పరీక్షలు పూర్తయ్యాయి–పని చేయకపోతే మంచి ఫలితాలు రావు
ఆటో డ్రైవర్లకు కూడా రూ.15 వేలను అక్టోబరు 1 తేదీన ఇస్తామని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు అన్నారు.;
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి ఏడాది పరీక్షలు పూర్తి అయిపోయాయి, ఇక బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చింది, ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావు అని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ తొలి రోజు ప్రారంభంలో ఆయన మాట్లాడారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందే అని కలెక్టర్లకు సూంచించారు. వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌరసేవలు అందిస్తున్నాం. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి అని సూచించారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవల్ని ఉపయోగించుకోవాలన్నారు. విజన్ రూపొందించి దానికి నిధులు కేటాయించకపోతే ఇబ్బందులు వస్తాయన్నారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పాం. అదే విధంగా సూపర్ సిక్స్‌ను సక్సెస్ చేశాం. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు. 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్ధికి ఆర్ధికసాయం చేస్తున్నాం. ఏడుగురు పిల్లలు ఉన్న తల్లికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేశాం. ఆ కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. విద్యార్ధులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు వచ్చాయని అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.