అలలపై సందడే.. సందడి

ప్రాజెక్టులు జలకళలాడుతున్నాయి. కొందరిలో ఆనందం అవధులు దాటించింది. కేరళ పడవ పందేలను తలపించే రీతిలో సందడి చేయించింది.

Update: 2024-08-13 02:30 GMT

ఈ ప్రాజెక్టు నీటి అలలపై సాగించిన ఈ ప్రయాణం సాహసక్రీడను తలపించింది. ఎగిసిపడుతున్న అలలపై నాటు పుట్టి నుంచి తెడ్డు వేస్తూ, ఆనందంతో కేరింతలు కొట్టారు. ఒకరు కాదు. ఇద్దరు కాదు. పదుల సంఖ్యలో పాతాళగంగ నుంచి ఒకరికి మించి మరొకరు పోటీ పడుతూ, సాగిన తీరు కేరళ తరహా పడవ పందేలను మరిపించాయి. ఇంతకీ వారి ఆనందానికి కారణం ఏమిటంటే..

వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ఆంధ్రాకు ఎగువన ఉన్న కర్ణాటకలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ప్రాజెక్టులు నీటితో తొణికిసలాడుతున్నాయి. చుట్టూ కోటగోడల్లా ఉన్నకొండల మధ్య ఆ ప్రాజెక్టు నుంచి చల్లటి గాలులు తాకుతుంటే స్థానికులే కాదు. యాత్రికులు కూడా మైమరుస్తున్నారు. మంచుతెరలు గిలిగింతలు పెడుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచే కాకుండా, కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో ఆ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం తగ్గింది. దీంతో క్రస్ట్ గేట్లు మూసేశారు.


అవధులు దాటిన ఆనందం
ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం వద్ద మత్స్యకారులు ఆనందం అవధులు దాటింది. జలాశయం గేట్లు మూసేయడంతో చేపల వేటకు పోటెత్తారు. శ్రీశైలం పరిసరాల్లోని మత్స్యకారులు నాటు పుట్టి (గోళం ఆకారంలో ఉన్న పడవ)పై వందలాది మంది ఒక్కసారి డ్యాం గేట్ల వైపు పోటెత్తారు. ఈలలు, కేకలతో సాగిన వారి ఆనందం సాహసక్రీడను తలపించింది. అలలపై తేలాయాడుతున్న ఆ 'పుట్టి" ఎగసెగిసి పడుతుంటే, మత్స్యకారుల ఆనందం అలలతో పోటీ పడింది. శ్రీశైలం శైవక్షేత్రానికి సమీపంలోని పాతాళగంగ ప్రాంతం నుంచి భారీగా నాటు పుట్టిపై సాగుతున్న తీరు చూడడానికి రెండు కళ్లు చాలవనిపించింది.
శ్రీశైలం డ్యాం గేట్లు మూత
శ్రీశైలం ఎగువప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణా నదిలో నీటి ప్రవాహం కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. వరదనీటిని సరిపడ నీలువ చేసిన నీటి పారుదల శాఖాధికారులు శ్రీశైలం బహుళార్ధక సాధక ప్రాజెక్టుకు ఉన్న పది క్రస్ట్ గేట్లు మూసివేశారు. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 77,598 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది.


కళకళలాడుతున్న ప్రాజెక్టు
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ, 881.న20 అడుగుల మేరకు ఉంది. దీనిద్వారా జలాశయంలో ప్రస్తుతం 194.30 టీఎంసీల నీరు నిలువ ఉంచారు. అయితే, ఈ జలాశయానికి ఉన్న కుడి, ఎడమ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ రెండు కాలువల నుంచి విడుదల అవుతున్న 68,211 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ జలాశయం వైపు పరుగులు తీస్తోంది. రెండేళ్ల తరువాత పూర్తిస్థాయి నీటిమట్టం చేరడంతో కుడి కాలువ నీరు ఏపీలోని రాయలసీమకు, ఎడమ కాలువ ద్వారా నీరు తెలంగాణలోని నల్గొండ రైతులకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా, ఈ రెండు రాష్ట్రాల పరిధిలోని రైతులతో పాటు మత్స్యకారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చేపల పులుసు... బిర్యానీ...
సాధారణంగా కర్ణాటకలో కురిసే వర్షాలకు తోడుగా కృష్ణానది ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నిండుతుంది. రెండేళ్ల తరువాత భారీగా కురిసిన వర్షాలు జలసిరిని ప్రసాదించాయి. దీనివల్ల డ్యాంలోకి కొత్తనీరు రావడంతో మత్స్యకారులకు పండుగ తెచ్చింది. వరదనీటిలో వచ్చే వివిధ రకాల చేపలు పట్టడం ద్వారా ఉపాధి పొందుతారు. అంతేకాకుండా అనేక రకాల చేపలు మాంసాహార ప్రియులకు కూడా కొత్త రుచులు ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

కొత్తనీటితో పాటు చేపలు కూడా కొట్టుకుని రావడం శ్రీశైలం సమీప ప్రాంతాల్లోని మత్స్యకారులకు ఆనందం తెచ్చింది. డ్యాంలో పట్టుకునే చేపలు అక్కడే విక్రయిస్తుంటారు. ఇది చెరువులు, డ్యాంల వద్ద సర్వసాధారణంగా జరిగేదే. శ్రీశైలం సమీపంలో మాత్రం ఓ పల్లె మొత్తం చేపల పులుపు, బిర్యానీకి పెట్టింది పేరు. పులుసు నుంచి బిర్యానీ వరకు అన్నీ కోరినట్లు వండి, వడ్డిస్తారు.
ఇంతకీ ఆ పల్లె ఏది?
పట్టణాలైతే వేరు. పల్లెల్లో వంటల తయారీ మామూలుగా ఉండదు కదా! శ్రీశైలానికి సమీపంలోనే ఉన్న లింగాలగట్టు గ్రామంలో చేపల వంటకాలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న వారు ఆ పల్లెకు వెళ్లి, చేపల రుచి చూడంది వెనుదిరగరు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి చేరిన కొత్తనీటిలో చేపలు పట్టడానికి ఆ గ్రామంలోని పురుషులు దాదాపుదా అందరూ వెళతారు. అక్కడ వారంతా చేపలు పట్టి పంపితే గ్రామంలోని మహిళలు చేపల వంటకాలతో అతిధులకు కొత్తరుచులు పరిచయం చేస్తున్నారు.
జలాశయంలోకి చేరిన నీటితో లింగాలగట్టు గ్రామమే కాదు. చుట్టుపక్కల ఉన్న వారి ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. ఎవరు ముందు వెళితే, వారికి పెద్ద చేపలు దొరుకుతాయి. అన్నట్లుగా మత్స్యకారుల ప్రయాణం నీటిపై ఇలా సాగింది. దీంతో శ్రీశైలం ప్రాంతానికి మరో పండుగను తీసుకువచ్చిందా అనే విధంగా కనిపించింది.


Tags:    

Similar News