తిరుమల లడ్డు : మలుపు తిరిగిన 'నెయ్యి' వ్యవహారం

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం మరో మలుపు తిరిగింది. నెయ్యి సరఫరాపై తమిళనాడు డైయిరీపై టీటీడీ ఎలా స్పందించిందంటే..?!

Update: 2024-09-25 15:39 GMT

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీంతో ఈ కేసు నత్తనడకను తలపిస్తుందని భావించారు. ఊమించని విధంగా టీటీడీ స్పందించిన తీరు ఈ వ్యవహారం మలుపు తిరిగేలా ఉంది. ఆ తరహా పరిణామం బుధవారం చోటుచేసుకుంది. దీనివల్ల నెయ్యి కల్తీ వ్యవహారంలో రగిలిన చిచ్చు ఇప్పట్లో సమసే వాతావరణం కనిపించేలా లేదు. ఇంతకీ తాజా పరిణామం ఏమిటంటే..

పోలీసులకు టీటీడీ ఫిర్యాదు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎట్టకేలకు టీటీడీ స్పందించింది. నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు రాష్ట్రం దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని నెయ్యి సరఫరా చేయడంపై ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అది నాణ్యత లేని నెయ్యి
ఈ ఏడాది మే 15వ తేదీ 10 లక్షల కేజీల నెయ్యి కోసం ఏఆర్ డెయిరీకీ  ఆర్డర్ ఇచ్చామని ఆయన తెలిపారు. జూన్ 12, 20, 25వ తేదీల పాటు జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డెయిరీ సప్లై చేసిందని ఆయన వెల్లడించారు. ఆడల్ట్రేషన్ టెస్టింగ్ లేకుండా.. గతంలో ఉన్న పాత విధానాల టెస్టింగ్ని నిర్వహించి. ఆ నెయ్యిని టీటీడీ వినియోగించిందన్నారు. లడ్డు నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో NDBL సహకారంతో టెస్టింగ్ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. జులై 6, 12వ తేదీల్లో ఏఆర్ డెయిరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలోని నెయ్యిని టెస్టింగ్ కోసం NDBL ల్యాబ్ కు పంపామన్నారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటేబుల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిందని ఆయన చెప్పారు. కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు జూలై 22,23,27 వ తేదీల్లో ఏఆర్ డెయిరీకీ షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నెయ్యిలో తాము ఎలాంటి కల్తీ చెయ్యలేదని సెప్టెంబర్ 4వ తేదీన ఏఆర్ డెయిరీ టీటీడీకి రిప్లై ఇచ్చిందన్నారు. టీటీడీ నియమ నిబంధనలు ఉల్లంఘించి కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్ డెయిరీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్టు కనిపిస్తోంది. అంటే, కల్తీ నెయ్యి సరఫరాపై ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనాన్ని గమనిస్తే, వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన టీటీడీ మాజీ చైర్మన్లు, పాలక మండలి సభ్యులపై కూడా కేసు నమోదు చేస్తారా? అనే సందేహాలు ప్రారంభమయ్యాయి.

గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వినియోగించారు అని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ సీఎం వైఎస్. జగన్ కూడా దీటుగానే స్పందించారు. "కల్తీ నెయ్యి అందినప్పుడు, టెస్ట్ జరిగిన సమయంలో సీఎం ఎవరు? అని ప్రశ్నించారు. "అవన్నీ మీరు (చంద్రబాబు) ప్రభుత్వంలోకి వచ్చాకే జరిగాయి" అని ఎదురుదాడి చేసిన సంగతి తెలిసిందే.
తాజా పరిణామాన్ని పరిశీలిస్తే, ఈ వ్యవహారం మళ్లీ ఏ మలుపు తీసుకుంటుందనేది వేచి చూడాలి.
Tags:    

Similar News