ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నారు

లక్షలాది మందికి ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు.

Update: 2024-10-11 10:59 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రాలేదని, భయపడ్డారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని మంత్రి అన్నారు. గత జగన్‌ ప్రభుత్వం అన్నింటిపైనా రంగులు, బొమ్మలేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజా ధనాన్ని జాగ్రత్తగా కాపాడుతోందన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నాలుగో బ్లాక్‌లో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని మంత్రి కొలుసు పార్థసారధి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు తీసుకొచ్చి లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

మేనిఫెస్టో పేరుతో గత జగన్‌ ప్రభుత్వం దోపిడీ చేసిందని, రూ. 10.50లక్షల కోట్లు అప్పులు చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనత కూడా జగన్‌ ప్రభుత్వానిదే అని విమర్శించారు. అందరికీ ఇళ్లు ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జగన్‌ హయాంలో లబ్ధిదారులకి ఇచ్చే రూ. 2.5లక్షల గృహనిర్మాణ వ్యయాన్ని రూ. 1.80లక్షలకు తగ్గించిందని ధ్వజమెత్తారు. సాక్షి పత్రిక కొనుగోలు కోసం గత జగన్‌ ప్రభుత్వం నిధులు ఇవ్వడంపైన విచారణ జరుగుతోందని, దీంతో పాటుగా ఒకే పత్రికకు ప్రకటనలు ఇవ్వడంపైనా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఒకే రోజులో 6లక్షల మందికిపైగా పింఛన్లును పంపిణీ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి దక్కుతుందన్నారు.


Tags:    

Similar News