శ్రీవారికి తలనీలాలతో రూ.150 కోట్ల సిరులు కురిపిస్తున్న యాత్రికులు
తిరుమలలో ప్రయోగాత్మకంగా మరో అధునాతన కల్యాణకట్ట;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-06 08:27 GMT
భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణకట్ట ఏర్పాటు చేస్తే తలనీలాలు సమర్పించే వారి సంఖ్య పెరుగుతుంది, తద్వారా తిరుమలేశుడి రాబడి కూడా పెరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానాల(టిటిడి) పాలక సంస్థ యోచిస్తున్నది. ఆదిశలో ముందడుగు వేస్తోంది. ప్రయోగాత్మకంగా మోడరన్ కల్యాణ కట్ట నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రోజుకు సగటున మూడు నుంచి 3.5 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. స్వామివారిని దర్శించుకునే యాత్రికుల్లో సగం వంతు మాత్రమే సమర్పించే తలనీలాల వల్ల ఏటా 150 కోట్ల ఆదాయం వస్తోంది. 90 శాతం మంది తలనీలాలు సమర్పిస్తే, ఆ ఆదాయం భారీగా పెరుగుతుంది .
దీనిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల రాబడి పెరిగే సంస్కరణలకు తెరతీశారు. అందులో భాగంగానే ఆధునిక కల్యాణకట్ట ఏర్పాటు. టీటీడీ ఈఓ జే. శ్యామలరావు అధికారులతో ఈ ప్రయోగాత్మక కల్యాణ కట్ట ఏర్పాటు గురించి సమీక్షించారు.
యాత్రికుల సెంటిమెంట్
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే యాత్రికులు తలనీలాలు సమర్పిస్తుంటారు. తలనీలాలు సమర్పిస్తామని దేవుడికి మెుక్కు పెట్టుకోవడం ఒక పవిత్రఆశయం. ఈ తలనీలాల మొక్కుబడి చెల్లించుకునేందుకు తిరమల వచ్చే వారు వేలల్లో ఉంటారు.
తిరుమలలో ప్రస్తుతం మూడు అంతస్తుల భవనంలో కల్యాణకట్ట నిర్వహిస్తున్నారు. యాత్రికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వసతి గృహ సముదాయాలకు కూడా కల్యాణకట్టలను విస్తరించారు. దీంతో తిరుమలలో మినీకల్యాణ కట్టల సంఖ్య 11కు చేరింది. వీఐపీ వసతి గృహాలతో పాటు, సాధారణ యాత్రికులు బస చేసే సముదాయాల్లో కూడా కల్యాణకట్టలు ఏర్పాటు చేశారు. ఇక్కడి యాత్రికులకు ఉచితంగా గుండు గీకించుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి. తిరుమలలోని ప్రతి కల్యాణ కట్ట వద్ద యాత్రికుడికి బ్లేడులో అర ముక్క ఇస్తారు. అంటురోగాలకు ఆస్కారం లేకుండా, తలవెంట్రుకలు తడుపుకోవడానికి డెట్టాల్ కలిపిన నీటిని కూడా అందుబాటులో ఉంచుతారు.
ఇంత ప్రాధాన్యత దేనికి
సాధారణంగా ఎక్కడైనా గుండుగీయించుకోవచ్చు. కానీ, తిరుమలలో తలనీలాలు సమర్పించడం అంటే స్వామివారికి మొక్కు చెల్లించడంగా భావిస్తారు. వారికి తెలియకుండానే శ్రీవారికి కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పిస్తున్నారు.
తిరుమలకు సగటున రోజుకు 65 వేల నుంచి 70 వేల మంది యాత్రికులు వస్తుంటారు. వారిలో సగం వంతు మంది తలనీనాలు సమర్పిస్తారు.
జూలై 6న తిరుమల శ్రీవారిని శనివారం రికార్డుస్థాయిలో 87,536 మంది యాత్రికులు దర్శించుకున్నారు. వారిలో 35,120 మంది తలనీలాలు సమర్పించారు. వారందరి ద్వారా కానుకల ద్వారా హుండీకి 3.33 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.
జూలై 5న తిరుమల శ్రీవారిని రికార్డుస్థాయిలో 70,001 మంది యాత్రికులు దర్శించుకున్నారు. వారిలో 28,496 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించారు. వారి వల్ల శ్రీవారి హుండీకి 3.53 కోట్ల రూపాయల ఆదాయం లభించింది.
జూలై 4వ తేదీ 70,011 మంది దర్శించుకుంటే వారిలో 28,496 మంది యాత్రికులు తలవెంట్రుకలు సమర్పించారు. వారందరి వల్ల శ్రీవారి హుండీకి 3.53 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
జూలై 3వ తేదీ 64,015 మంది దర్శించుకున్నారు. వారిలో 26, 786 మంది తలనీలాలు సమర్పించి, ముక్కులు చెల్లించారు. హుండీకి 3.54 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
ఇది కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా రోజుకు హుండీ ఆదాయం లెక్క కనిపిస్తుంది. తలనీలాల విక్రయానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి టీటీడీ ఈ- టెండర్లు నిర్వహిస్తుంది.
యాత్రికులు సమర్పించే తలనీలాలు ఎంతపొడవు ఉంటే అంతర్జాయ మార్కెట్ లో ధర అంత ఎక్కువగా ఉంటుంది.
జట్టు ఎంత ఎక్కువ పొడవుంటే అంత ఎక్కువ ధర
టీటీడీ ఈఓ సాంబశివరావు కాలం నుంచి నెలలో మొదటి గురువారం తలనీలాల ఈ వేలం వేయడానికి చర్యలు తీసుకున్నారు.
2019 సెప్టెంబర్ లో టీటీడీకి రూ. 74 కోట్ల ఆదాయం వచ్చింది.
డిసెంబర్ లో 54,500 కిలోలు వేలం వేస్తే, 37.26 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు.
2022 డిసెంబర్ నెలలో "8,300 కిలోల తలనీలాలకు 9.80 కోట్ట రూపాయల ఆదాయం వచ్చింది" అని అప్పటి జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు.
ఆదాయం ఎందుకు తగ్గుతోంది...
ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టడానికి ముందు తలనీలాల విక్రయాలతో ఆదాయం ఎక్కువగా ఉండేది. 2006-08 మధ్య సుమారు 250 కోట్ల ఆదాయం లభించిందని సీపీఎం నేత కందారపు మురళీ గుర్తు చేశారు.
"ఆ తరువాతి సంవత్సరాలు తగ్గడానికి కారణం ఏమటి" అని మురళీ ధర్మసందేహం వ్యక్తం చేశారు.
కల్యాణకట్ట.. ఇదో పెద్ద వ్యవస్థ
యాత్రికులు తలనీలాలు సమర్పించడానికి వీలుగా టీటీడీ దీనికోసం పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసింది. ప్రధాన కల్యాణకట్టతో పాటు 10 మినీ కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం కూడా ఉంది. ఓ డిప్యూటీ ఈఓ, ముగ్గురు సూపరింటెండెంట్లు, ముగ్గురు అసిస్టెంట్లు, 20 మంది రెగ్యులర్ మేస్త్రీలు,దాదాపు 50 మంది వరకు సహాయక సిబ్బంది ఉంటారు.
తిరుమలలో ప్రధాన కల్యాణకట్ట ఆస్థాన మండపానికి సమీపంలోని హథీరాంజీ మఠానికి సమీపంలో మూడు అంతస్తుల భవనం ఉంది. ఆ తరువాత రాంబగీచ అతిథి గృహాల సముదాయాలు (ఆర్బీజీహెచ్ 1,2,3,) పద్మావతి అతిథి గృహం, సూరాపురం తోట (ఎస్పీటీ), పీఏసీ1,2,3, శ్రీవెంకటేశ్వర అతిథి గృహం, జీఎన్సీ,, నందకం, హెచ్.వీసీ, కౌస్తుభం, సప్తగిరి అతిథి గృహాల వద్ద కల్యాణకట్టలు నిర్వహిస్తున్నారు.
యాత్రికులకు ఇక్కడ తలనీలాలు తీయడానికి వీలుగా దాదాపు 1200 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారు. తిరుమలలో రెండు దశాబ్దాల కాలంతో పోలిస్తే, ఈ సంఖ్య రెట్టింపు అని చెప్పక తప్పదు.
2005 మే నెలలో ప్రత్యేకంగా తొలిసారి మహిళా క్షురకులను కూడా విధుల్లోకి తీసుకుంది. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో వినిపించినా, మహిళా యాత్రికులకు ఇబ్బంది లేకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతించారు. ఆరోజుల్లో తిరుమలలో సుమారు 500 మంది మాత్రమే తలనీలాలు తీయడానికి అందుబాటులో ఉండే వారు. ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగింది.
వెంట్రుకల గ్రేడింగ్
అంతర్జాతీయ మార్కెట్ లో తెల్లవెంట్రుకలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ తరువాత ఎర్రరంగులో ఎన్న వెంట్రుకలు, నలుపు వెంట్రుకలకు వేర్వేరుగా ధర పలుకుతోంది. దీంతో శ్రీవారికి తలనీలాల ద్వారా కూడా ఏటా 150 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది.
2001కి ముందు సంప్రదాయ పద్ధతిలో వేలం నిర్వహించేవారు. ఆ తర్వాత దీన్ని ఆన్‌లైన్ పద్ధతిలోకి మార్చారు. అప్పటి నుంచి తలనీలాల ద్వారా టిటిడికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. టిటిడి కల్యాణకట్టలో సమీకరించే కురులను ఐదు రకాలుగా విభజిస్తారు.
తిరుమల కల్యాణకట్టలో మహిళలకు గుండు గీయడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పొడవాటి వెంట్రుకలను ముడి వేసి, కల్యాణకట్టలోని భారీసైజు హుండీలో భద్రం చేస్తారు. ఇందులో కూడా సైజలవారీగా గ్రేడింగ్ జరుగుతుంది. నీటి తడి ఆరడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
తిరుపతిలోని అలిపిరి సమీపంలోని మార్కెటింగ్ విభాగం గోడౌన్కు తరలిస్తారు. ఇక్కడ 31 అంగుళాలు, అంతకన్నా ఎక్కువ పొడవులు ఉన్న జుత్తును మొదటి రకంగా 16-30 అంగుళాల జుత్తును రెండో రకం. 10-15 అంగుళాల జుత్తు మూడోరకం, 5-9 అంగుళాలు నాలుగో రకం, ఐదు అంగుళాల రకం కన్నా తక్కువ పొడవున్న జుత్తును ఐదోరకంగా విభజిస్తారు. తెల్లజుట్టు ఆరోరకంగా వర్గీకరించి విక్రయిస్తున్నారు.
తిరుపతి గొడౌన్ మొదటి అంతస్తులో 3 స్టోరేజి గదులు, రెండో అంతస్తులో తలనీలాలను ఆరబెట్టేందుకు మూడు హాళ్లు ఉన్నాయి. తలనీలాలను వేరు చేయడం, ఆరబెట్టడం వంటి పనుల కోసం ఇక్కడ రోజుకు 70 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. వీరికి చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కులు, ఆఫ్రాన్లను టిటిడి అందిస్తోంది. టిటిడి కేంద్రీయ వైద్యశాలలో వీరికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. హాళ్లలో వాసన రాకుండా ఉండేందుకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫయ్యర్లు ఏర్పాటు చేశారు. టిటిడి ఉద్యోగుల క్యాంటీన్ నుంచిడి ఇక్కడి సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు.
తిరుమలకు వచ్చే సామాన్య యాత్రికుల ముడుపులే కాదు. తలనీలాల వల్ల కూడా టీటీడి భారీ ఆదాయం లభిస్తున్న విషయాన్ని పరిణలోకి తీసుకున్నారు. ప్రయోగాత్మక కల్యాణకట్ట ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.