్డి కాలంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వినూత్నంగా దళిత గోవిందం, మత్స్య గోవిందం, కల్యాణమస్తు వంటి కార్యక్రమాలు నిర్వహించింది. అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? ఈ పరిస్థితుల్లో....
ఏమి చేస్తారు?
తిరుమల ఆలయ వ్యవహారాలపై అవగాహన ఉన్న ప్రముఖులను 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ' ప్రతినిధి పలకరించారు. "తిరుమల విజన్ - 2047" విజన్ పై తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు పీవీ. రవికుమార్ ఏమంటున్నారంటే.. ఈ విజన్ పేరిట ఏమి చేయాలనుకుంటున్నారు? అని ఎదురు ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ మూడు అంశాలను ప్రస్తావించారు.
"భక్తులకు మంచిదర్శనం కల్పించడం. యాత్రికులకు వసతి సదుపాయం. ఈ రెండు అంశాల అమలుకు టీటీడీలో పెద్ద వ్యవస్థే ఉంది. ఇక ఆలయ వ్యవహారాల పర్యవేక్షణకు జీయర్ స్వాముల వ్యవస్థ ఉంది" అని రవికుమార్ గుర్తు చేశారు. ఇక "కొత్తగా విజన్ ఏమిటని అర్థం కావడం లేదు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది" అని వ్యాఖ్యానించారు. "ఆలయం లేదా సమీప ప్రాంతాల్లో కొన్ని పనులకు ఆగమశాస్త్రం అంగీకరించదు" అని కూడా గుర్తు చేశారు.
బాబు కళ్లలో ఆనందం కోసమేనా
"తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని, ఆధునికతతో సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని సీఎం ఎన్. చంద్రబాబు తెలియజేశారు. తిరుమల ఆధ్యాత్మికం, పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి ముందు చూపుతో భక్తులకు సౌకర్యాలు, వసతిని మెరుగుపర్చాలని టీటీడీ చైర్మన బీఆర్. నాయుడు తన మాటగా చెప్పారు. విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యంలో...
ఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధనలను అనుసరిస్తూ తిరుమల పవిత్రను పెంపొందించేందుకు శాశ్వతమైన వ్యూహాలను అమలు చేయడం. ఉత్తమమైన ప్రణాళికలు, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం. ప్రపంచవ్యాప్తంగా తిరుమలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు టీటీ ప్రయత్నిస్తుంది. అని కూడా ఆయన ప్రస్తావించారు. ఇంతవరకు బాగానే ఉంది.
టీటీడీ చైర్మన్ పదవీకాలం ఎన్నేళ్లు. ఈ విజన్ కు దీర్ఘకాలిక అమలు సాధ్యం అవుతుందా? అనేది ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వానికి విశేష అవకాశాలు ఉంటాయి. ఆ విషయం ముందుగానే ప్రస్తావించుకున్నాం.
టీటీడీలో 2004 నుంచి ఓసారి పరిశీలిస్తే, ఎన్ని కొత్త కార్యక్రమాలు అమలు చేశారు. ఆ తరువాత వాటి మనుగడ ఏమిటనేది ఒకసారి పరిశీలించాల్సిన అవసరాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఆలోచన వల్ల మళ్లీ తెరమీదకు వచ్చాయి. అంటే ఈ ఎపిసోడ్ లో సీఎం చంద్రబాబును మెప్పించడానికి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లే బీఆర్. నాయుడు ప్రణాళిక ఉన్నట్లు కనిపిస్తోంది.
బాబు తీరు వేరు..
వాస్తవానికి చంద్రబాబు సీఎం హోదాలో ఉన్నా సరే. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా.. తిరుమలలో మహద్వారం నుంచి దర్శనానికి వెళ్లకుండా ఓ నియమాన్ని పాటిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ (VAIKUNTHAM Q COMPLEX-1) నుంచే దర్శనానికి వెళుతుంటారు. ఈ పరిస్థితుల్లో తిరుమల విజన్- 2047 అమలుకు ఏమాత్రం సాధ్యం అనేది చర్చకు వచ్చింది.
"టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్యం ఉన్నంతవరకు ఇవన్నీ కష్టం" అని సీనియర్ జర్నలిస్టు రవికుమార్ అభిప్రాయపడ్డారు. "ఏ ప్రభుత్వం అయినా సరే. సీఎం కనుసన్నల్లోనే ఆలయ వ్యవహారాలు మినహా, మిగతా కార్యక్రాలు సాగుతాయనేది జరగమెరిగిన సత్యం" అని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో టీటీడీ అమలు చేసిన కార్యక్రమాల తీరుతెన్నులను ఉదహరించారు.
ఉచిత సేవకు సిద్ధంగా ఉన్నా..
సినిమారంగంలో ఆర్ట్ డైరెక్టర్ గా విశేష అనుభవం ఉంది. తెలంగాణలోని యాదాద్రి ఆలయ నిర్మాణంలో ఆర్కిటెక్ గా ఆయన ఓ యోగిలో శ్రమించారు. టీటీడీ బోర్డులో జనసేన పార్టీ నుంచి ఆనందసాయి నియమితులయ్యారు. మొదటి సమావేశానికి వచ్చిన సమయంలోనే ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు.
"తిరుమలలో యాత్రికులకు మరింత మానసిక ఆనందం కలిగించాలి. కాలిబాటలో కూడా ఆధ్మాత్మిక సౌరభాన్ని వికసింప చేస్తా" అని ఆనందసాయి ప్రకటించారు. తిరుమల ప్లాన్ అందిస్తే, ఉచితంగా మాడవీధులతో పాటు క్షేత్రప్రాధాన్యతకు మరింత సొబగులు దిద్దడానికి ప్రణాళిక తయారు చేసి ఇస్తా" అని ఆనందసాయి ప్రకటించడం ప్రస్తావనార్హం. ఆయన ఉచిత సేవలను టీటీడీ పరిగణలోకి తీసుకున్నట్లు తాజాగా చైర్మన్ బీఆర్. నాయుడు చేసిన ప్రకటన ద్వారా స్పష్టం అవుతోందనడంలో సందేహం లేదు. "తనకు టికెట్ల వ్యవహారం ప్రధానం కాదు. ఆలయ విశిష్టత కాపాడడం. యాత్రికులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన కర్తవ్యం" అని కూడా ఆనందసాయి తిరుమలలోనే ప్రకటించారు. అయినా...
కన్సల్టెంట్లకు ఆహ్వానం
తిరుమల విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు ఇవ్వాలని కూడా టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఆహ్వానించడంతో పాటు ఇప్పటికే తిరుమల పట్టణ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అందులో..
1. తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయడం.
2. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం.
3. తిరుమలలోని పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికి భవిష్య వ్యూహాలను రూపొందించడం.
4. పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టు (DPR)
5. ప్రాముఖ్యత కలిగిన మౌలిక సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం.
వాటి కోసం మూడు వారాల్లోపు ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు సమర్పించాలని కూడా సూచించారు. దీనికి పూర్వానుభవం కూడా ఉండాలనే షరతు కూడా విధించారు.
ప్రణాళిక లక్ష్యాలు
వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణ, ఆధునిక పట్టణ ప్రణాళికలను మిళితం చేసే ఒక బృహుత్తర భవిష్య ప్రణాళికలను రూపొందించడం. తిరుమలలో రాబోవు తరాల్లో మరింతగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే ప్రణాళిక లక్ష్యం. అని వివరించారు.
అంగీకరించేది లేదు...
టీటీడీ చైర్మన్ విజన్ పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యుడు జీ. భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. "తిరుమల ఆలయం మినహా మిగతా ప్రదేశాల్లో అభివృద్ధి పనులకు ఆగమశాస్త్రం అడ్డంకి కాబోదు" అని చెప్పారు. చైర్మన్ బీఆర్. నాయుడు చేసిన ప్రకటన విషయాన్ని ప్రస్తావించగా, ప్లానింగ్ కోసం శ్రీవారి నిధులు దుర్వినియోగాన్ని అనుమతించే ప్రసక్తి లేదు. ఈ నెలలో జరిగే బోర్డు సమావేశంలో దీనిపై గట్టిగా నిలదీస్తా" అని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. "వైకుంఠం -2 కు సమీపంలో నివాసితులు ఖాళీచేయడానికి సంసిధ్దత తెలిపారు. ఆ ప్రదేశంలో యాత్రికుల కోసం మరో యాత్రికుల వసతి సముదాయం (Public Amenities Complex PAC) నిర్మించడానికి అవకాశం ఉంటుంది" అని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడేవిధంగా తిరుమలను కాంక్రీట్ జంగిల్ గా మార్చకూడదనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడే ఉంటాయని భానుప్రకాశ్ రెడ్డి ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
"తిరుమలలో అదనపు భవనాలు నిర్మించకూడదు" అని 2009, అంతకుముందే అనేక సార్లు టిటిడీ పాలక మండలిలో తీర్మానించినా, గో గర్భం డ్యాం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంతో పాటు అనేక కొత్త భవనాలు నిర్మించడం గమనార్హం.
అప్పుడు చేదు...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) తాజాగా తెరమీదకు వచ్చింది. కానీ, ప్రస్తుతం ఆ పద్ధతికి పెద్దపీట వేస్తున్నారు. 2003-04లో టీటీడీ సీవీఎస్ఓ (Chief Vigilance and Security Officer CVSO) కిషోర్ కుమార్ ఉన్నప్పుడే అలిపిరి టోల్ గేట్ వద్ద ఫేస్ రికగ్నైషన్ పద్ధతి అమలు చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఆ యాత్రికుడు ఎక్కడ సంచరిస్తున్నాడనేది సులభంగా గుర్తించడానికి ఆస్కారం ఉంటుందని కూడా చేసిన సూచనను బుట్టదాఖలు చేశారు.
చెదురుతున్న తిరుమల
ప్రతి ఐదేళ్లకోసారి మారే ప్రభుత్వంలో అనుసరించిన విధానాల వల్ల ఆధ్యాత్మిక క్షేత్రం, నగరంతో పోటీ పడేలా మార్చేశారు. టీటీడీ ఈఓగా అజేయ్ కల్లం ఉన్నారు. తిరుమల చరిత్రలోనే జేఈఓగా బాలసుబ్రమణ్యం టీడీపీ ప్రభుత్వ కాలంలో తొమ్మిదేళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. దీంతో శ్రీవారి ఆలయం వెనుకభాగంలోని మఠాలు, నివాసాలు ఖాళీ చేయించారు. ఆ ప్రదేశం ప్రస్తుతం పార్కుగా మారింది. తిరుమల నివాసితులను కూడా తిరుపతికి తరలించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో అనిల్ కుమార్ సింఘాల్ ఈఓగా, అదనపు ఈఓ గా వచ్చిన ఏవీ. ధర్మారెడ్డి పాలనలో తిరుమలకు రింగ్ రోడ్డు రావడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రం రూపు మరో విధంగా మారింది. దీనికి తోడు తిరుమల వన్, టౌ టౌన్ పోలీస్టేషన్, ఓ డీఎస్పీ, మరో అదనపు ఎస్పీకి తోడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో నగరానికి ఏమాత్రం తీసిపోని విధంగా మార్చి వేశారు.
ప్రపంచ గుర్తింపు పొందిన తిరుమలకు రక్షణ పరంగా చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. అవసరం కూడా. అయితే, అవసరానికి మించి ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా యాత్రికులకు చలాన్ల బెడద కూడా ఎక్కువగానే ఉంది. ఇది ఓ రకంగా యాత్రికులకే కాదు. తిరుమల స్థానికులకు కూడా ఇబ్బంది కలుగున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య
ఆ సంస్థ ఏమని చెప్పింది..?
తిరుపతిలో దశాబ్దాల కాలం తరువాత ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. టీటీడీతో పాటు స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన ఈ నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్యకు కాస్త చెక్ పెట్టారు. ఈ నిర్మాణ పనులకు 'లీ కన్సల్టింగ్ అసోసియేట్స్' సేవలు అందించింది. టీటీడీ అధికారుల సూచనలతో ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలో కూడా పరిశీలన జరిపారు.
"తిరుమలలో మల్టీ లెవెల్ పార్కింగ్ అవసరం" అని సూచించినట్లు తెలుస్తోంది. అంతకుమించి, వారేమి ప్రతిపాదించలేదనే సమాచారం. కాగా, ప్రస్తుతం టీటీడీ చైర్మన్ కోరుతున్న "తిరుమల విజన్- 2047" పై ఎలాంటి ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తారు. దానికంటే ముందు టీడీపీ కూటమి కలయికతో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులు ఎలా స్పందిస్తారు. దీనిపై ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తారనేది వేచి చూడాలి.