చెప్పాడంటే చేస్తాడంతే..దటీజ్ పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్, పుస్తకాలు పంపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

Update: 2025-12-15 14:25 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. హామీ ఇచ్చిన తొమ్మిది రోజుల్లో 25 కంప్యూటర్లు, లైబ్రరీ నిండుగా పుస్తకాలు సమకూర్చారు. చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ 2.0కి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్కూల్లో అందుబాటులో ఉన్న లైబ్రరీ, ల్యాబ్, పాఠశాల గదులను పరిశీలించారు.

 బహు భాషా పుస్తకాలతో లైబ్రరీ నింపేశారు

పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండడాన్ని గమనించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ రోజు జరిగిన సమావేశంలో లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తొమ్మిది రోజుల్లో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయించారు. లైబ్రరీని పుస్తకాలతో నింపేశారు. చిన్నారుల కోసం పెద బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, బహుభాషా ప్రావీణ్యాన్ని పెంచే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతోపాటు తమిళం, కన్నడ, ఒడియా తదితర భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు.

సోమవారం చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, మాజీ శాసన సభ్యులు కిలారి రోశయ్య, కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ప్రారంభించి విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చారు.

 ఒక చోట ఆట స్థలం.. మరో చోట అధునాతన కిచెన్
విద్యార్ధి దశ నుంచే బాలల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయాలి. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి సృజనాత్మకతను పెంపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలో చెబుతూ ఉంటారు. అందుకు తగిన విధంగా పాఠశాలల్లో సౌకర్యాల ఉండాలని కోరుకుంటారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించారు. క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా పాఠశాలల్లో విద్యార్ధులకు అందుబాటులో ఉన్న వసతులపై ఆరా తీస్తూ ఉంటారు. రికార్డు స్థాయి గ్రామ సభల నిర్వహణ కోసం అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లి సందర్శించినప్పుడు ఆ గ్రామంలో పాఠశాలకు ఆట స్థలం లేదని తెలుసుకుని రూ. 65 లక్షల సొంత నిధులు వెచ్చించి కొనుగోలు చేసి ఇచ్చారు. మొదటి విడత మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కోసం కడప మున్సిపల్ స్కూల్ సందర్శన అనంతరం కలెక్టర్ సూచన మేరకు అధునాతన మోడల్ కిచెన్ ఏర్పాటు చేయించారు.
Tags:    

Similar News