Crowded inTirumala | రికార్డుస్ధాయిలో దర్శించుకున్న యాత్రికులు

శ్రీవారి క్షేత్రంలో రద్దీ ప్రారంభమైంది.దర్శనానికి 12 గంటలు పడుతోంది. విద్యార్థుల పరీక్షలు ముగిశాక కిటకిటలాడనుంది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-10 04:15 GMT

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం వేలాది మంది శ్రీవారి క్షేత్రానికి వస్తుంటారు. ప్రస్తుత విద్య సంవత్సరం ముగింపు దశలో ఉంది. పదో తరగతి, ఇంటర్మీయట్ పరీక్షలు జరుగుతున్నాయి. వారాంతపు రోజుల్లో మాత్రం యాత్రికుల సంఖ్య తగ్గడం లేదు. ఆ కోవలో రికార్డు స్థాయిలో ఆదివారం (మార్చి 9న) శ్రీవారిని 79,478 మంది యాత్రికులు దర్శించుకున్నారు. అంతకుముందు రోజు ఆ సంఖ్య 74,646 మంది కావడం గమనార్హం. గత ఏడాది ఇదే రోజు 68,446 మంది యాత్రికులు దర్శించుకున్నట్లు టీటీడీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలాఉండగా,

ఆదాయం రూ. 4 కోట్లు
వారాంతం కావడంతో తిరుమలకు యాత్రికులు పోటెత్తారు. దీంతో శ్రీవారికి హుండీ కానుకల ద్వారా 4.05 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు టీటీడీ ప్రకటించింది. గత ఏడాది ఇదే రోజు 3.24 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. నిన్న స్వామివారిని దర్శించుకున్న యాత్రికుల్లో 26,667 మంది తలనీలాలు సమర్పిస్తే, గత ఏడాది ఇదే రోజు 28, 549 మంది తలనీలాలు సమర్పించి, శ్రీవారికి మొక్కులు చెల్లించారు. తిరుమలలో హుండీ ద్వారా మాత్రమే కాకుండా, మొక్కులు చెల్లించే యాత్రికుల తలనీలాల ద్వారా కూడా భారీగా ఆదాయం లభిస్తుంది. ఈ టెండర్ల ద్వారా తలవెంట్రకలు వేలం వేయడం ద్వారా టీటీడీ పారదర్శకత పాటిస్తుంది. ఆ విధంగా ఏటా 1,500 కోట్ల రూపాయల వరకు టీటీడీకి ఆదాయం లభిస్తుంది.
దర్శనానికి 12 గంటలు
తిరుమలలో రద్దీ పెరుగుతున్న కారణంగా శ్రీవారి దర్శనం కూడా ఆలస్యం అవుతోంది. క్యూలలో "యాత్రికులను గంటల తరబడి నిరీక్షింప చేయడం ఒక విధంగా మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు పదవీస్వీకారం చేయడానికి ముందు చెప్పిన మాట. ఈ పద్ధతిని మార్చడం ద్వారా యాత్రికులకు ఇబ్బంది లేకుండా గంటలోపు దర్శనం చేయించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence AI) ద్వారా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రెండు నెలలు కావస్తున్నా, ఆ పద్ధతి ఇప్పట్లో అమలులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో
సోమవారం (మార్చి10వ తేదీ) తిరుమల (తిరుమల) లో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి భారీగా యాత్రికులు క్యూలో నిరీక్షిస్తున్నారు. సుర్వదర్వనానికి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది. గత ఏడాది ఇదే రోజు దాదాపు 18 గంటల పాటు యాత్రికులు క్యూలో నిరీక్షించి, శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
రానున్న రోజుల్లో...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలో కూడా విద్యార్థుల పరీక్షలు పూర్తయిన తరువాత తిరుమల మరింతగా కిటకిటలాడనుంది. దీంతో వేసవి కాలంలో కూడా తిరుమలలో చల్లదనం ఆవహించి ఉంటుంది. విద్య సంస్థలకు వేసవి సెలవులు ప్రకటించిన తరువాత పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ( TTD) ఇప్పటి నుంచే ఏర్పాట్లుకు సమాయత్తం అవుతోంది. వేసవి సెలవుల్లో సమీప రాష్ట్రాల నుంచే కాకుండా, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి యాత్రికుల తాకిడి మరింత పెరగడం సర్వసాధారణం.
తిరుమల చరిత్రలోనే మొదటిసారి 2023 మే నెల 20వ తేదీ 81,833 మంది యాత్రికులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం గమనార్హం.
వేసవి సెలవుల్లో తిరుమల క్షేత్రం మరింత రద్దీగా మారడమే కాదు. వసతికి కూడా ఇబ్బందులు తలెత్తె అవకాశం లేకపోలేదు. గదుల కొరత మరింత సమస్య అవుతుంది. వేసవి రద్దీని ఎదుర్కోవడం తోపాటు యాత్రికులకు సదుపాయాలు కల్పించడానికి టీటీడీ అధికారులు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారనేది వేచిచూడాలి.

Similar News