ఏపీ ప్రభుత్వంలో ఆ నలుగురే కీలకం
రాష్ట్రాన్ని నలుగురు వ్యక్తులు పాలిస్తారు. ఇప్పటికే ముగ్గురు వ్యక్తుల చేతుల్లో పాలన ఉంది. ఇకపై మరో వ్యక్తి రాబోతున్నారు. ఆయనతో కలిపి నలుగురు ఆదేశించిందే శాసనం.;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో కీలకంగా ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం ఉన్నారు. పేరుకు మాత్రమే కూటమి ప్రభుత్వం. బీజేపీ నుంచి పాలనా పరమైన నిర్ణయాలు తీసుకునే నిర్ణేతలు లేరని చెప్పాలి. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆమె మరిది ఎలా చెబితే అలా ముందుకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో పాలనలో బీజేపీ వారిని పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. కూటమిలో పెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. రెండో పెద్ద పార్టీగా జనసేన పార్టీ ఉంది. అందుకే జనసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు ఇచ్చారు. ఈ పదవి కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఇచ్చినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమిని 2014లోనే వీడింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కూటమిలో ఉంటూ వచ్చారు. దీంతో ప్రధాన మంత్రితో సన్నిహితత్వం పవన్ కు ఏర్పడింది.
ప్రధాని ఆదేశాల మేరకేనా...
ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు పవన్ కల్యాన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో పవన్ కల్యాన్ తనకు తాను రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అప్పుడు జైలు గోడల మధ్య ఉన్న చంద్రబాబు చెప్పిన ప్రకారం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, జనసేన పార్టీ ఓటు చీలకుండా చూస్తానంటూ పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కూటమిలో బీజేపీ కలవడంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్ ను దగ్గరకు తీసుకున్నారు. ఎన్నికల్లో కూటమికి అనూహ్య విజయం లభించింది.
ఎప్పటికప్పుడు తన పట్టు నిలుపు కొంటున్న పవన్
ఎన్నికల్లో గెలిచిన తరువాత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత పాలనలోనూ తనకంటూ ప్రత్యేకత ఉందంటూ ప్రకటించుకునేలా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను పవన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి ప్రకటించగానే దానిని అందిపుచ్చుకున్న పవన్ కల్యాణ్ తాను ఈ విషయంలో చాలా పశ్చాత్తాప పడుతున్నానని, ఇందుకు పశ్చాత్తాప దీక్ష తీసుకుంటున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. శాంతి భద్రతలు సరిగా లేవని, హోం మంత్రిగా వంగలపూడి అనిత సరిగా బాధ్యతలు నిర్వహించడం లేదన్నంతగా పిఠాపురంలో మాట్లాడి సంచలనం సృష్టించారు. దీనిపై తరువాత మంత్రివర్గంలో చర్చ జరిగి ఇప్పుడు ప్రత్యేకించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైఎస్సార్సీపీ వారిని వెంటాడే పరిస్థితి తీసుకొచ్చారు.
ఇక ఇటీవల కాకినాడ పోర్టులో హంగామా సృష్టించారు. పవన్ కల్యాణ్ తనిఖీలు చేసి చివరకు జగన్ కాకినాడ పోర్టును స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారనే స్థితికి తెచ్చారు. ఇలా ఏదో ఒక సందర్భంలో పవన్ కల్యాణ్ తన మాటలు, చేతలతో పాలనలో అడుగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు సరి దిద్దుకునే పనిలో ఉన్నారని చెప్పొచ్చు.
పట్టు తప్పుతుందేమోననే భయంలో చంద్రబాబు
పాలనలో తన పట్టు తప్పుతుందేమో అనే భయంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఒక వైపు తన కుమారుడు నారా లోకేష్ పాలనలో తనకంటూ ప్రత్యేక శైలి ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే మంత్రలుగా స్వతంత్రులు, కొత్తవారు వచ్చారంటే అందుకు లోకేష్ కారణమని తెలుగుదేశం పార్టీలోని వారే చెబుతున్నారు. మంగళవారం రాజ్యసభకు నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సానా సతీష్ అనే వ్యక్తికి సహకరించింది లోకేష్. సానా సతీష్ ను ఎన్నికల రంగంలోకి దించింది కూడా లోకేష్ అనే ప్రచారం జరుగుతోంది. సానా సతీష్ లోకేష్ పాదయాత్ర సమయంలో పాద యాత్రకు కావాల్సిన ఖర్చంతా భరించాడని, ఆ మేరకు ఆయనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం దక్కిందనే ప్రచారం ఉంది. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచీ ఉన్న, పార్టీకి ఎంతో కొంత ఆర్థికంగా సాయం అందిస్తున్న వారిని కాదని సానా సతీష్ కు రాజ్య సభ సభ్యునిగా అవకాశం ఇచ్చారంటే ఆషామాషా కాదనేది పలువురి వాదన. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం లోకేష్ చెప్పిందే జరుగుతోంది.
లోకేష్ చేతుల్లో మంత్రులు
మంత్రులు ఏది మాట్లాడాలన్నా, ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టాలన్నా, లోకేష్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికీ కొందరు మంత్రులు పీఏలు, పీఎస్ లు, పీఆర్వోలను పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. నేను మీకు పీఏ కావాలన్నా, పీఎస్ కావాలన్నా, లేక ఓఎస్డీ విషయమైనా చూసుకుంటాను. వదిలేయండి. ఎవరు కావాలో నాకు చెప్పండి అంటూ నారా లోకేష్ మంత్రులకు ఓరల్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందులో నిజం ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. అందువల్ల మంత్రులు లోకేష్ చెప్పినట్లు ముందుకు నడుస్తున్నారు. ఏదైనా చంద్రబాబు మంత్రులను అడిగితే లోకేష్ బాబుకు చెప్పాము సార్ అంటూ చంద్రబాబు దగ్గర కూడా మంత్రులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్సీపీలోనే ఈ వ్యవహారం ఉందని చెప్పుకునే వారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇవే పరిస్థితులు ఉత్పన్న మయ్యాయని చెప్పుకుంటున్నారు.
తండ్రీ కొడుకుల్లో కనిపించని పోరు
చంద్రబాబు, లోకేష్ ల్లో కనిపించని పోరు సాగుతోందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బయటకు చెప్పేందుకు వారు ముందుకు రావడం లేదు కానీ తండ్రీ తనయుల మధ్య మాత్రం ప్రభుత్వంలో పట్టు పోరు సాగుతోందనేది విశ్వసనీయ సమాచారం. ఇందులో ఇద్దరివీ భిన్న ధృవాలుగా ఆలోచనలు ఉన్నాయి. లోకేష్ యువతరాన్ని పార్టీలోకి తీసుకు రావాలని, పార్టీని ఆర్థికంగా నిలబెట్టే వారిని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలని భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబు ఆలోచనలు కొంత వరకు అమలు కావడం లేదనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది.
పవన్ కు అన్న తోడు..
ఇప్పటి వరకు ప్రభుత్వంలో తమ్ముడు ఒక్కరే పోరాడుతున్నారు. ఇకపై తమ్ముడితో పాటు అన్న నాగబాబు కూడా కలిసి పోరాడేందుకు అవకాశం దొరికింది. అన్నకు మంత్రి పదవి ఖరారైంది. జనసేన తరపున అన్నదమ్ములు ఇద్దరూ అవసరమైతే లోకేష్ ను కట్టడి చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. తాను ఆపదలో ఉన్నప్పుడు ఏకంగా జైలు వద్దకు వచ్చి కలిసి తనకు సహకరించిన పవన్ కల్యాణ్ కు సహకరించాలనే ఆలోచన చంద్రబాబులో ఉంది. లోకేష్ మాత్రం తాను పార్టీ మొత్తాన్ని నడిపించే సత్తా ఉన్న వాడినని, నిర్మాణ పరంగా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తండ్రీ తనయులుగా రాష్ట్రంలో పార్టీని నడిపించడంలో ముందు వరుసలోనే ఉంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నాగబాబుకు మంత్రి పదవి కన్ఫామ్ చేసినందున భవిష్యత్ లో జనసేనలో అన్నదమ్ములు, టీడీపీలో తండ్రీ తనయులు చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది రాజకీయ నాయుల్లో చర్చ.