సభలో సీనియర్, జూనియర్ అనే తేడాలు ఉండవు

ఎవరైనా సభా మర్యాదలు పాటించాలి. కొన్ని పరుష పదాలు వాడకూడదు. కొన్ని నేర్చుకోండి అంటూ మంత్రి లోకేష్ కు బొత్స హితవు పలికారు.

Update: 2025-09-23 08:05 GMT
ఏపీ శాసన మండలిలో జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్, వైఎస్సార్సీపీ నేత బొత్స

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల అంశంపై వైఎస్సార్‌సీపీ చర్చకు పట్టుబట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్‌ అబద్ధపు వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మేం బకాయి పెట్టినట్లు లోకేష్‌ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవం అని బొత్స మండిపడ్డారు. శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్‌ తిరస్కరించారు.

ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్‌కు మండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణల మధ్య వాగ్వివాదం జరిగింది. ‘‘సభలో సీనియర్, జూనియర్ అనే తేడాలు ఉండవు. ఎవరైనా సభా మర్యాదలు పాటించాలి. కొన్ని పరుష పదాలు వాడకూడదు.. కొన్ని నేర్చుకోండి. మంత్రి లోకేష్ చెప్పినట్లుగా మేం బకాయిలు పెట్టామన్నది అవాస్తవం. చర్చకు రండి మేము సిద్ధంగా ఉన్నాం. సభను తప్పుదోవ పట్టించి ప్రజలు మభ్య పెడితే కుదరదు’’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవుట్ సోర్సింగ్ వర్కర్స్ గురించి మంత్రిని ప్రశ్నించిన చైర్మన్
గత ప్రభుత్వం హయాంలో అవుట్ సోర్సింగ్ వర్కర్లకు పథకం అమలు అయ్యింది.. వారికి ఇప్పుడు నిలిపివేశారు.. వారికి అమలు చేసే అవకాశం ఉందా? అంటూ మండలి ఛైర్మన్ మోషేన్ రాజు.. మంత్రి లోకేష్‌ను అడిగారు మున్సిపాలిటీల్లో పనిచేసే వర్కర్స్ జీతాలు 12 వేలు.. రూరల్ ప్రాంతంలో 10 వేల కంటే తక్కువ ఉన్నవారికి పథకం వర్తిస్తుందని మంత్రి లోకేష్. సమాధానమిచ్చారు. మున్సిపాలిటీలో 18 వేలు వేతనం ఉంది.. మీరు 12 వేలు నిబంధన పెడితే పథకం ఏ విధంగా వాళ్లకు అందుతుందంటూ మండలి ఛైర్మన్‌ ప్రశ్నించారు. దీంతో పరిశీలిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు.

శాసనమండలిలో తల్లికి వందనంపై చర్చలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయేలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యార్థుల కోసం అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ ప్రభుత్వం దాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారు. 67 లక్షల మందికి విద్యార్థులకు పథకం ఇస్తామని 54 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు.. రెండో ఏడాది అరకొరగా ఇచ్చారు. నిబంధనల పేరుతో అనర్హుల సంఖ్యను పెంచారు. కరెంట్ బిల్లు 300 దాటినా పథకం కట్ చేశారు.

వైఎస్సార్‌సీపీ వాకౌట్‌
ఏపీ శాసన మండలి నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు వాకౌట్‌ చేశారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్‌ చేశారు. హోంమంత్రి వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

Tags:    

Similar News