విజయవాడలో పాత పుస్తకాల పరిమళం
నాకు పుస్తకాలపై ఉన్న ప్రేమే నన్ను పుస్తకాల వ్యాపారిగా మార్చింది అంటున్నారు విజయవాడకు చెందిన పాత పుస్తకాల వ్యాపారి నర్రా జగన్ మోహన్ రావు.;
విజయవాడ నగరంలోని లెనిన్ సెంటర్ సమీపంలో సీఆర్డీఏ కార్యాలయం ఉత్తర దిశగా ఒక చిన్న రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద నడుస్తుంటే.. పాత కాగితాల సుగంధం, పుస్తకాల పరిమళం మనసును ఆకర్షిస్తుంది. అక్కడ ఒక చిన్న దుకాణంలో ‘ప్రాచీనాంధ్ర గ్రంధమాల’ అనే బోర్డు కనిపిస్తుంది. ఈ దుకాణం యజమాని నర్రా జగన్ మోహన్ రావు. సాహిత్య సముద్రంలో తనదైన గుండె లోతులను అందించే ఒక సాధారణ వ్యక్తి.
జగన్ మోహన్ రావు జీవితం ఒక సాహస కథ లాంటిది. ఎలిమెంటరీ విద్య మాత్రమే చదివిన ఈయన తెలుగు సాహిత్యంలో అపారమైన పరిజ్ఞానం సంపాదించారు. బాల్యంలోనే పుస్తకాల పట్ల మక్కువ పెంచుకున్న జగన్ ఒక్కొక్క పుస్తకాన్ని సేకరించి, ఆ పేజీల్లోని అక్షరాలతో స్నేహం చేశారు. కానీ.. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు కదా? సంఘర్షణ లేని జీవితం వ్యర్థమన్నాడు కారల్ మార్క్స్. ఒకప్పుడు హోటల్ వ్యాపారం పెట్టిన జగన్... నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. ఆ నష్టం ఆయనను కుంగదీయలేదు. మరింత ధైర్యాన్ని ఇచ్చింది. జీవితమంటే నిరంతర సంఘర్షణ. దానిని ఎప్పుడూ చేవ చచ్చిన దానిలా ఉంచకూడదని భావించారు.
ఒక రోజు తను ఏళ్ల తరబడి సేకరించిన పుస్తకాలను చూస్తుండగా జగన్‌కు ఒక ఆలోచన వచ్చింది. “ఈ పుస్తకాలు నా సంపద. వీటిని ఇతరులతో పంచుకోవాలి!” అని మనసులో అనుకున్నాడు. అలా.. ‘ప్రాచీనాంధ్ర గ్రంధమాల’ జన్మించింది. ఈ చిన్న దుకాణం కేవలం వ్యాపార స్థలం కాదు. అది సాహిత్య, పుస్తక ప్రియుల ఆలయం. ఇక్కడ పాత పుస్తకాలు కొనుగోలు చేసి, వాటిని మళ్లీ విక్రయిస్తారు. ప్రాచీన తెలుగు గ్రంథాలు, అరుదైన సాహిత్య రత్నాలు... ఇవన్నీ జగన్ దుకాణంలో దొరుకుతాయి.
జగన్ మోహన్ రావు వ్యాపారం లాభాపేక్ష కంటే సాహిత్య, పుస్తక ప్రియుల సేవే ఎక్కువ. ఎవరైనా తమకు కావాల్సిన పుస్తకం గురించి చెబితే.. అది తన దుకాణంలోకి వచ్చినప్పుడు ఫోన్ చేసి సమాచారం ఇస్తారు. ధర? అది అందరికీ అంగీకారమైనదే. ఒకసారి జగన్ షాపుకు వచ్చిన వాళ్లు, రెండోసారి ధర గురించి అడగరు. అంత నమ్మకం కలిగిస్తారు జగన్. ఆయన దుకాణంలో పుస్తకాలు కేవలం వస్తువులు కావు... అవి జ్ఞానం, విజ్ఞాన భావాలు, చరిత్ర, సకల సంపదల ఖజానాగా చెప్పొచ్చు.
సాహితీవేత్తలకు జగన్ ఒక వరం. ఆయన వద్ద అరుదైన పుస్తకాలు దొరుకుతాయి. అవి కూడా సహేతుక ధరలకే అందుతాయి. ఆయన చదువుకున్నది తక్కువైనా, సాహిత్యం పట్ల ఆయనకున్న అభిమానం, పఠన శక్తి అసామాన్యం. ఒక పుస్తకం గురించి జగన్‌తో మాట్లాడితే, ఆ పుస్తకం లోని ఆత్మను ఆయన వివరిస్తారు. ఆయన మాటల్లో సాహిత్యం ఊపిరి పోసుకుంటుంది.
జగన్ మోహన్ రావు జీవితం ఒక స్ఫూర్తి. ఒక సామాన్యుడు తన పుస్తకాల ప్రేమను వ్యాపారంగా మలచుకొని, సమాజానికి మంచి చేస్తూ, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన దుకాణం కేవలం పుస్తకాలు అమ్మే చోటు కాదు అది సాహిత్యాన్ని ఆస్వాదించే, గౌరవించే ఒక పవిత్ర స్థలం. జగన్ జీవితం మనకు చెప్పేది ఒక్కటే... “మనసుంటే మార్గం ఉంటుంది. పుస్తకం ఉంటే జ్ఞానం ఉంటుంది.”
‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి ఆయనను పలకరిస్తే ఎన్నో విషయాలు చెప్పారు. తాను 30 ఏళ్ల క్రితం షాపు పెట్టాను. నాకు పుస్తకాలపై ఉన్న ఆసక్తి నన్ను పుస్తకాల వ్యాపారిగా మార్చిందన్నారు. ఏమి చేయాలో దిక్కుతోచని సమయంలో పుస్తకం నన్ను మళ్లీ బాగా బతికేలా చేసింది. నేను ఎలిమెంటరీ స్కూలుకు వెళ్లే సమయంలోనే చదువు మానేశాను. ఇంటి వద్ద పరిస్థితులు, తల్లిదండ్రుల ఆర్థిక బాధలు అందుకు కారణం. హోటల్ పెట్టి బాగా నడిపిద్దామనుకున్నా... సాధ్యం కాలేదు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు సేకరించి దాచుకునే వాడిని. పాత పుస్తకాలు ఎవరి వద్ద ఉన్నా తక్కువ డబ్బులతో కొనుక్కునే వాడిని. చదివిన తరువాత ఆ పుస్తకాలను భద్రపరుచుకునే వాడిని. నా స్నేహితులు తీసుకెళ్లి చదువుకుని తిరిగి ఇచ్చే వారు. అలా సుమారు 300 పుస్తకాలు నాదగ్గర అప్పట్లో ఉన్నాయి. ఆ పుస్తకాలే నన్ను తీర్చి దిద్దాయంటారు.
ప్రజల్లో పఠనం తగ్గిపోయింది. ఇంటర్ నెట్ కాలం కావడంతో రాసిన పుస్తకాలు ప్రింట్ వేయించే రోజులు కూడా పోతున్నాయి. కంప్యూటర్లలోనే కావాల్సిన పేజీలు చదువుకుని వదిలేస్తున్నారు. భాషపైన పట్టుకూడా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పాత పుస్తకాలు మాత్రమే కొంటాను. నాకు చాలా మంది పుస్తకాలు తెచ్చి అమ్మెవాళ్లు ఉన్నారు. కొందరు కుర్రవాళ్లు అదే పనిగా బైకులు వేసుకుని వీధుల్లో తిరిగి ఎవరి ఇంట్లో పాత పుస్తకాలు ఉన్నా సేకరించి నా వద్ద అమ్ముతుంటారని చెప్పారు.
ప్రధానంగా కొందరు సాహితీ పరులు, బాగా పుస్తకాలు చదివే వారు కాలం చేసినప్పుడు వారి ఇంట్లో వాళ్లు ఈ పుస్తకాలు పాత కాగితాలు కొనే వారికి అమ్ముతారు. పెద్దవాళ్లు సంపాదించిన బంగారం, డబ్బులు మాత్రం పసుపు నీళ్లు చల్లి తీసుకుంటారు. పుస్తకాలు వేస్టని అమ్మేస్తారు. ఈ వేస్ట్ పుస్తకాలు నాకు వరం. అటువంటి వారి నుంచి వచ్చే ఎన్నో గ్రంథాలు నా వద్ద ఉంటాయని జగన్ మోహన్ రావు చెప్పారు.
నా వయసు 72 ఏళ్లు. నేను పింఛన్ కు కూడా దరఖాస్తు చేయలేదు. ఇంటి స్థలం కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఎందుకంటే... పుస్తకాలు అమ్మడం ద్వారా తినేందుకు సరిపడా డబ్బులు వస్తాయి. ఇప్పటి వరకు వ్యాపారం బాగానే ఉంది. నా వల్ల చాలా మంది చదువుకునే పిల్లలు పాత పుస్తకాలు సేకరించి డబ్బులు సంపాదిస్తున్నారు. నేను కొత్త పుస్తకాలు కొనను. కేవలం పాత పుస్తకాలే కొంటానని చెప్పారు. నేను పింఛన్ తీసుకోక పోవడం వల్ల ప్రభుత్వానికి డబ్బు మిగులుతుంది. లేదా మొకరికి అవకాశం వస్తుందని, ఎంతో మంది పేదవారు పూట గడవక బాధపడుతున్నారు. అటువంటి వారి కోసం నేను పింఛన్ తీసుకోవడం లేదన్నారు.
ఫోన్ వాడకాన్ని కూడా తగ్గించాలని, ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఒక సమయంలో వారి సబ్జెక్టులకు ఉపయోగ పడే అంశాలు మాత్రమే చూసే విధంగా ఉండాలన్నారు. కమ్యునికేషన్ కోసం మాత్రమే ఫోన్ ఉండాలి తప్ప అదే సర్వస్వం కాకూడదన్నారు.
పుస్తకాలు చదివే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. నా వద్ద కూడా ప్రస్తుతం పుస్తకాలు కొనే వారి సంఖ్య తగ్గింది. కారణాలు ఏవైనా పుస్తక పఠనం లేకుండా ఆలోచనా శక్తి పెరగటం సాధ్యం కాదన్నారు. నాకు వయసు పైనబడింది. అప్పుడప్పుడు మా ఆవిడ వచ్చి కూర్చొంటుంది. ఆ తరువాత ఇద్దరం కలిసి ఇంటికి వెళతామని చెప్పారు. ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండటం వల్ల ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు ఆ తరువాత సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు షాపు తీసి ఉంచుతున్నట్లు చెప్పారు.
ప్రతి స్కూళ్లో లైబ్రరీ ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ అందుకు చొరవ తీసుకుంటున్నానని చెప్పడం సంతోషించ దగ్గదేనన్నారు. అరుదైన పుస్తకాలు రీ ప్రింట్ చేయాలని ఆయన కోరారు. రచయితలు చనిపోయిన తరువాత ఆ పుస్తకాల గురించి పట్టించుకునే వారు ఉండటం లేదన్నారు. ఇందుకు టీటీడీ వంటి సంస్థలు చొరవ తీసుకోవాలన్నారు. మంచి సాహిత్యంపై వచ్చే రచనలను పుస్తకాలు వేయించే బాధ్యత కూడా టీటీడీ తీసుకుంటే బాగుంటుందన్నారు. ‘సకలార్థ సాగరం’ అనే ఒక పస్తకాన్ని చూపిస్తూ ఇటువంటి పుస్తకాలు అరుదుగా నా వద్దకు వస్తుంటాయన్నారు. ఈ పుస్తకం 1929లో ప్రింట్ చేశారు. వై దొరస్వామయ్య అనే రచయిత ఈ పుస్తకం రాశారు. ఎంతో మంచి పుస్తకమని అన్నారు.
ఇటీవల షాపు బోర్డు కొత్తది రాయించారు. ఒకవైపు ప్రాచీనాంధ్ర గంధమాల అనే పేరు ఉంటే మరో వైపు అమరావతి గ్రంధమాల అని బోర్డు రాయించారు. పేరు అమరావతి పెట్టుకోవడం వెనుక ఏముందని ప్రశ్నిస్తే అందరూ అమరావతి జపం పఠిస్తున్నారు. అందుకే నేను కూడా అమరావతి పేరుతో మరో బోర్డు రాయించానన్నారు.
బుక్స్ బాగానే వస్తున్నాయి. షాపు నిండుతోంది. కొనే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. అందువల్ల తాను కూడా కొనుగోలు తగ్గించుకుంటున్నానని చెప్పారు.