వయసు 90..వీరభద్రుని కత్తిపీట 100
సొంతకాళ్లపై నిలబడి బతకాలని ఆరాటం. బతుకుదెరువు కోసం ఇంట్లోనే కత్తిపీటల తయారీ. వాటి అమ్మకానికి ఊళ్లకు కాలినడకన పయనం. కమ్మరాలు కనుమరుగైనా వృత్తిపై తగ్గని మమకారం.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-04-13 04:33 GMT
ఆయన వయసు తొంభై ఏళ్లు. సాధారణంగా ఆ వయసులో ఉన్న వారెవరైనా ఏం చేస్తారు? ఇంటికే పరిమితమై పెట్టింది తిని రామాకృష్ణా అనుకుంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ తొమ్మిది పదుల ఈ వృద్ధుడు మాత్రం అలా కాదు.. ఒంట్లో ఓపిక లేకపోయినా, ఎవరిపైనా ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడుతూ బతుకు బండిని లాగిస్తున్నాడు. కులవృత్తి కూడు పెట్టకపోయినా దానినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. కత్తి పీటలను తయారు చేసే వృత్తిని ఎంచుకున్నాడు. తొంభై ఏళ్ల వయసులోనూ తాను స్వయంగా తయారు చేసిన కత్తీ పీటలను భుజాన వేసుకుని, ఊత కర్ర చేతబట్టుకుని కాలినడకనే ఊరూరా తిరిగి పొట్ట పోసుకుంటున్నాడు. ఎవరా వృద్ధుడు?
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడికి చెందిన కొత్తల వీరభద్రుడు కుల వృత్తి కమ్మర పని. తన పదకొండేళ్ల వయసులోనే ఆ వృత్తిలో చేరాడు. రైతాంగం వ్యవసాయం చేసే రోజుల్లో రైతులకు అవసరమైన కత్తులు, కొడవళ్లు, తవ్వుగోల, నాగళ్లు, కర్రుకోల, కాడెలు వంటి వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవాడు. కానీ కాలక్రమంలో వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు సాగుకు దూరమవుతూ వచ్చారు. దీంతో అప్పటిదాకా అవసరమైన వ్యవసాయ పనిముట్ల వినియోగం తగ్గిపోయింది. వీరభద్రుడికీ వాటిని తయారు చేసే అవసరమూ లేకుండా పోయింది. దీంతో ఆదాయం లేక కుటుంబం గడవడమూ కష్టమైంది. కమ్మరం పని తప్ప మరొకటి చేతకాని వీరభద్రుడు కుల వృత్తిలోనే మరో పనిని వెతుక్కున్నాడు. అలా కత్తి పీటలను తయారు చేసి వాటిని సమీప పల్లెలు, సంతల్లో అమ్ముకోవచ్చని తలచాడు.
కత్తీపీటలు నెత్తిన పెట్టుకుని..
వీరభద్రుడికి తన ఇంట్లోనే పురాతన కమ్మరం ఉంది. అందులోనే కత్తిపీటలను తయారు చేస్తుంటాడు. దాదాపు 20 కి.మీల దూరంలో ఉన్న తుని పట్టణానికి వెళ్లి కత్తిపీటల తయారీకి అవసరమైన ఇనుప ఊచలు, చెక్కలను కొనుగోలు చేస్తాడు. ఊచలను కొలిమిలో కాల్చి ఇనుప దిమ్మపై కత్తి రూపం వచ్చే దాకా బరువైన సుత్తితో కొడతాడు. గతంలో ఒంట్లో కాస్త ఓపిక ఉన్నప్పుడు రోజుకు నాలుగైదు కత్తిపీటలను తయారు చేసేవాడు. కానీ ఓపిక తగ్గడంతో రోజుకు రెండు మాత్రమే చేయగలుగుతున్నాడు. అలా ఏడెనిమిది కత్తిపీటలను తయారు చేశాక వాటిని భుజంపై వేసుకుని అమ్మకానికి కాలినడకన బయల్దేరి వెళ్తుంటాడు. రోజుకు దాదాపు పది కిలోమీటర్ల వరకు సమీపంలోని ఊళ్లకు వెళ్లి చీకత్తి పీటలమ్మా.. కత్తిపీటలూచీ అంటూ ఊరూరా తిరుగుతాడు. కత్తిపీట ఒక్కోటి రూ.100కు విక్రయించి తిరిగి ఇంటికి నడిచే చేరుకుంటాడు. వారంలో మూడు రోజులు కత్తిపీటల తయారీకి, మిగిలిన నాలుగు రోజులు వాటిని విక్రయించడానికి ఊళ్లెళ్తుంటాడు. ఏ రోజైనా అమ్ముడుపోకపోతే మోసుకుంటూ ఇంటికి తిరిగొస్తాడు. ఒక్కోసారి మిగిలిపోతే వాటిని మోసుకుంటూ ఇంటికి వెళ్లలేక రూ.70–80కే ఇచ్చేస్తాడు. వీరభద్రుడు ప్రతి శుక్రవారం నక్కపల్లిలో జరిగే సంతలోనూ ఈ కత్తిపీటలను విక్రయిస్తుంటాడు. ఈయనకు కత్తిపీటలతో పాటు తవ్వుగోళ్లను కూడా తయారు చేస్తాడు కానీ దాని తయారీకి రూ.100 ఖర్చవుతుందని, అమ్మితే రూ.70–80కి మించి రాకపోవడంతో వాటి తయారీని వదిలేసి కత్తిపీటలనే నమ్ముకుని అమ్ముకుంటున్నాడు వీరభద్రుడు.
కత్తిపీటపై మిగిలేది రూ.30లే..
ఇంతలా కష్టపడి కత్తిపీటను తయారు చేసి ఊరూరా తిరిగి అమ్మితే ఒక్కో దానిపై మిగిలేది కేవలం రూ.30లే అంటాడు వీరభద్రుడు. కిలో ఇనుప ఊచను రూ.70కి కొంటే రెండు కత్తిపీటలు అవుతాయని, పీటల చెక్కకు మరో రూ.20, కొలిమిలో కాల్చడానికి బొగ్గులకు రూ.20 వెరసి ఒక్కో కత్తిపీటకు.70 పెట్టుబడి అవుతుందని, రూ.100కి అమ్మితే రూ.30కు మించి మిగలదని చెప్పాడు. అంటే నెలకు సగటున 30 కత్తిపీటలను విక్రయిస్తే పెట్టుబడి పోను రూ.వెయ్యికి మించి మిగలదని అంటున్నాడు. తాను అమ్మే కత్తిపీట ధర రూ.100లే. అంతకు మించి ధర పెంచను. పెంచినా కొనరు. కొందరు మహిళలు రూ.50–కి 60కి బేరాలాడతారు. మరికొందరు తన కష్టాన్ని, వయసును చూసి జాలితో రూ.100కే కొంటారని చెబతాడు. ఓపిక లేకపోయినా వీటిని అమ్మడానికి నడిచే ఎందుకు వెళ్తున్నావని అడిగితే.. తనకు మిగిలే రూ.వందలో రూ.60–70 ఆటోలకే అయిపోతే ఇంకేమీ మిగలదు. అందుకే కాళ్లీడ్చుకుంటూ నడిచి వెళ్లి వస్తానని చెబుతాడాయన.
వ్యవసాయంతో పాటే కమ్మరాలు కనుమరుగు..
ఒకప్పడు వ్యవసాయం లాభసాటిగా సాగే రోజుల్లో కమ్మరం పనులు ముమ్మరంగా జరిగేవి. అప్పట్లో రైతులు తమ వ్యవసాయ పనిముట్ల తయారు చేసినందుకు ఈ కమ్మర్లకు ఏడాదికి పండిన పంటలో కొంత ఇచ్చేవారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, ఎద్దులు, బండ్లు, నాగళ్లు వంటి వాటికి బదులు ట్రాక్టర్లు రావడంతో కమ్మర్లకు పనిలేకుండా పోయింది. ఊళ్లలో క్రమంగా కమ్మరాలు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు ఊరూరా ఉండే కమ్మరాలు ఇప్పడు మండలానికి ఒకట్రెండు కూడా కనిపించడం లేదు.
ఎవరిపైనా ఆధారపడి బతకడం ఇష్టం లేక..
అన్నట్టు మన వీరభద్రుడికి అరడజను సంతానం. ఐదుగురు కొడుకులు,, ఒక కూతురు. వీరభద్రుడు మాత్రం తన సంతానంపై ఆధారపడలేదు. వయసు మీదపడి శరీరం సహకరించకపోయినా లేని శక్తిని కూడగట్టుకుని తన కులవత్తినే కొనసాగిస్తున్నాడు. చీనా పిల్లలంతా ఎవరి బతుకులు ఆళ్లు బతుకుతునారు నాయనా... కష్టపడి ఆళ్ల పిల్లల్ని పెంచుకుంటున్నారు. మేం మా పిల్లలికి బారం కాకూడదు. నాకెవరిపైనా ఆదారపడి బతకడం ఇష్టం ఉండదు. నాకు ఈ పని తప్ప మరేమీ సేతకాదు బాబూ. ఎన్నాళ్లు నా శరీరం సహకరిస్తదో.. అన్నాళ్లూ కష్టమైనా కత్తిపీటలనే తయారు చేసి అమ్ముకుని మా ఆవిడా, నేను బతుకుతాం. పెబుత్వం నెల నెలా ఇచ్చే రూ.4 వేల పెన్సను డబ్బుతో పాటు నేను నెలకు సంపాదించే రూ.వెయ్యితో జీవితం ఎళ్లబుచ్చుతున్నాం. నాకు బీపీ, సుగర్లు లేవు. ఈ మద్యనే కాస్త ఆయాసం వస్తంది. నా పెద్దకొడుకు ఆస్పత్రికి తీసుకెల్లి రక్తం ఎక్కించేడు. నాకు సిన్నప్పుడు నుంచీ సుట్ట కాల్చడం అలవాటు.. దాన్ని మానుకోలేకపోతనాను.. నాకు తొంబై ఏళ్లొస్తనాయి. సేతిలో సేవ, ఒంట్లో ఓపిక ఉన్నన్నాల్లూ కత్తిపీటలతోనే కాలక్షేపం సేస్తాను. ఎవరి మీదా ఆదారపడను.. అని ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో వీరభద్రుడు చెప్పాడు. తొమ్మది పదుల వయసులోనూ కాయకష్టంతో కత్తిపీటలు తయారు చేసి కాళ్లరిగేలా ఊళ్లు తిరుగుతూ నెలకు రూ.వెయ్యి సంపాదిస్తూ ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తున్న వీరభద్రుడుని మెచ్చుకోవాలా? లేక ఆరుగిరి సంతానం ఉండీ.. తండ్రి కష్టం నుంచి విముక్తికి ఆలోచించని పిల్లలని తప్పు పట్టాలా?