ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.;
By : The Federal
Update: 2025-04-07 14:14 GMT
ఓ పక్క అధిక ఉష్ణోగ్రత్తల దెబ్బతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, మరో వైపు పిడుగులతో కూడిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హడలి పోతున్నారు. రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల వచ్చే మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడుతున్న సమయాల్లో చెట్లు, విద్యుత్ స్థంభాల కింద నిలుచోవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉంటే ఎండలు మండి పోతున్న వేళలో ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. సోమవారం సాయంత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. విజయవాడ నగరంతో పాటు రెడ్డిగూడెం, మైలవరం, తిరువూరు, ఇబ్రహీంపట్నం వంటి పలు మండలాల్లో ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా మండలాల్లోని మామిడి తోటల్లోని మామిడి కాపు దెబ్బతినింది. మామిడి కాయలు రాలిపోయాయి. దీంతో మామిడి పంటకు బాగానే నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అటు మామిడి రైతులు, ఇటు మామిడి వ్యాపారులు కూడా ఆందోళనలో ఉన్నారు. దీంతో పాటుగా ఈదురు గాలులు, భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో అయితే థర్మల్ కేంద్రంలోని బూడిద ఈదురు గాలులకు ఎడిసిపడింది. దీని వల్ల వీటీపీఎస్ చుట్టు పక్కల ప్రాంతాలు బూడిద వచ్చి చేరింది.