తొక్కిసలాట పాపం మీకు తగులుతుంది
రాజకీయ ఎత్తుగడలు ఆపి దుర్ఘటనకు కారకులైన టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈవో, కలెక్టర్, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం జగన్ అన్నారు.;
By : Admin
Update: 2025-01-13 06:44 GMT
తిరుమల తిరుపతి తొక్కిసలాట పాపం ఊరికే పోదని.. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణలకు తగుతులుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దారుణంగా ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారకులైన వారిని వెంటేసుకొని రావడం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాట.. దానిపైన సీఎం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. జగన్ ఏమన్నారంటే..
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలి సారిగా తొక్కిసలాట జరిగి, ఆరుగురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులను, అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం మొదలు, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా, స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో, విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? జరిగిన ఘోరమైన ఘటనను సీరియస్‌గా తీసుకోలేదనేకదా అర్థం? తూతూ మంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా? శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? తూతూ మంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరి కొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా?
ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా.. సీఎం చంద్రబాబు దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరో వైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమో క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమో లేదు క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి, ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదు. చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్ చేసి, వీరిపై కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని, దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు. అంటూ ట్విటర్ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.