IFS|ఇంటి ఓనర్ కాఠిన్యం.. ఆఫీసులోనే అధికారి అంత్యక్రియలు!
మూఢత్వం ముందు మానవత్వం ఓడిపోయింది. బతికి ఉన్నప్పుడు చూపించిన ప్రేమ, ఆప్యాయత చనిపోయాక మాయమైంది. ఐఎఫ్ఎస్ అధికారికి ఆఫీసు వాళ్లే ఆప్తులయ్యారు.;
మనసున్న మనుషులు మాయమవుతున్నారు. మూఢ నమ్మకాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఎవరు చెప్పినా వినే స్థితి నుంచి కొందరు మూఢత్వ వాదులు దాటి పోయారు. వారు పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు. కాదంటే ఎదిటి వారిని చంపేందుకు కూడా వెనుకాడే పరిస్థితి లేదు. అందుకే ‘మాయమై పోతున్నడమ్మో మనిషన్న వాడు’ అంటూ ఓ కవి ఎప్పుడో చెప్పాడు. మనసు లేని మనిషి చచ్చిన శవంతో సమానమనే విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో కొందరు ఉన్నారు. ఎక్కడో రోడ్డుపై మృతి చెందిన వ్యక్తులను సైతం కొందరు మనసున్న వ్యక్తలు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తి పాడె వారే మోస్తున్నారు. ప్రధానంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇదే పని చేస్తున్నాయి. అనాథలకు ఆశ్రయం ఇస్తున్నాయి.
అయితే నేను చెబుతున్న వ్యక్తి కఠినాత్ముడు. పేదవాడు కాదు. కోట్లకు పడగలెత్తిన వాడు. భవంతులపై భవంతులు మంగళగిరి ప్రాంతంలో (అమరావతి) నిర్మించాడు. అదే రెయిన్ ట్రీ పార్క్, అందులోని అపార్ట్ మెట్స్ లో వేల ఫ్లాట్స్ ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ నుంచి వేలకు వేలు తీసుకుంటూ ఇళ్లు అద్దెలకు ఇస్తుంటాడు. అన్ని సౌకర్యాలు ఉన్నందున ఇల్లు బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్స్ పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రమేశ్ కుమార్ సుమన్ (59) అద్దెకు తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండగానే గుండె పోటుతో మరణించారు. ఆయన జీవిత కాలం ఆంధ్రప్రదేశ్ లోనే గడిచింది. ఆంధ్రప్రదేశ్ తో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది.
జార్ఖండ్ కు చెందిన రమేశ్ కుమార్ సుమన్ ఐఐటీ కాన్పూర్ లో బిటెక్, ఎంటెక్, ఎంబీఏ చదివారు. ఆంధ్రప్రదేశ్ ను తన రాష్ట్రంగా భావించారు. ఐఎఫ్ఎస్ అధికారి కావడంతో ఏ రాష్ట్రంలో ఉద్యోగం వస్తే ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. ఏపీ కేడర్ కు సెలక్ట్ అయిన తరువాత తాను చేసిన సేవలు అనితర సాధ్యమైనవిగా సన్నిహితులు చెబుతున్నారు. నిరంతరం పర్యావరణం గురించి ఆలోచించే వారు. మనిషికి ప్రాణవాయువు నందించే చెట్లు ఎంతో అవసరం. అందువల్ల భూ భాగంలో మూడో వంతు అడవులు ఉండాలి. లేకుంటే మనిషి జీవనం ఉండదు. పైగా వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నదంటే తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు పనికి రాకుండా పోతాయని, అడవుల రక్షణలో తన వంతు కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
రాష్ట్రంలో అడవుల అభివృద్ది, జీవ వైవిద్య పార్కుల అభివృద్ధికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని కొచ్చి లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కొద్ది రోజుల క్రితం వెళ్లారు. శిక్షణలో ఉండగానే గుండె పోటు రావడంతో అక్కడే మరణించారు. ఉన్నతాధికారి మరణించడంతో తనతోటి సహచరులు, మిత్రులు కన్నీటి పర్యంత మయ్యారు. గుండె నొస్తుందని చేత్తో ఛాతిని పట్టుకున్న రమేశ్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. వెంటనే మంగళగిరిలో ఉన్న భార్య పిల్లలకు సమాచారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా రమేశ్ కుమార్ కుటుంబానికి సంతాపం తెలిపారు. మంచి అధికారిని కోల్పోయామనే బాధను వ్యక్తం చేశారు. జనవరి 18న మృత దేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఇంటి వద్ద ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న ఇంటి యజమాని నా ఇంట్లోకి శవాన్ని తీసుకు రావడానికి వీలు లేదని పేచీ పెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారి, అటవీ శాఖకు ప్రాణం పోసిన వారు, ఎంతో మందికి ప్రాణ వాయువును అందించేందుకు, పర్యావరణ పరిరక్షనకు పాటు పడిన వారు. అటు వంటి వ్యక్తికే అమరావతిలో దిక్కులేకుండా పోయింది. ఆ కుటుంబానికి తీవ్ర అవమానం జరిగింది. ఉన్న ఇంటికి రాకుండా మృత దేహాన్ని ఎక్కడికి తీసుకెళతారు. ఏమిటి ఇంత దారుణం అంటూ కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు బాధ పడ్డారు.
ఎందుకు ఇలా జరిగింది? ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చి ఏపీలో ఉన్నతాధికారిగా సేవలందించిన రమేశ్ కు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అద్దె ఇంట్లో ఉంటే మృత దేహాన్ని తీసుకు రానివ్వరా? ఎవరా ఇంటి ఓనర్? ఎందుకు ఇలా చేశారు? అనే అంశాన్ని ముఖ్యమంత్రి కనీసం పరిశీలించాల్సిన అవసరం లేదా? అనేది పలువురి అభిప్రాయం. ఎంతో మంది సెంట్రల్ సర్వీస్ వారు ఈ హటాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఆ కుటుంబం ఈ రాష్ట్రమే తమ సొంత రాష్ట్రం అనుకుంది. జీవితం ఇక్కడే నని అనుకున్నారు. ఇక్కడి మనుషులకు మానవత్వం లేదు. డబ్బు యావ తప్ప మనుషులనే మాట కూడా మరిచి పోయారని రమేశ్ భార్య లోలోపల కుమిలి పోయారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు వారు చేస్తున్న బిక్కు బిక్కు చూపులు శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన వారికి కన్నీరు పెట్టించాయి. మాకు దిక్కెవరు? అనే ఆందోళన వారిలో కనిపించింది.
తన భర్త మృత దేహాన్ని ఇంటికి తెచ్చేందుకు ఇంటి ఓనర్ అంగీకరించకపోవడమే కాకుండా ఆయన ఎంతటి వాడైతే నాకేంటి శవాన్ని ఇంటికి తేవొద్దు.. అంతే.. అంటూ హూంకరించడంతో రమేశ్ భార్యా బిడ్డలు మాకు దిక్కెవరని వణికి పోయారు. రమేశ్ సహచర ఉద్యోగులు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్దకు మృత దేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ నుంచే జరగాల్సిన తంతు అంతా జరిపించారు. ఒక వైపు తన భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంతో ఉన్న భార్యా, ఆమె పిల్లలు కాస్త ఉపశమనం కలిగింది. లేకుంటే ఆమె గుండె ఆగిపోయే పరిస్థితిని ఇంటి ఓనర్ తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లలు బీటెక్ చదువుతున్నారు. కుమార్తె ఐఐటీ కాన్పూర్ లో చదువుతుండగా, కుమారుడు హైదరాబాద్ లో చదువుతున్నాడు.
ఇదీ నేటి సమాజం తీరు. మూఢ నమ్మకాలు, ఎదిటి వ్యక్తిని గౌరవించే మనస్తత్వం లేకపోవడం, అహంకారంతో విర్రవీగటం అమరావతి ప్రాంతంలోని కొందరు బడా బాబులకు పరిపాటిగా మారింది. సందర్భం వచ్చినప్పుడు అటువంటి వ్యక్తుల అహంకారాన్ని అణచి వేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. మనిషి మనసుతో జీవించనంద కాలం ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది.