ఏపీకి రండి..పెట్టుబడులు పెట్టండి

యూఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు.

Update: 2025-10-22 15:13 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో తొలి రోజు వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించారు. షరాఫ్ గ్రూప్ వైస్ ఛైర్మన్, షరాఫ్ డీజీ సంస్థ వ్యవస్థాపకుడు షరాఫుద్దీన్ షరాఫ్‌తో భేటీ అయిన సీఎం, రాష్ట్రంలో లాజిస్టిక్స్ ప్రాజెక్టులు, గిడ్డంగుల ఏర్పాటుకు ఆహ్వానించారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, మానవ వనరులు, పారిశ్రామిక కారిడార్ల గురించి వివరించిన చంద్రబాబు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.

షరాఫ్ గ్రూప్‌తో చర్చలు

షరాఫ్ గ్రూప్ ఇప్పటికే భారత్‌లోని పలు రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ పార్కులు అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు స్థాపించాలని సీఎం కోరారు. దీనికి ఆసక్తి చూపిన షరాఫ్ గ్రూప్, తమ అనుబంధ సంస్థ హింద్ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా లాజిస్టిక్స్ సదుపాయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమని తెలిపింది. రైల్వే, పోర్ట్ అనుసంధానం కలిగిన ప్రాంతాన్ని గుర్తించాలని షరాఫ్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "మా రాష్ట్రంలో పోర్టులు, నేషనల్ హైవేలు విస్తారంగా ఉన్నాయి. కార్గో రవాణాకు అనుకూలం. కొత్త పాలసీలు తెచ్చాం. అవసరమైతే పాలసీల్లో మార్పులు చేస్తాం. లాజిస్టిక్స్‌పై 14 శాతం ఖర్చు పెడుతున్నాం. దీన్ని 8-9 శాతానికి తగ్గించాలని చూస్తున్నాం. పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్ పరిశ్రమలు వస్తున్నాయి. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు హాజరుకండి" అని ఆహ్వానించారు. దీనికి స్పందించిన షరాఫ్ ప్రతినిధులు, భారత్‌లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నామని, ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా వస్తామని చెప్పారు.

తొలి రోజు భేటీలు

తొలి రోజు ఉత్సాహంగా పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహించిన సీఎం చంద్రబాబు, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని, గతాన్ని గుర్తు చేసుకున్న పలు కంపెనీల ప్రతినిధులు, నవంబర్ 14,15 తేదీల్లో విశాఖ సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. ముఖాముఖీ భేటీల్లో గూగుల్ పెట్టుబడులపైనా చర్చ జరిగింది. రాష్ట్రంలో పర్యటనకు, పెట్టుబడులకు తమ ఇష్టాన్ని ప్రదర్శించిన ఆయా సంస్థల ప్రతినిధులు, బ్రేక్ లేకుండా వరుసగా మీటింగ్‌లు అటెండ్ అవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం సందర్శనకు బయలుదేరారు.

ట్రాన్స్ వరల్డ్ గ్రూప్‌తో సమావేశం

ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్‌తో సమావేశమైన సీఎం, దుగరాజపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, లాజిస్టిక్స్ వ్యయం తగ్గించాలనే ఆలోచనలతో ఉన్నామని వివరించారు. త్వరలో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. రైలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.

బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్‌తో చర్చలు

బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్‌తో సమావేశమైన సీఎం, వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చిన బుర్జిల్ సంస్థ, వైద్యారోగ్య రంగంలో ప్రివెంటివ్-క్యూరేటీవ్ విధానాన్ని అవలంభిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కార్డుల డిజిటలీకరణ ప్రాజెక్టును పైలట్‌గా చేపట్టినట్టు వివరించారు. వైద్యారోగ్య రంగంలో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌పై అనుభవం కలిగిన బుర్జిల్, అబుదాబిలో అతి పెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తోంది.

Tags:    

Similar News