ఒకే జిల్లాకు ఆ ఐఏఎస్, ఐపీఎస్‌లు

అందరికీ ఆదర్శిం. అందుకే భార్య భర్తలైన ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. వారి సేవలను ఒకే జిల్లాలో ఉపయోగించుకుంటోంది. వీరి పని తీరును మెచ్చుకున్న ప్రభుత్వాలు ఇద్దరినీ ఒకే జిల్లాలో నియమిస్తూ ప్రోత్సహిస్తున్నాయి.

Update: 2024-07-22 13:41 GMT

వీరిరువురూ భార్యా భర్తలు. ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్‌. ఇద్దరూ ఒకే చోట ఇంజనీరింగ్‌ చదివారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీలో (ఐఐటీ) ఖరగ్‌పూర్‌ అంటే తెలియని వారు ఉండరు. ఒకరిది తెలంగాణ, మరొకరిది ఆంధ్రప్రదేశ్‌. ఒకరికి వడిస్సా కేడర్‌ రాగా మరొకరికి ఏపీ కేడర్‌ వచ్చింది. ఇరువురూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం చివర్లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్నారు. వీరి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు వీరి గురించి చెప్పాల్సి వస్తోంది.

కొమ్మిన ప్రతాప్‌ శివ కిశోర్‌ 2019 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన వారు. చుంచులూరు జిల్లా పరిషత్‌ హైస్కూలులో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్‌ నవోదయ స్కూళ్లో 9,10 తరగతులు చవివారు. నెల్లూరులోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ చదువు పూర్తిచేసి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేశారు. (బయో టెక్నాలజీ, బయో కెమికల్‌ ఇంజనీరింగ్‌) ఇంజనీరింగ్‌ పూర్తి కాగానే సివిల్స్‌ రాశారు. రెండు సార్లు సివిల్స్‌ రాలేదు. మూడో సారి పట్టుదలతో సాధించారు. 153వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌ తీసుకున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వెంటనే బెంగళూరులోని బోచ్‌ సెంటర్‌లో సీనియర్‌ సైంటిస్ట్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌లో 4 సంవత్సరాల 2నెలలు పనిచేశారు. రీసెర్చ్‌ కన్సల్‌టెంట్, స్టూడెంట్‌ అడ్వయిజర్‌గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. 2018లో హైదరాబాద్‌ సర్థార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అకాడమిలో శిక్షణ పూర్తిచేసుకుని కర్నూలు జిల్లాలో మొదట ఉద్యోగ ట్రైనింగ్‌ పూర్తి చేశారు. ఎమ్మిగనూరులోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆయన ఐపీఎస్‌ ప్రస్థానం ప్రారంభమైంది. మొదట అక్కడే రికార్డుల పరిశీలన జరిగింది. తండ్రి కొమ్మి నారాయణ, తల్లి నిర్మల హృదయ్‌ ప్రశాంతి. తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేశారు. తల్లి గృహిణి.
పెద్దిటి ధాత్రిరెడ్డి. ఈమె మొదట ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామంలో జన్మించారు. 2019లో ఐపీఎస్‌ సాధించి ఖమ్మం జిల్లాలో పనిచేశారు. ఆ తరువాత ఐఏఎస్‌ సాధించాలనే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి సివిల్స్‌లో 46వ ర్యాంకు సాధించారు. 2020 అక్టోబరులో సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఒడిస్సా కేడర్‌కు ఎంపిక కాగా అక్కడి నుంచి 2023లో ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యారు. మొదటి సారిగా పాడేరు సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2001 నుంచి హైదరాబాద్‌లోని జోసఫ్‌ పబ్లిక్‌ స్కూలులో చదివారు. 2019 నుంచి 2011 వరకు ఎస్‌టీ ప్యాట్రిక్స్‌ జూనియర్‌ కాలేజీలో చదివారు. 2011 నుంచి 2015వరకు ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేశారు. 2021 జూన్‌ 19న తల్లి చనిపోయింది. 43 రోజుల పాటు కరొనా పోరాటం చేసి మృతి చెందారు. క్యాన్సర్‌ను జయించినప్పటికీ కరోనాను మాత్రం ఎదుర్కోలేక పోయింది. తల్లి పేరు పి సుశీల. తండ్రి కృష్ణారెడ్డి. తల్లి ఆదర్శాలైన దయ, సానుభూతితో తనలో ఉన్నట్లు పలు చోట్ల చెప్పారు.
ఎందుకు వీరికి ఇంత క్రేజ్‌
కెపిఎస్‌ కిశోర్, పి ధాత్రిరెడ్డిలు భార్యా భర్తలు, భర్త ఐపీఎస్, భార్య ఐఏఎస్‌. భార్య కూడా మొదట ఐపీఎస్‌ సాధించి ఆ తరువాత ఐఏఎస్‌ సాధించారు. ఇరువురూ మొదట ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా అయిన పాడేరులో ధాత్రి సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. చింతపల్లి ఏఎస్‌పీగా కిశోర్‌ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో వీరు ఏజెన్సీ ఏరియాలో గొప్పగా పనిచేశారనే పేరు సంపాదించారు. ఇరువురికి సేవ చేయాలనే ఆలోచన ఉంది. అప్పటికే వీరిరువురికీ వివాహమైంది. భార్యా భర్తలు కావడం వల్ల ఎక్కడికైనా వెళ్లేందుకు వెనుకాడే వారు కాదు. చింతపల్లి, పాడేరు రెండు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. ఇక్కడ గిరిజనులు కేవలం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు. ఇక్కడి పిల్లలకు, ప్రతి ఒక్కరికి విద్య అందేలా వీరిద్దరు చర్యలు తీసుకున్నారు. పిల్లలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించడంలో సక్సెస్‌ అయ్యారు. ప్రభుత్వ వైద్యం సకాలంలో అందుతుందా లేదా అనే దానిపై నిత్యం తెలుసుకునే వారు. వైద్య సిబ్బందిపై ఏ చిన్న ఇబ్బంది ఉన్నా దానిని సరిదిద్దే వారు. ధాత్రి చదువుకునే రోజుల్లోనే సేవా కార్యక్రమాలపై ఎక్కువుగా దృష్టి పెట్టే వారు. 2016లో ఆమె ఆధ్వర్యంలో ఫీడ్‌ ఇండియా అనే ఎన్‌జీవోను స్థాపించారు. హైదరాబాద్‌లోని హోటల్స్‌లో మిగిలి పోయిన ఆహారాన్ని సేకరించి ఆహారం అందని నిరుపేదలకు పంచి పెట్టేవారు. ఇలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా ఏజెన్సీలోని గిరిజనుల బాగోగులు చూసే వారు. వీరిపై గిరిజనులు కూడా అంతేవిధంగా అభిమానం పెంచుకున్నారు. ఇద్దరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నవారే. ఇద్దరూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నేపథ్యం ఉంది. ఆ మూలాలు మరిచిపోలేదు. సివిల్‌ సర్వెంట్లుగా ఉన్నప్పటికీ ఎవరి వద్దకైన చొచ్చుకొని పోయే మనస్థత్వం ఉన్న వారు కావడం విశేషం. ఇద్దరిలో అహంకారం ఏ కోశాన కనించదు.
అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వీరిరువురిని టీడీపీ ప్రభుత్వం ఏలూరు జిల్లాకు బదిలీ చేసింది. ఏలూరు ఎస్పీగా కేపీఎస్‌ కిశోర్, ఏలూరు జాయింట్‌ కలెక్టరుగా పెద్దిటి ధాత్రిరెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇరువురు కలిసి పలు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. పాఠశాలలు, గ్రామాల్లో అధికారులు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయాలను కిషోర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వివిరంగా చెబుతూ పలువురి మన్ననలను పొందారు. ఇంజనీరింగ్‌ చదివినందు వల్ల ఇరువురికి కంప్యూటర్‌ నాలెడ్జిపై పూర్తి అవగాహన ఉంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ధాత్రి ప్రధానంగా తన స్నేహితులు, తాను మరిచిపోలేని సంఘటనలు, ప్రకృతిలో వైవిద్య భరితమైన ఫొటోలు ఎక్కువుగా షేర్‌ చేస్తూ అందుకు సంధించిన వివిరాలను పోస్టు చేస్తుంటారు. ఈ వివరాలు పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఏమైనా ఇద్దరు అధికారులు ఏపీలో ఒకే జిల్లాలో పని చేయడం అందరి మన్ననలు పొందడం అభినందనీయమని చెప్పొచ్చు.
Tags:    

Similar News