ఆ ముగ్గురికి బెయిల్‌ నిరాకరించిన సుప్రీం కోర్టు

లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డి, కృష్ణారెడ్డి, బాలాజీ గోవిందప్పలు.;

Update: 2025-05-08 08:06 GMT

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్‌ అధికారి, మాజీ సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పలకు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. వీరి ముగ్గురికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది.

లిక్కర్‌ స్కామ్‌లో ఈ ముగ్గురు వ్యక్తులు తొలుత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టులో పిటీషన్‌ చేశారు. అయితే వీరి ముగ్గురికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. మద్యం కుంభకోణంకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు వెల్లడి కావాలంటే ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉంటుందని ఏపీ హైకోర్టు వెల్లడించింది. పిటీషనర్ల ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వీరిని సిట్‌ ఇంకా ప్రశ్నించలేదని, ఈ నేపథ్యంలో వీరికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు తగిన కారణాలు లేవని, బెయిల్‌ పోందేందుకు ఈ ముగ్గురు అర్హులు కాదని పిటీషన్లను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టీ మల్లికార్జునరావు బుధవారం తీర్పును వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపైన గురువారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరగుతున్న తరుణంలోనే ఈ ముగ్గురు మద్యంతర బెయిల్‌ కోసం సుప్రీం కోర్టు బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారని, ఈ పిటీషన్‌ ఇప్పుడు విచారణకు అర్హత లేదని ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్‌ కోహత్గి సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో గతంలో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను సవరించడం కానీ కొత్త పిటీషన్‌ దాఖలు చేసుకోవలసి ఉంటుందని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన స్పందించిన సుప్రీం కోర్టు కొత్తగా పిటీషన్‌ దాఖలు చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతులిచ్చింది. ఈ నెల 13 వరకైనా మధ్యంతర రక్షణ కల్పించాలని ముగ్గురు నిందితుల తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. దీనిపైన స్పందించిన సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ క్పలించడం కుదరదని, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి వచ్చిన లిక్కర్‌ స్కామ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా చక్రం తిప్పిన మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, నాడు జగన్‌మోహన్‌రెడ్డికి ఓఎస్‌డీగా వ్యవహరించిన కృష్ణమోహన్‌రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ గోవిందప్పలను నిందితులుగా చేర్చారు. ముడుపులు వసూల్లు చేసేందుకు వీలుగా లిక్కర్‌ పాలసీని రూపొందించడంలోను, వసూళ్లు చేయడంలోను కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో కలిసి ధనుంజయరెడ్డి, కృష్ణారెడ్డి, బాలాజీ గోవిందప్పలు భాగస్వాములయ్యారనే ప్రాథమికంగా గుర్తించిన సిట్‌ ఈ ముగ్గురిని నిందితుల జాబితాలో చేర్చింది. ఓ పక్క ఈ ముగ్గురికి సుప్రీం కోర్టు బెయిల్‌ నిరకారించగా మరో వైపు విజయవాడ వెటర్నరీ కాలనీలోని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డితో పాటు జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్‌ఆర్‌ నివాసాల్లో సిట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Tags:    

Similar News