Anantapur : ముగ్గరు అన్నదమ్ముల పోలీస్ కథ
ఆ ఇంట్లో నలుగురు పోలీసులు.;
ఐఏెఎస్ కొడుకులు ఐఏఎస్ లు కావడం చూస్తున్నాం. లాయర్ కొడుకు లాయర్, డాక్టర్ కొడుకు డాక్టర్ అవడం చాలా చోట్ల చూస్తున్నాం. ఇక్కడ చిత్రం ఏమిటంటే అనంతపురంలో ఓ హెడ్ కానిస్టేబుల్ తన ముగ్గరు కొడుకులను కానిస్టేబల్స్ గా చేయగలిగారు. అనంతపురం జిల్లా గుత్తి ఒక సాధారణ పట్టణం. ఇప్పుడు ఒక అసాధారణ కథకు అవకాశం ఇచ్చింది. ఈ పట్టణంలోని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ముగ్గురు సోదరులు హమ్మద్ అలీ, మహమ్మద్ గౌస్, మహమ్మద్ సమీర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్‌లో ఎంపికై, తమ కుటుంబానికి, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. వీరి తండ్రి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ దౌలా అనంతపురంలో ఉద్యోగం చేస్తున్నారు. తన సేవలతో సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన అడుగు జాడల్లో నడిచిన ఈ ముగ్గురు కుమారులు, తమ కష్టార్జితంతో అంకితభావంతో ఈ విజయాన్ని సాధించారు.
కలల ప్రయాణం
ఒక సాధారణ ఇంట్లో జన్మించిన మహమ్మద్ అలీ పెద్దవాడు, గౌస్ రెండో వాడు. ఇద్దరూ డిగ్రీ చదివారు. వీరు ఇద్దరూ సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపికయ్యారు. సమీర్ బీటెక్ పూర్తి చేసి ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి తమ తండ్రి మహబూబ్ దౌలా సేవాగుణాన్ని, క్రమశిక్షణను చూసి పెరిగారు. పోలీస్ ఉద్యోగంలో ఉన్న తండ్రి, తన విధుల్లో నిజాయితీ, నిబద్ధతతో సమాజానికి సేవ చేసే తీరు ఈ సోదరులకు స్ఫూర్తిగా నిలిచింది.
‘మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు, ఏ పని చేసినా నీతితో, కష్టపడి చేయాలి. అప్పుడే ఫలితం శాశ్వతంగా ఉంటుంది.‘ అని మహమ్మద్ అలీ గుర్తు చేసుకున్నాడు. ఈ సోదరులు తమ తండ్రి మాటలను హృదయంలో ఉంచుకుని, పోలీస్ ఉద్యోగం కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. తెల్లవారు జామున లేచి శారీరక శిక్షణ, సాయంత్రం పుస్తకాలతో చదువు ఇలా వారి రోజువారీ జీవితం క్రమశిక్షణతో నడిచింది.
ముగ్గురు సోదరులు ఒకరికొకరు సహకరించుకునేవారు. ‘మేము ముగ్గురం కలిసి చదివేవాళ్లం. ఒకరికి అర్థం కాని విషయం ఉంటే... మరొకరు వివరించేవాడు. శారీరక శిక్షణలో కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకునేవాళ్లం’ అని మహమ్మద్ గౌస్ చెప్పాడు. ఈ బంధం ఒకరిపట్ల ఒకరికి ఉన్న గౌరవం, వారి విజయంలో కీలక పాత్ర పోషించింది.
కుటుంబంలో సంతోష వెల్లువ
ఫలితాలు వెలువడిన ఆగస్ట్ 1, 2025న మహబూబ్ దౌలా కుటుంబంలో ఒక పండుగ రోజులా మారింది. ముగ్గురు కుమారులు పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైన విషయం తెలియగానే, ఇంట్లో సంతోషం పొంగిపోయింది. ‘మా ముగ్గురు కొడుకులు ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడం చూస్తుంటే, నా జీవితం ధన్యమైందనిపిస్తోంది’ అని మహబూబ్ దౌలా ఆనంద భాష్పాలతో చెప్పారు. కుటుంబానికి అండగా నిలిచిన స్తంభం వారి తల్లి. తన కొడుకుల విజయాన్ని చూసి ఆనందంతో గుండెలు నిండినట్టు చెప్పింది.
గుత్తి పట్టణంలోని బంధుమిత్రులు, పొరుగు వారు ఈ విజయాన్ని జరుపుకోవడానికి ఇంటికి వచ్చారు. ‘ఇది మా ఊరికే గర్వకారణం. ఈ ముగ్గురు యువకులు మా పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు’ అని ఒక స్థానికుడు దాసా రమేష్ చెప్పారు. ముగ్గురు సోదరులు ఒకే సమయంలో పోలీస్ ఉద్యోగాలు సాధించడం గుత్తిలో చర్చనీయాంశంగా మారింది.
కలల కుటుంబం
ఈ ముగ్గురు సోదరుల కథ కేవలం ఉద్యోగం సాధించిన విజయం మాత్రమే కాదు... ఇది కలలను నిజం చేసుకునే పట్టుదల, కుటుంబ బంధం, సమాజం పట్ల బాధ్యత గురించి చెప్పే కథ. మహమ్మద్ సమీర్, చిన్నవాడైనప్పటికీ, తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేశాడు. "మేము పోలీస్ ఉద్యోగంలో చేరడం వెనుక మా కుటుంబానికి మంచి పేరు తీసుకురావడమే కాదు, సమాజానికి సేవ చేయాలనే తపన కూడా ఉంది. మా నాన్నలా మేము కూడా నిజాయితీగా విధులు నిర్వహిస్తాం." అన్నారు.
సోదరుల విజయం వెనుక తల్లిదండ్రులు నీడలా నిలిచారు. వాళ్లు రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా చదివారు. వాళ్ల కష్టం ఈ రోజు ఫలించింది అని వారి తల్లి గర్వంగా చెప్పింది. ఈ కుటుంబంలోని ప్రతి సభ్యుడి మధ్య ఉన్న ప్రేమ, గౌరవం, ఒకరికొకరు అండగా నిలవడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకం చేసింది. గుత్తిలో హైస్కూలు విద్య పూర్తయిన తరువాత అనంతపురం చేరుకున్న వీరు ఉన్నత విద్యను అనంతపురంలో పూర్తి చేశారు. తండ్రి ఉద్యోగ రిత్యా అనంతపురం వెళ్లాల్సి రావడంతో కుటుంబం అంతా ప్రస్తుతం అనంతపురంలోనే ఉంటోంది. వీరికి కోచింగ్ తీసుకునేందుకు కూడా ఇక్కడ మంచి అవకాశంగా మారింది. కానిస్టేబుల్ ఉద్యోగమే అయినా చదవడం, శారీరక వ్యాయామాలు చేయడం వారిని ఉన్నత స్థితికి తీసుకొచ్చింది.
సేవలో స్ఫూర్తి
ఈ ముగ్గురు సోదరులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో భాగంగా సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ‘మేము యువతకు స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నాం. కష్టపడితే ఏ కలనైనా సాధించవచ్చని నిరూపించాలని ఉంది’ అని మహమ్మద్ అలీ చెప్పాడు. వారి తండ్రి మహబూబ్ దౌలా, తన కొడుకులు తన కంటే ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
గుత్తి నుంచి వచ్చిన ఈ ముగ్గురు సోదరుల కథ, కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడిన తీరు, కుటుంబ బంధం, సమాజ సేవ విలువను తెలియజేస్తుంది. వారి విజయం అనంతపురం జిల్లా యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తూ, ఎందరికో స్ఫూర్తినిస్తుంది.