‘ఆంధ్రలో ఆటవిక పాలన నడుస్తోంది’.. మండిపడ్డ జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేవి ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

Update: 2024-07-19 13:55 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేవి ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎక్కడ చూసిన ఆటవిక పాలనే కనిపిస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యలు, దాడులు అధికమయ్యాయని, నడిరోడ్డుపై ఒక వ్యక్తిని నరికి చంపిన ఘటన యావత్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినా పోలీసులు మాత్రం ప్రేక్షపాత్ర వహించారని ఆక్రోశం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్‌లో అటవీ పాలన కొనసాగుతుందనడానికి వినుకొండలో జరిగిన హత్య నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈరోజు వినుకొండ హత్య కేసులోని బాధితుడు రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఏపీలో జరుగుతున్న హింసారాయజకీయాలపై ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తామన్నారు.

‘‘ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీని కలిస్తాం. ఏపీ పరిస్థితులపై జూలై 24న ఢిల్లీలో ధర్నా చేపడతాం. ఏపీలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రమంతటా అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఈ 40 రోజుల్లో దాదాపు 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా దైర్జన్యాలు, దాడులు జరిగాయి. 300కు పైగా హత్యాయత్నాలు చోటుచేసుకున్నాయి. ఏపీలో పోలీసులు బాధ్యతలు మరిచి ప్రేక్షకుల్లా మారారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘అమాయకుడైన రషీద్ అనే వ్యక్తిని అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపైనే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకోకపోగా.. హంతకుడు జిలానీ.. వైసీపీకి చెందిన వ్యక్తి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రెండేళ్ల కిందట ఇంటిపై దాడి చేసిన ఘటన, బైక్‌ను కాల్చిన ఘటనకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందని ప్రచారం చేశారు. రషీద్ హత్య ఒక ఉదాహరణ మాత్రమే. మిథున్ రెడ్డికి తన నియోజకవర్గంలో తిరిగే అవకాశం లేదు. మిథున్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం వ్యక్తులపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయి. జరుగుతున్నాయి. ఆఖరికి చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు’’ అని మండిపడ్డారు.

ఢిల్లీలో ఈనెల 24 చేసే ధర్నాలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై వివరించడానికి రాష్ట్రపతి, ప్రధాని మోది, హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్‌లు కోరతామని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని, పరిస్థితులను చక్కబెట్టాలని రాష్ట్రపతిని కోరతామని జగన్ వివరించారు.

Tags:    

Similar News