డిమాండ్‌ అండ్‌ సప్లైని బట్టి టికెట్ల ధరల పెంపు ఉంటుంది

రెండు చేతులెత్త దండం పెడుతున్నా..అందరూ క్షేమంగా ఇంటికెళ్లండి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రేక్షకులకు సూచించారు.;

By :  Admin
Update: 2025-01-04 16:12 GMT

డిమాండ్‌ అండ్‌ సప్లై ఆధారంగా సినిమా టికెట్‌ ధరల పెంపు ఉంటుందని, దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం గేమ్‌ చేంజర్‌ సినిమాకు టికెట్లు పెంచిందని, గేమ్‌ చేంజర్‌ సినిమూ యూనిట్‌కు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గేమ్‌ చేంజర్‌ సినిమా ప్రీరిలీజ్‌ మెగా ఈవెంట్‌ శనివారం రాజమండ్రి సమీపంలోని కడియం వేమగిరి లేఅవుట్‌లో నిర్వహించారు. దీనికి చీఫ్‌ గెస్ట్‌గా పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు. తాను బ్లాక్‌లో టికెట్‌ కొని చెన్నైలో శంకర్‌ జంటిల్‌మెన్‌ సినిమా చూశానన్నారు. టికెట్‌ ధరలను ఊరికే పెంచరని, టికెట్ల ధరలు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. అందుకే టికెట్ల ధరలు పెంచుతారని అన్నారు. తన బీమ్లా నాయక్‌ సినిమాకు గత ప్రభుత్వం టికెట్‌ ధరలను పెంచలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయదన్నారు. టికెట్లు పెరిగిన దానిలో ప్రభుత్వానికి ఇన్‌కమ్‌ వస్తుంది. పెరిగిన ప్రతి రూపాయికి 18శాతం జీఎస్‌టీ ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్‌ రూపంలో ఆదాయం వస్తుందన్నారు.

తెలుగు సినిమాలు, చిత్ర పరిశ్రమపై గత ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వం వ్యవహరించదన్నారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమకూడదన్నారు. వుడ్‌ల పేరుతో భారతీయ చలన చిత్ర రంగాన్ని వేరు చేయొద్దన్నారు. మన జాతి తాలూకు గొప్ప తనాన్ని, ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలని అన్నారు. చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వాళ్లే మాట్లాడాలని, సినిమాలు తీస్తే వాళ్లతోనే తాము మాట్లాడుతామని అన్నారు. సినిమాల టికెట్లతో సినిమా హీరోలతో పనేంటని, నిర్మాతలు, సినిమాను నిర్మించిన వాళ్లు రావాలన్నారు. హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలనేంత కింది స్థాయి వ్యక్తులం తాము కాదన్నారు. గత ప్రభుత్వంలో సినిమా టికెట్లు పెంచాలని హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేష్‌బాబు, ప్రభాస్‌ తదితర ప్రముఖ హీరోలు వచ్చి నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసారు.

చిత్ర పరిశ్రమను గురించి ఇంకా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ తెలుగు చలన చిత్రానికి కూడా బాధ్యత ఉంది. మంచి కథలతో సినిమాలు రూపొందించాలి. సమాజాన్ని మేలుకొల్పే చిత్రాలు రూపొందించాలి. దర్శకులు, కథకులు ఆ విధంగా ఆలోచనలు చేయాలని సూచించారు. ఏపీలో స్టుడియోలు పెట్టండి, ఫిల్మ్‌ మేకింగ్‌ స్కూల్స్, స్టంట్‌ స్కూల్స్, మ్యూజిక్‌ స్కూల్స్‌ పెట్టి ఆంధ్రప్రదేశ్‌ యువతకు ఉపాధి కల్పించాలని తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజుకు సూచించారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగం ఆద్యంతం చిరంజీవి గురించి, ఆయన కుటుంబం గురించి, రామ్‌చరణ్‌ గొప్పతనం గురించి చెబుతూ పులకించి పోయారు. సినిమాలో మంచీ, చెడులు రెండూ ఉంటాయని, ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల ఇష్టమన్నారు.
Tags:    

Similar News