రాయలసీమ ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులు వేరని, పాలకులు చెబుతున్నది వేరని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశథరామిరెడ్డి మండిపడ్డారు. కరువు సీమకు సాగు, త్రాగు నీరిచ్చి ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికై నాలుగు దశాబ్దాల కిందట మొదలైన తెలుగుగంగ, గాలేరు – నగరి, హంద్రీ – నీవా ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాకపోవడం, పంట కాలువలు లేకపోవడం వలన రాయలసీమ ప్రాజెక్టుల కింద వున్న లక్షలాది ఎకరాలకు నేటికీ సాగునీరు అందకపోవడంలో వున్న వైఫల్యాలను, వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలుపడానికై ‘ఆలోచనపరుల వేదిక’ నాయకులు విశ్రాంత ఐపియస్ అధికారి ఏ.బి. వెంకటేశ్వరరావు నేతృత్వంలో రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీప్రసాద్, సాగునీటి రంగ విశ్లేషకులు తుంగ లక్ష్మినారాయణ, సామాజికవేత్త జొన్నలగడ్డ రామారావులు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్నారని బొజ్జా దశరథరామిరెడ్డి ప్రకటించారు.
ఆదివారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు సాధారణంగా కంటే నెలరోజుల ముందే వరదలు వచ్చినప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకుండా, తుంగభద్ర డ్యాంకు వచ్చిన వరదలను తుంగభద్ర నదికి, శ్రీశైలం ప్రాజెక్టులకు వరదలు వచ్చిన నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో నాగార్జునసాగర్‌కు తరలిస్తుండటంతో ఈ నేపథ్యంలో నీటిని తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలకు (హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ), కేసి కెనాల్ నీటిని విడుదల చేయాలని, పోతిరెడ్డిపాడు ద్వారా గాలేరునగరి, ఎస్ ఆర్ బి సి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీటి విడుదల చేయాలని, మల్యాల ద్వారా హంద్రీనీవాకు నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి, వివిధ ప్రజా సంఘాలు,, సిపిఐ పార్టీతో కలసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించింది. దీనికి స్పందించి నీటి విడుదలను తక్షణమే చేపట్టిన పాలకులు పూర్తిస్థాయిలో రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయని పరిస్థితి నేటికీ కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నుండి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుని పోవడానికి అవసరమైన శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం జరిగినప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు కేవలం 12 నుండి 15 వేల వేల క్యూసెక్కుల నీటిని కూడా రాయలసీమ పొందడం లేదని అయితే పోతిరెడ్డిపాడు నుండి విడుదల చేస్తున్న 35000 వేల క్యూసెక్కులలో 20 వేల క్యూసెక్కుల నీరు కుందూ నది ద్వారా నెల్లూరు వైపు సముద్రాన్ని చేరడానికి ఉరకలు వేస్తున్నాయని అన్నారు.
వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే పాలకులు మా గొప్పతనంతోనే ఒక నెలరోజుల ముందే నీటిని విడుదల చేసాం.. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నాం అనే ప్రకటన ఆర్భాటం ఒకవైపు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తరలిస్తూ శ్రీశైలం రిజర్వాయర్ అంతా ఖాళీ చేస్తున్నారన్న తెలంగాణ నుండి అవాస్తవ ప్రకటనలతో రాయలసీమను దోషిగా చూపుతూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకృతి కనికరించి కృష్ణా తుంగభద్ర జలాలు రాయలసీమ ముంగిట చేరినా రాయలసీమ హక్కును నీటిని పొందలేకపోతోంది.. ఈ నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు అందించడానికి అవసరమైన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లబోస్తోంది. అటు తెలంగాణలో నీళ్ల చుట్టూ భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ పార్టీలు తహతలాడుతున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకొని, ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణం ప్రజల సంక్షేమం కోసమే చేపట్టేలాగా పాలకులపై ఒత్తిడి పెంచే దిశగా ఆగస్టు 5 , 6 వ తేదీలలో ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాలను, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు రిజర్వాయర్, గోరకల్లు, అలగనూరు, సుంకేసుల బ్యారేజ్ ల సందర్శన కార్యక్రమం, ఆరవ తేదీ మూడు గంటలకు ఎస్‌టియు భవన్ కర్నూలు లో పత్రిక విలేకరుల సమావేశాన్ని ‘ఆలోచనపరుల వేదిక‘ ఏర్పాటు చేసిందని తెలిపారు.
విశ్రాంత ఐపీఎస్ ఉన్నతాధికారి ఏ బి వెంకటేశ్వరరావు, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవాని ప్రసాద్, సాగునీటి రంగ విశ్లేషకులు తుంగ లక్ష్మీనారాయణ, సామాజికవేత్త జొన్నలగడ్డ రామారావు, సిపిఐ నాయకులు రామచంద్రయ్య తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయాలకు అతీతంగా వ్యక్తులు పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనవలసినదిగా దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు చెరుకూరి వెంకటేశ్వరనాయుడు, నిట్టూరు సుధాకర్ రావు, న్యాయవాది అసదుల్లా, భాస్కర్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, రాఘవేంద్ర గౌడ్, మహమ్మద్ పర్వేజ్, పట్నం రాముడు, జానో జాగో నాయకులు మహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.