ఈ ఎస్ఐ గంజాయి అమ్మిస్తున్నాడు

పోలీసులు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారా? అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిజమేనా? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వెనుక ఏముంది?;

Update: 2025-07-24 05:58 GMT
తిరువూరు సీఐ గిరిబాబుతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై సత్యనారాయణపై సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు టౌన్‌లో ఎస్సై సత్యనారాయణ ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి, గంజాయి వ్యాపారానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన నేరస్తులను పిలిపించి, వారి ద్వారా గంజాయి అమ్మించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని, ఇటువంటి ఎస్సై పనికిరాదని ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు గుప్పించారు.

నిరుద్యోగులైన యువకులను ఎంపిక చేసుకుని గంజాయి అమ్మిస్తూ పోలీసుల్లో కొందరు దోచుకుంటున్నారని, పాత నేరస్తులను తిరిగి గంజాయి వ్యాపారంలోకి బలవంతంగా నెట్టి వారి ద్వారా డబ్బు సంపాదించే మార్గాన్ని తిరువూరు ఎస్ఐ కె సత్యనారాయణ చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్నారు. తిరువూరు సీఐ జి గిరిబాబును తిరువూరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం అర్ధరాత్రి నిలదీశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక యువకుడిని నిందితుడంటూ పోలీసులు ఆయువకుని తల్లి, చెల్లిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఎలా నిర్బంధిస్తారని ప్రశ్నించారు. దీంతో సీఐ ఎమ్మెల్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలాడు.

ఈ ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి, శాంతిభద్రతల విషయంలో పోలీసుల తీరుపై ప్రజల్లో అసంతృప్తిని మరింత పెంచాయి.


పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే ధర్నా

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తిరువూరు పోలీస్ స్టేషన్ ఎదుట కొందరు పోలీసు బాధితులతో ధర్నాకు దిగారు. ఆ సమయంలో స్టేషన్ ఎస్ఐ సత్యనారాయణ లేరు. ఆయన వేరే కేసులో నిందితుల కోసం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారని తెలుసుకున్న సీఐ గిరిబాబు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను ధర్నా విరమింపజేసి అక్కడి నుంచి స్టేషన్ లోపలికి తీసుకొచ్చారు. సీఐపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఎస్ఐ అరాచక వాదిగా మారాడంటూ యువకులతో గంజాయి వ్యాపారం చేయిస్తున్నాడని అటువంటి వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టేషన్ లోపల ఎమ్మెల్యే కూర్చోవటానికి కూడా ఇష్టపడలేదు. ఎమ్మెల్యే నిలబడి వాదిస్తుండటంతో సీఐ కూడా ఆయనకు ఎదురుగా నిలబడ్డాడు. చాలా చేపు ఎమ్మెల్యే సీఐతో వాదించారు. సీఐ మాత్రం ఎమ్మెల్యే చెబుతున్న మాటలు ఇంటూ నిలబడిపోయారు.

ఎమ్మెల్యే ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది?

ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్ ను పెట్టుకుని వాళ్లను గంజాయి అమ్మే వాళ్ల దగ్గరకు పంపించి డబ్బులు వసూలు చేశారు. అవి మొత్తం ఇప్పుడు చూపిస్తా. రామకృష్ణను ఎవరైతే కొట్టారో, తిరువూరు టౌన్ లో గంజాయి అమ్ముతున్నది ఎవరో ఎస్ఐకి తెలుసు. తిరువూరులో ఒక గ్యాంగ్ ను పెట్టుకుని ఎస్ఐ గంజాయి అమ్మిస్తున్నాడు. గతంలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన వారిని ఇప్పుడు పిలిపించి భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని ప్రజర్ చేశారు. చుగ్గల శ్రీకాంత్ అనే వ్యక్తి వాళ్ల అమ్మ బంగారం తాకట్టుపెట్టి లక్షన్నర తెచ్చి ఎస్ఐ కి ఇచ్చాడు. అని సీఐ ఎదుట ఎమ్మెల్యే చెప్పారు.

ఈ నేపథ్యంలోనే తాను రామకృష్ణ కుటుంబానికి అండగా ఉండేందుకు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య కొట్లాట

ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు తిరువూరులో వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే వర్గంలో చిల్లపల్లి రామకృష్ణ అనే యువకుడు ఉన్నాడు. మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. మద్యం సేవిస్తూ వీరు ఘర్షణకు దిగారు. దీంతో బీరు బాటిల్ తీసుకుని ఎంపీ వర్గీయుడైన సాకేత్ అనే యువకుడిని ఎమ్మెల్యే వర్గీయుడైన రామకృష్ణ కొట్టాడు. బాధితునికి రక్తగాయాలు కావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణ పరారు కావడంతో ఆ యువకుని తల్లి, చెల్లిని పోలీసులు స్టేషన్ కు తీసుకొచ్చి నిర్బంధించారు. దీంతో వారిని విడుదల చేయాలని, ఎంపీ వర్గీయులను కట్టడి చేయాలని ఎమ్మెల్యే సీఐని కోరారు.

తన వద్ద ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే వాటిని చూపిస్తానని కొలికపూడి సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లేవనెత్తిన అంశాలు అధికార యంత్రాంగంలో సంస్కరణల అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలీసులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తున్నాయి.

తిరువూరులో ఏమి జరిగినా పట్టించుకోరా?

తిరువూరులో ఏమి జరిగినా, ఎమ్మెల్యే ఏ విధంగా స్పందించినా ఆ విషయాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే ఈ ఏడాది కాలంలో వివాదాస్పదునిగా మారాడు. పలువురి విషయంలో కొట్లాటలకు దిగాడు. ప్రభుత్వం వచ్చిన మూడో రోజునే ఒక భవనాన్ని స్వయంగా కూల్చివేసిన సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి అతనిని కొట్టిన కేసు కూడా నమోదైంది. ఇప్పతిటికి మూడు సార్లు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన అలవాటు చేసుకున్నారనే వాదన తెలుగుదేశం పార్టలో ఉంది.

దళితుడనే భావనతోనేనా?

తనను దళితుడనే భావనతోనే పార్టీలో ప్రయారిటీ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలో ఎంపీ వర్గం పెత్తనం ఏమిటనేది ఆయన ప్రశ్న. అంతే కాకుండా అధికారులు ఎమ్మెల్యే మాటకు విలువ ఇవ్వకుండా పార్టీ పెద్దలు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. చట్ట ప్రతినిధిగా తనకు ఉన్న అధికారాలు ఏమిటో తెలియాలనే ఉద్దేశ్యంతోనే అధికారుల తీరును ఆయన ఎండగడుతున్నారు. ఉన్నత విద్యావంతుడైన శ్రీనివాసరావుకు రాజ్యాంగంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. సివిల్ సర్వీస్ వారికి గతంలో కోచింగ్ ఇచ్చారు. ఆ మేకు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News