నెల్లూరులో కాకరేపుతున్న రాజకీయం
టీడీపీ నేత ఆత్మహత్యాయత్నంతో వేమిరెడ్డి దంపతులు మళ్లీ సెంట్రిక్ గా మారారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-12 07:10 GMT
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు కూడా కాకరేపుతున్నాయి. సింహపురిలో రాజకీయం వేడెక్కింది. వరుస సంఘటనలతో నేతలు వీధికెక్కారు. నెల్లూరులో టీడీపీ మైనారిటీ నేత ఇమాంబాషా ఆత్మహత్యా యత్నం సంఘటన మరింత కలకలం రేపింది. ఈ సంఘటనలకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు కేంద్ర బిందువుగా మారారు.
"మొదటి నుంచి టీడీపీలో ఉన్న తనను కాదని, పక్క పార్టీల నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారు" అని ఇమాంబాషా ఆరోపించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందనేది ఆస్పత్రి వర్గాల సమాచారం. ఈ సంఘటనతో వేమిరెడ్డి దంపతులు ఇరకాటంలో పడ్డారు.
పురుగుల మందు తాగిన టీడీపీ మైనారిటీ నేత ఇమాంబాషా
"ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా కలుపుకు పోవాలి, అంతా సర్దుకుంటుంది" అని టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వ్యాఖ్యానించడం ద్వారా వేమిరెడ్డి దంపతులకు అండగా నిలిచారు.
"కొత్తవారు పార్టీలో చేరినప్పుడు పాతవారితో సర్దుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అన్ని సర్దుకుంటాయి" అని అబ్దుల్ అజీజ్ వ్యాఖ్యానించారు.
"స్థానిక నాయకులతో చిన్న సమస్యల కారణంగా ఈ సంఘటన చోటుచేసుకుంది" అని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇమాంబాషా కొంచెం ఎమోషనల్ అయ్యారు. పరిస్థితి చక్కదిద్దుతా. ఆయన హార్ట్ ఆపరేషన్ కూడా మేమే చేయించాం" అని ప్రశాంతిరెడ్డి చెప్పారు.
నెల్లూరులో పరిస్థితి ఇదీ..
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు నెరపడంలో పెద్దరెడ్లదే కీలకపాత్ర. పార్టీలు వేరైనా వారి మధ్య మాటలు ఎప్పుడూ హద్దు దాటలేదు. వ్యంగ్యాస్త్రాలు, విమర్శలతో తమ పార్టీ వాణిని వినిపించే వారు. ఇది గత ఎన్నికల కిందటి వరకు మాత్రమే కనిపించిన పరిస్థితి. ప్రస్తుతం ఆ వాతావరణం లేకుండా పోయిందనేది సింహపురి ప్రజలే కాదు. పొరుగు ప్రాంత నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2024 ఎన్నికలతో నెల్లూరు రాజకీయ చిత్రంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరారు. పారిశ్రామికవేత్తగా ఉన్న ఆయన జిల్లాలో సామాజికసేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అయ్యారనడంలో సందేహం లేదు.
ఆయనను పార్టీలో చేర్చుకునే సమయంలో కూడా సీఎం ఎన్. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వేమిరెడ్డిని వదులుకోవడం వైసీపీ తప్పిదం" అని ఏమాత్రం భేషజానికి పోకుండా చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.
2019లో నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. అటువంటి జిల్లాలో గత ఎన్నికల్లో అన్ని స్థానాలు టీడీపీ ఖాతాలో జమ అయ్యాయి. అందులో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నుంచి విజయం సాధించారు. మిగతా నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా వారు సహకారం అందించారనేది టాక్.
ఇంతకీ ఏమి జరిగింది..
జిల్లాలోని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేతిలో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యలు దాడులకు ప్రేరేపించాయి. ప్రశాంతిరెడ్డికి సానుభూతి దక్కేలా చేశాయి. ఇదిలావుంటే..
మైనారిటీ నేత ఆత్యహత్యా యత్నం
నెల్లూరు జిల్లాలో ఆర్థికంగా స్థితివంతుల్లో ఒకరుగా ఉన్న వేమిరెడ్డి దంపతులు టీడీపీలో కీలకంగా మారారు. పేదల కోసం కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఖర్చు చేస్తున్నారు. కాగా, వైసీపీ నుంచి కూడా కొందరు టీడీపీలో చేరారు. జిల్లా పరిస్థితి పక్కన ఉంచితే, కోవూరు నియోజకవర్గంలో జిల్లా టీడీపీ మైనారిటీ విభాగం సీనియర్ నేత ఇమాంబాషాకు వైసీపీ నుంచి వచ్చిన నేత రఫీ పోటీగా మారారు.
"ఆయనకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు. నన్ను అణిచివేస్తున్నారు" అని ఇమాంబాషా ఆగ్రహంగా ఉన్నారు.
"కష్టపడిన వారికి గుర్తింపు లేకుండా పోతోంది" అని ఇమాంబాషా టీడీపీ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి, ఆత్యహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
"నా ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం కృషి చేశా. చేసిన బాకీలు నా బిడ్డ జీతం నుంచి ఈఎంఐలు కడుతున్నా" అని ఇమాంబాషా ఆవేదన వెళ్ళగక్కారు.
ఆయన ఏమన్నారంటే...
"వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోవూరు నియోజకవర్గంలో పట్టుమని 100 మంది కూడా వైసీపీకి ఎదురుగా నిలబడలేదు. టిడిపిలో ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయానికి కృషి చేశా. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని ఆరోపించారు.
"కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరెవరికో కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే, అడ్డుకున్నందుకు నాపైనే కేసులు పెట్టారు" అని ఇమాంబాషా వివరించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.
ఈ సంఘటన నేపథ్యంలో టీడీపీలో అసంతృప్తి బయటపడింది. దీనిపై పార్టీ రాష్ట్ర పెద్దలు కూడా సీరియస్ అయ్యారని సమాచారం.
టీడీపీ జిల్లా మైనారిటీ నేత ఇమాంబాషా ఆత్మహత్యాయత్నంపై నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ స్పందించారు.
"ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగదు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కూడా హాస్పిటల్ కి వెళ్లి ఆ కార్యకర్తను పరామర్శించారు" అని అబ్దుల్ అజీజ్ చెప్పారు. ఇమాంబాషా ఆరోగ్యం కాపాడేందుకు ఎమ్మెల్యే అన్ని సదుపాయాలు కల్పించారని కూడా ఆయన చెప్పారు.