తిరుమల : 'శ్రీవారి' భారమంతా అధికారులపైనే..
రాజకీయ నేతల ప్రమేయం ఎక్కడా లేదు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో అధికారులే కీలకంగా మారారు. భారమంతా వారిపైనే పడింది.
By : SSV Bhaskar Rao
Update: 2024-10-05 09:10 GMT
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనవి. ఏటా నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సాధారణ రోజుల్లో 65 వేల నుంచి 85 వేల మంది వరకు వస్తారు. బ్రహ్మోత్సవాల వేళ ఆ సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ బ్రహ్మత్సవాల నిర్వహణలో నలుగురు అధికారులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారందరికీ టీటీడీ వ్యవహారాలు పూర్తిగా కొత్త కావడం గమనార్హం. వారిలో..
2024: జూన్ 12: సీఎంగా ఎన్. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు.
జూన్ 17: టీటీడీ ఈఓ గా సీనియర్ ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు.
జూలై 28: తిరుమల అదనపు ఈఓగా సీహెచ్. వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు.
జూన్ 24: తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్. సుబ్బారాయుడు బాధ్యతలు స్వీకరించారు.
ఆగష్టు 07: టీటీడీ సీవీఎస్ఓ (చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్) గా ఐపీఎస్ అధికారి ఎస్. శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ నలుగురు కూడా మొదటిసారి టీడీపీ, జిల్లాలో నియమితులయ్యారు. టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత లడ్డు ప్రసాదం, తరిగొండ వెంబమాంబ నిత్యాన్నదాన సత్రంలో ఆహార పదార్థాల్లో నాణ్యత లేవనే ఫిర్యాదుల నేపథ్యంలో పూర్తిగా దృష్టి సారించారు. దాదాపు 20 రోజుల పాటు టీటీడీ పరిపాలన వ్యవహారాలు ప్రధానంగా తిరుమలలో శ్రీవారి దర్శనాలు, సామాన్యుల ఇక్కట్లు, క్యూల క్రమబద్ధీకరణ అంశాలను అధ్యయనం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించారు. సామాన్య భక్తులకు ఇక్కట్లు లేకుంగా కిలోమీటర్ల దూరం గంటల తరబడి నిరీక్షించే భక్తులను క్రమబద్ధీకరించడంతో పాటు వారికి ఉదయం నుంచి రాత్రి వరకు పాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం వంటి సదుపాయలు సక్రమంగా అందేవిధంగా ఓ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏఈఓ స్థాయి అధికారి సారధ్యంలో సిబ్బందిని నియమించారు.
అదనపు ఈవోగా నియమితులైన సీహెచ్. వెంకయ్య చౌదరి కూడా తిరుమలలో అతిథిగృహాలు, కాలేజీల్లో వసతుల కల్పన, అన్నదానం, ప్రసాదాల తయారీ, భక్తులకు అందించే విధానం అధ్యయనం చేయడంతో పాటు వాటిని సక్రమంగా అమలు చేయడానికి విద్యార్థిలా అధికారులు, సిబ్బంది నుంచి నేర్చుకున్నారు. ఈ అనుభవనాలు పాఠాలుగా..
వారికి ఛాలెంజ్
ఇదే సమయంలోబ్రహ్మోత్సవాలు సమీపించాయి. నెల రోజుల నుంచే తిరుమలలో ఏర్పాట్లు ప్రారంభం అవుతాయి. అవి ఓ పక్క జరుగుతుండగానే బ్రహ్మోత్సవాలపై సమగ్రంగా ఈఓ, అదనపు ఈఓ, సీవీఎస్ఓ అధ్యయనం చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమాలు, శ్రీవారి వాహన సేవల నిర్వహణ, లడ్డూ ప్రసాదాలు నిలువ ఉంచడం, రద్దీగా తగినట్లు ఏర్పాట్లు చేయడంపై నెల నుంచి ప్రతి అంశంపై సమీక్షలతో అధికారులు, సిబ్బందిని సమన్వయం చేశారు. ముందస్తు ఏర్పాట్లతో సర్వసన్నద్ధమయ్యారు.
సమయం ఆసన్నమైంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో రెండో రోజు శ్రీనివాసుని వాహనసేవలు నిర్వహించారు. మొదటిసారి ఆ ముగ్గరు అధికారులు సమన్వయంతో పనిచేయడానికి సంసిద్ధమయ్యారు. మొదటిసారి ముగ్గురు అధికారుల సారధ్యంలో బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. టీటీడీ సీనియర్ అధికారులు, సిబ్బంది ఇందులో కీలకం కావడంతో వారి సహకారంతో సాగుతున్నారు. శాంతిభద్రతల సమస్య లేకుండా, యాత్రికులను క్రమబద్ధీకరించడంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సమన్వయం అయ్యారు. తిరుపతి జిల్లా నుంచే కాకుండా, పొరుగు ప్రాంతాల నుంచి కూడా పోొలీసులను రంగంలోకి దించారు. బ్రహ్మత్సవాల నిర్వహణ కత్తిమీద సాములాంటివనడంలో సందేహం లేదు. స్వామివారి సేవలకు భంగం కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది లేకుండా, రాజకీయ ప్రతినిధులను నొప్పించకుండా సాగాలి. ఇంకా వారం రోజుల పాటు ఉత్సవాల నిర్వహణలో వారి పనితీరు ఇంకా ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.
చిన్న అపశృతి :బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు ఆలయం మహద్వారం దాటగానే ధ్వజస్తంభంపై గరుడపటం ఎగురవేస్తారు. ధ్వజారోహణం జరుగుతుండగా, గరుడపటం ఎగురవేసే కొక్కెం విరిగిపడిపోవడం టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనిపై టీటీడీ వివరణ కూడా ఇచ్చింది. "బ్రహ్మెత్సవాల వేళ స్వామివారి వాహనాలను పరీక్షిస్తారు. అందులో భాగంగా ధ్వజపటానికి వేలాదదీసే కొక్కెం మార్చిన అర్చకులు కొత్తది ఏర్పాటు చేశారు" అని స్పష్టం చేశారు. అపచారం జరగలేదు అని స్పష్టం చేశారు.