రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ సంస్థల ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని వెను వెంటనే ప్రాజెక్టుల స్థాపనకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు కూడా నిర్వహించగా... మరి కొన్ని కంపెనీలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామిక వేత్తలను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 11 నెలల కాలంలో ఎస్‌ఐపీబీ ఇప్పటికి 6 సార్లు సమావేశం కాగా, 76 ప్రాజెక్టులకు సంబంధించి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. తాజాగా గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 6వ ఎస్‌ఐపిబి సమావేశంలో 19 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటికి సంబంధించి రూ. 33 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఎనర్టీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు... ప్రాజెక్టుల శంకుస్ధాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలి. ఆయా సంస్ధల పెట్టుబడులు, క్షేత్ర స్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డ్ తీసుకురావాలి. తద్వారా ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకోవచ్చు. పెట్టుబడులతో పాటు వచ్చిన ఉద్యోగాల వివరాలతో పోర్టల్ రావాలి. ఎస్‌ఐపిబి సమావేశాల్లో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలపడంతో పాటు... ఇప్పటికే ఆమోదం తెలిపి ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రోగ్రస్ వివరించాలి’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
50 వేల హోటల్ రూములు లక్ష్యం
టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై సిఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘టూరిజం సెక్టార్‌లో హోటళ్లు, రూముల కొరత ఉంది. పెద్దఎత్తున హొటల్ రూమ్‌లు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుంది. 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తేవాలనేది మన ముందున్న లక్ష్యం. హోటల్ రూమ్‌ల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారు. కారవాన్స్‌కు సంబంధించి పాలసీని కూడా సిద్దం చేసి అమల్లోకి తేవడం ద్వారా కొత్త పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. తద్వారా పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా దేవాలయాలకు వచ్చే వారికి మంచి వసతి అనేది చాలా ముఖ్యం. కుటుంబాలతో వచ్చే వారు ప్రశాంతమైన, పరిశుభ్రమైన వాతారవణంలో ఉండాలి అనుకుంటారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచే చర్యలు తీసుకోవాలి. టెంట్లు (గుడారాలు) ఏర్పాటు చేసి వసతి కల్పించే ప్రాజెక్టులను ప్రారంభించాలి. అదే విధంగా గోదావరి, కృష్ణా నదుల వద్ద నిర్వహిస్తున్న హారతుల కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభ పెంచేలా చేపట్టాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. పారిశ్రామికరంగంపై మాట్లాడుతూ... ‘వ్యవసాయ వ్యర్ధాలను కొన్ని చోట్ల తగలబెడుతున్నారు... దీన్ని నివారించాల్సి ఉంది. చిన్నచిన్న ప్లాంట్ల ద్వారా అగ్రికల్చర్ వేస్ట్‌ను సర్క్యులర్ ఎకానమీగా మార్చాలి. అగ్రికల్చర్ వేస్ట్‌ను సద్వినియోగం చేసుకునే పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి’ అని సిఎం సూచించారు.
6వ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపిన పెట్టుబడుల వివరాలు
6వ ఎస్‌ఐపీబీ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 19 సంస్థలకు సంబంధించి రూ. 33,720 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
సంస్థలు–పెట్టుబడులు–ఉద్యోగాలు
1) డెక్కన్ ఫైన్ కెమికల్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ : కుమరవరం, అనకాపల్లి జిల్లా – రూ.1,560 కోట్ల పెట్టుబడులు, 1,800 ఉద్యోగాలు.
2) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ : పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లా – రూ.1,400 కోట్ల పెట్టుబడులు, 800 ఉద్యోగాలు
3) పీయూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : ఓర్వకల్, కర్నూలు జిల్లా – రూ.1,286 కోట్ల పెట్టుబడులు, 1,200 ఉద్యోగాలు
4) బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ : రాంబిల్లి, అనకాపల్లి జిల్లా – రూ.2,300 కోట్ల పెట్టుబడులు, 1,750 ఉద్యోగాలు
5) జుపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ : రాంబిల్లి, అనకాపల్లి జిల్లా – రూ.2,700 కోట్ల పెట్టుబడులు, 2,216 ఉద్యోగాలు
6) రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ : తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా – రూ.228 కోట్ల పెట్టుబడులు, 250 ఉద్యోగాలు
7) మోహన్ స్పింటెక్స్ : మాలవల్లి, కృష్ణా జిల్లా – రూ.482 కోట్ల పెట్టుబడులు, 1,525 ఉద్యోగాలు
8) ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ : అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా – రూ.1,779 కోట్ల పెట్టుబడులు, 600 ఉద్యోగాలు
9) వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి జిల్లా – రూ.1,061 కోట్ల పెట్టుబడులు, 10,098 ఉద్యోగాలు
10) అలీప్ కుప్పం : చిత్తూరు జిల్లా – రూ.5 కోట్ల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు
11) నితిన్ సాయి కనస్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ : ఏలూరు జిల్లా – రూ.150 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు
12) దేశ్‌రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు – రూ.2,920 కోట్ల పెట్టుబడులు, 230 ఉద్యోగాలు
13) ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ : కడప జిల్లా – రూ.3,941 కోట్ల పెట్టుబడులు, 260 ఉద్యోగాలు
14) బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు – రూ.9,000 కోట్ల పెట్టుబడులు, 3,900 ఉద్యోగాలు
15) బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్‌ఎల్ పి: తిరుపతి – రూ.150 కోట్ల పెట్టుబడులు, 350 ఉద్యోగాలు
16) స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి – రూ.327 కోట్ల పెట్టుబడులు, 570 ఉద్యోగాలు
17) వరుణ్ హాస్పటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ : విశాఖపట్నం – రూ.899 కోట్ల పెట్టుబడులు, 1,300 ఉద్యోగాలు
18) డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీసిటీ, తిరుపతి జిల్లా – రూ.2,475 కోట్ల పెట్టుబడులు, 5,150 ఉద్యోగాలు
19) సెన్సోరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : కర్నూలు జిల్లా – రూ.1,057 కోట్ల పెట్టుబడులు, 622 ఉద్యోగాలు.