ఇదే కదా దేవుడి స్క్రిప్ట్..!

లెక్కలు తప్పాయి. అంచనాలు తలకిందులయ్యాయి. 2024 ఎన్నికల ఫలితాల్లో 151నుంచి ఐదు తప్పిపోయింది. గతంలో అభివృద్ధిలో హైటెక్ అనేది ఎంత పాపులర్ అయిందో.. గత ఐదేళ్లలో పేటీఎం బ్యాచ్ కొత్తగా పరిచయమైంది.

Update: 2024-06-06 07:31 GMT


"దేవుడు స్క్రిప్ట్ అలా రాశాడు" అనే మాట తరచూ తాజా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వినిపించే మాట. ఆ మాటకు దేవుడు తధాస్తు అన్నట్టు ఉంది. అందుకే 151 నుంచి 5 కిందికి జారిపోయి, 11 అంకే మాత్రమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో ఈయన ప్రభుత్వ కాలంలోనే రాష్ట్రంలో పేటీఎం బ్యాచ్ అనే పదం కూడా విపరీతంగా పాపులర్ అయింది. ఇప్పుడు వైఎస్ఆర్సిపికి అనుకూలంగా పనిచేసిన సోషల్ మీడియా సంస్థలు, ఆ పోస్టులను వైరల్ చేసిన వలంటీర్ల పరిస్థితి ఏమిటి? వారు కూడా రాజకీయ నాయకులు మాదిరి ప్లేట్ ఫిరాయిస్తారా!? వేచి చూడాలి.
దేవుడి స్క్రిప్ట్ మాటకు వస్తే...
2014: విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొదటి ఎన్నికలు. 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సిపి ఒంటరిగా పోటీ చేసి 67 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టిడిపి 102 స్థానాలు, మిత్రపక్ష బిజెపి నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. కార్యక్రమంలో 23 మంది వైయస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిపోయారు.
2019: ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి 151 ఒక్క సీట్లతో అఖండ మెజార్టీ సాధించింది. టిడిపి 23 సీట్లు మాత్రమే పరిమితమైంది. దీనిపై స్పందించిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి "దేవుడు స్క్రిప్ట్ అలా రాశారు. గత ఎన్నికల్లో గెలిచిన మా నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో దేవుడు మీకు అంతే సంఖ్య ఇచ్చారు" అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో టిడిపికి చురకలు అంటించారు.
2024: ఎన్నికల పోరాటం హోరాహోరీగా జరిగింది. "దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఫలితాలు ఉంటాయి" అని పోలింగ్ ముగిసిన నాటి నుంచి ఈ ఎన్నికల్లో 151కి పైబడే ఉంటాయి. అని వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే ఉన్నారు. కౌంటింగ్ ముందు రోజు కూడా అదే రీతిలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాటు చేశారు. కానీ 151లో 5 తప్పిపోయింది. 11 సీట్లకే పరిమితమైంది.
పాపులర్ అయిన పదాలు
దాదాపు 20 ఏళ్ల క్రితం హైటెక్ అనే పదం తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. గడచిన ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పార్టీ ద్వారా పేటీఎం బ్యాచ్ అనే పదం కూడా అంతకంటే ఎక్కువగానే పేరు సాధించింది. మొదటిది అభివృద్ధి కోసం హైటెక్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకుంది. రెండోది విపక్షంపై నిందారోపణలు చేయడానికి అనువుగా అధికారం చెలాయించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పేటీఎం బ్యాచ్ అనే పదాన్ని పెద్దగా వాడుకలోకి తీసుకొచ్చింది.
సాధారణంగా ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్న వారు డిజిటల్ లావాదేవీలు సులువుగా సాధించడానికి ఉపయోగపడుతున్న వేదిక. ఇందులో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం అనే యాప్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి భిన్నంగా పేటీఎం బ్యాచ్ అనే పేరు సామాన్యుల వరకు పరిచయమైంది. ఐదేళ్లపాటు అధికారం చలాయించిన వైఎస్ఆర్సిపి నేతలు ప్రజా ప్రతినిధులు ప్రతిపక్షాలను ప్రధానంగా టిడిపి, జనసేన నాయకులను పేటీఎం బ్యాచ్ అనే పదంతో తిట్టించడం రివాజుగా మార్చేశారు. ఇది ఓ ఉదాహరణ..
" విశాఖ నౌకాశ్రయం వద్ద రు. కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇవి బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి బంధువుల పనే" అని ఆరోపించారు. అంతటితో ఆగలేదు." డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ, పురందేశ్వరి బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు" అని ఒక ఫేక్ లెటర్ వైరల్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఖండించడంతోపాటు కూటమిలోని పార్టీ నాయకులు, సోషల్ మీడియా కూడా స్పందించింది. దీంతో వారిని పేటియం బ్యాచ్ గా అభివర్ణిస్తూ అధికార పార్టీ సోషల్ మీడియా దాడి చేయడం గమనించదగిన విషయం.
ఇలా.. వైఎస్ఆర్సిపి కి మద్దతుగా " పేటీఎం బ్యాచ్" అని తిట్టడం, ఘాటైన విమర్శలకు వేదికగా మార్చుకున్నారు. దీంతో పేటీఎం బ్యాచ్ అనే పేరు జనంలోకి బలంగా వెళ్లడమే కాకుండా, ఊతపదంగా కూడా మారిపోయింది.
" రాష్ట్ర అభివృద్ధి. దేశ సంక్షేమం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు చేయలనివ్వను" అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ఇది. దీనిపై కూడా సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకు దీటుగా స్పందించిన జన సైనికులను పావలా బ్యాచ్ అని విమర్శలు కూడా స్పందించారు.\
విమర్శిస్తే పేటీఎం బ్యాచ్..!
కొద్దిరోజుల కిందటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపికి అనుకూలంగా పోస్ట్ చేస్తే పేటీఎం బ్యాచ్ అని విమర్శలు ఎదుర్కొన్నారు. అదే.. టిడిపి మద్దతుదారులో.. ఆ పార్టీ సోషల్ వింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పోలీసుల వేధింపులు, కేసుల వరకు వెళ్లాయి. ఈ విధంగా విపక్షంలోని వ్యక్తులకు ఒక రకంగా, అధికారపక్షంలో ఉన్నవారు పోస్ట్ చేస్తే మరో రకంగా స్పందించిన తీరుతో.. పేటీఎం బ్యాచ్ అనే పదం రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
మొత్తానికి ఒక పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పేటీఎం బ్యాచ్ అనడం! ఎంతవరకు సమంజసం అనే మాటలు కూడా వినిపించాయి. మొత్తానికి రాజకీయ పార్టీల మద్దతుదారులు ఆయా నాయకులు, వ్యక్తిత్వం పై దాడి చేయడానికి అన్ని పార్టీల్లో సోషల్ మీడియా విభాగాలు ఖాతాలు తెరిచి, వందలాది మందిని తాత్కాలిక ప్రాతిపదికగా నియమించుకొని పనిచేశాయి అనడంలో సందేహం లేదు.
తిట్టు.. డబ్బు పట్టు
అధికార పార్టీ నాయకులపై జనసేన కార్యకర్తలు విమర్శల సంధిస్తే.. పావలా బ్యాచ్ అని నిందించారు. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోస్ట్ చేసిన వారిని విమర్శిస్తే పేటీఎం బ్యాచ్ అన్నారు. అంటే వారి ఉద్దేశం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ ఎవరు విమర్శిస్తే... వారి వ్యక్తిత్వాన్ని నిందించడమే పనిగా కొన్ని సంస్థలు పనిచేశాయి. తాజా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని "ఎవరు ఎక్కువ విమర్శిస్తే వారి ఖాతాను ఎంతమంది అనుసరిస్తున్నారు. ఆ లెక్కను ప్రామాణికంగా తీసుకుని రు. 50 నుంచి రు. 500 వరకు వారే పేటీఎం ఖాతాలో జమ చేశారు" ఆ డబ్బు కోసమే ఇలా ప్రవర్తిస్తున్నారో అనే విమర్శలు చేశారు. అధికార పార్టీకి అండగా నిలిచి సోషల్ మీడియా విభాగాలను నడిపిన వ్యక్తులు సంస్థలు టిడిపి అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వాన్ని హరించే విధంగా పోస్టులు పెట్టారు. ఎందుకు కొన్ని సోషల్ మీడియా వేదికలు చురుగ్గా పనిచేశాయి. వీటిని తిప్పికొట్టే విధంగా మాట్లాడిన విపక్షంలోని రెండు పార్టీల నాయకులపై" పేటీఎం బ్యాచ్" అనే ముద్ర వేశారు. రాష్ట్ర మొత్తం మీద వారు ఎవరు తెలియకపోవచ్చు. కానీ, రాష్ట్ర రాజధాని, ఇతర నగరాల్లో వారు నిర్వహించిన కార్యాలయాలు, వ్యక్తులు ఎవరైతే స్థానికులకు చిరపరిచితమే.
ఇక తక్షణ కర్తవ్యం
రాష్ట్రంలో ఊహించని విధంగా 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైన వైఎస్ఆర్సిపి జన సునామీలో కొట్టుకుపోయింది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారపక్షంతో మెలిగిన పేటీఎం బ్యాచ్ వ్యక్తులు సంస్థల పరిస్థితి ఏమిటి? వారంతా చల్లగా జారుకుంటారా? లేకుంటే రాజకీయ నాయకుల మాదిరే.. ఈ గట్టుకు చేరుకుంటారా? అలా వస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం వారి సేవలను పరోక్షంగా వాడుకుంటుందా అనేది వేచి చూడాలి. లేకుంటే ఐదేళ్లపాటు తమను సోషల్ మీడియాలో ఆదుకొని, తమ భావాలను ప్రతిపక్షాలపై సంధించిన 11 మంది ఎమ్మెల్యేలు సోషల్ మీడియా సంస్థలను ఎలా ఆదరిస్తాయో లేదో..!?


Tags:    

Similar News