శ్రీశైలంకు వెళ్తుండగా భారీ ప్రమాదం..నలుగురు దుర్మరణం
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన తుఫాన్ వ్యాను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసులు తక్షణమే స్పందించి గాయపడినవారిని 108 సాయంతో కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.
మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారుగా గుర్తించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62)లుగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ ఆటంకం ఏర్పడింది. కేసు నమోదు చేసుకున్న కోటబొమ్మాళి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.