నినాదంగానే ‘జస్టిస్‌ ఫర్‌ సుగాలి ప్రీతి’ కేసు

మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదట తీసుకునే కేసు సుగాలి ప్రీతి కేసు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నాడు హామీ ఇచ్చారు.;

Update: 2025-02-16 09:54 GMT

అనేక మలుపులు తిరుగుతూ ఏళ్ల తరబడి దర్యాప్తుకు నోచుకోని సుగాలి ప్రీతి కేసు మరో సారి తెరపైకొచ్చింది. తాము అనేక కేసులతో బిజీగా ఉన్నామని, ఉన్న పరిమితమైన వనరులతో ఈ కేసును దర్యాప్తును చేపట్టలేమని, దీంతో సుగాలి ప్రీతి కేసును కొట్టేయాలని కోరుతో మూడు రోజుల క్రితం సీబీఐ ఎస్పీ రుఘురామరాజన్‌ మూడు రోజుల క్రితం హైకోర్టులో కౌంటర్‌ ఫిటీషన్‌ దాఖలు చేయడంతో మరో సారి సుగాలి ప్రీతి కేసు చర్చనీయాంశంగా మారింది.

ఒక్క సారి వెనక్కి వెళ్లి చూస్తే..
సుగాలి ప్రీతి కేసులో నాడు ప్రతిపక్షంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ అనేక కోణాల్లో ప్రసంగించారు. ప్రజల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, అధికారుల బాధ్యల గురించి ఆయన చాలా ఆవేశంగా ఉద్రేక పూర్వకంగా ప్రసంగించారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం నాడు పవన్‌ కల్యాణ్‌ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఏకంగా కర్నూలు వెళ్లి పోరాటం చేశారు. కర్నూలు ధర్నాలు.. ర్యాలీలు నిర్వహించారు. దీనికి భారీగానే స్పందన వచ్చింది.
జనసేన పారీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ ఏమని మాట్లారంటే..
సుగాలి ప్రీతి తల్లి ఓ దివ్యాంగురాలు. జనసేన పార్టీ కార్యాలయాన్ని వచ్చి కలిశారు. ఆమెను చూసి గుండె తరుక్కుపోయింది. ఎవరూ న్యాయ చేయడం లేదు. అప్పడు అందరూ న్యాయం చేస్తామని హామీలిచ్చారు. ఇప్పుడున్న సీఎంతో సహ(నాడు సీఎంగా జగన్‌ ఉన్నారు) అందరూ హామీలచ్చారు. కానీ ఎవ్వరూ న్యాయం చేయడం లేదు. మీరైనా మాకు న్యాయం చేయండి. న్యాయం చేస్తామని మాటిచ్చాం. దానిని సీరియస్‌గా తీసుకున్నాం. కర్నూలుకు తీసుకెళ్లాం. ఒత్తిడి పెంచాం. దీంతో ఎంతో కొంత కదిలింది. సీబీఐ దాకా వెళ్లింది. ఇంకా న్యాయం జరగ లేదు. మన గవర్నమెంట్‌ ఫామ్‌ అవగానే ఫస్ట్‌ కేసుగా ఈ సుగాలి ప్రీతి కేసును తీసుకుంటామని అందరి ముందు హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో కూడా పవన్‌ కల్యాణ్‌ చాలా పవర్‌ఫుల్‌గా మాట్లాడారు. సుగాలి ప్రీతి అనే 14 ఏళ్ల బిడ్డ స్కూల్‌కెళ్తే.. పది మంది నాశనం చేస్తే పట్టించుకోరు ఎవ్వరు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి గులకరాయి తగిలి చిన్న బొక్క పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకు తెలియదు. సగటు మనిషి బాధ మనం మరిచి పోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది. ఏడుపొస్తుంది. తప్పు జగన్‌మోహన్‌రెడ్డిది కాదు మంది. ప్రజలది. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే చచ్చిపోవడమే మేలు. అంటూ 2024 ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌ ఎంతో ఆవేశంగా ప్రసంగించారు.
అంతకు ముందు ఇదే అంశంపై పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. సుగాలి ప్రీతి దారుణంగా మానభంగానికి గురై చనిపోతే.. ఈ నాటికీ దానిని పట్టించుకున్న నాధుడే లేడు. ఒక్కరు లేరు. ఎవరూ మాట్లాడరు. పోలీసు వ్యవస్థ మాట్లాడదు. డీజీపీలు మాట్లాడరు. ఐపీఎస్‌లు మాట్లాడరు. ఐఏఎస్‌లు మాట్లాడరు. ఏం చేస్తాం అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేశ పూరిత ప్రసంగం చేశారు.
దీనిపైనా నాటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులకు ఆడబిడ్డలు ఉండరా? రాజకీయ నాయకులకు ఆడబిడ్డలు లేరా? సుగాలి ప్రీతిని చంపేసిన ఆ వెధవలకీ ఆడబిడ్డలు లేరా? అంటూ అందరినీ ప్రశ్నాంచారు. అయితే ఇది గతం.
సీన్‌ కట్‌ చేస్తే..
సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం కోసం నాడు గొంతు చించుకొని అరచి గీపెట్టిన పవన్‌ కల్యాణ్‌ నేడు ఆంధ్రప్రదేశ్‌కి ఉప ముఖ్యమంత్రి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టేకప్‌ చేసే తొలి కేసు సుగాలి ప్రీతి కేసు అని హామీ కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. సుగాలి ప్రీతి కేసును డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మొదటి కేసుగా తీసుకునింది లేదు. న్యాయం చేసింది లేదు. చివరికి ఈ కేసు చెత్త బుట్టలో పడేసే స్థితికి చేరింది. కేసును కొట్టేయాలని సీబీఐ కోర్టును కోరింది.
తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దర్యాప్తు చేపట్టే విధంగా సీబీఐని ఆదేశించాలని కోరుతూరు 2020 సెప్టెంబరు 11న ప్రీతి తల్లిదండ్రులు హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సీబీఐ ఎస్పీ రుఘురామ రాజన్‌ 2025 ఫిబ్రవరి 13న హై కోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ప్రీతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానాలు, తాము జోక్యం చేసుకోవల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని, ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా ఇది వరకే తెలియజేశామని, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీం కోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు సీబీఐ చేపట్టాల్సిన అనేక ముఖ్యమైన కేసులు ఉన్నాయని, వాటిని దర్యాప్తు చేయడంలో సీబీఐ నిమగ్నమై ఉందని ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు. తమకు ఉన్న పరిమితమైన వనరులతో ప్రీతి కేసు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని హై కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేపట్టే విధంగా ఆదేశించాలని కోరుతూ బాధితురాలు ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు ప్రీతి కేసు మీద ఏ విధంగా స్పందిస్తారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలి పోయింది.
కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌ రాజునాయక్, పార్వతీదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతిబాయ్‌ ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ పాఠశాల హాస్టల్‌లో పదో తరగతి చదువుతూ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయినట్లు పాఠశాల యాజమన్యాం చెప్పగా.. స్కూల్‌ యజమాని కొడుకులు రేప్‌ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రీతి డెడ్‌బాడీకి పోస్టుమర్టం నిర్వహించిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సైతం బాలిక మీద రేప్‌ జరిగినట్లు నిర్థారించారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ సైతం ఇదే విషయాన్ని నిర్థారిస్తూ నివేదిక ఇచ్చారని నాడు బాధితురాలి తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి రామలింగారెడ్డి యాజమానితో పాటు అతని కొడుకులపై ఫిర్యాదు చేశారు. నిందితులపై రేప్‌ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.
మరో వైపు ఈ ఘటనపై నిగ్గు తేల్చేందుకు నాటి కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఓ కమిటీని కూడా వేశారు. బాలికపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాల పట్ల అనుమానం వ్యక్తం చేసిన ఆ కమిటీ ప్రీతిపై లైంగిక దాడి చేసి.. హత్య చేసినట్లు నివేదిక కూడా ఇచ్చింది. ఆ మేరకు సాక్ష్యాలు బలంగా ఉన్న నేపథ్యంలో నాడు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అయితే కేవలం 23 రోజులకే వారు బెయిల్‌ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి తల్లిదండ్రులు తమ బిడ్డను మానభంగం చేసి హత్య చేసిన నిందితులను శిక్షించాలంటూ కలెక్టరేట్‌ మందు కూడా ఆందోళనలు చేపట్టారు. నాటి నుంచి అనేక ములుపుతు తిరుగుతూ వచ్చిన ఈ కేసు చివరికి హైకోర్టు కొట్టేసే స్థితికి వచ్చింది.
Tags:    

Similar News