తురకపాలెం మృత్యుఘోష మిస్టరీ వీడింది!

మెలియాయిడోసిస్ అంటే ఏమిటీ? ఎందుకు వస్తుంది?;

Update: 2025-09-07 02:43 GMT
తురకపాలెం మిస్టరీ వీడింది. మృత్యుఘోషకు కారణం తెలిసింది. అంతుచిక్కని వ్యాధులతో కొంతకాలంగా ఆ గ్రామంలో పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో మంచానపడిన వారుండడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెట్టిన వైద్యాధికారులు దీని గుట్టు తేల్చాలని నిర్ణయించారు. ఇంతలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి 72 గంటల్లో రిపోర్టులు తన టేబుల్ మీద ఉంచాలని ఆదేశించడంతో వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు, ల్యాబుల అధికారులు తురకపాలెం గ్రామాన్ని శోధించారు. ఈ మరణాల వెనుక గుట్టు ఏమిటో తేల్చారు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ వీడింది. గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యు­లు, పెథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, బయోకెమిస్టులు గ్రామస్తుల నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆయాసం, దగ్గు, ఊపిరి తీసుకో­వడంలో ఇబ్బంది లాంటి సమ­స్య­లు ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు.
గ్రామ ప్రజల మరణాలకు అత్యంత అరుదైన మెలియోడోసిస్‌ వ్యాధి కారణమని దాదాపు నిర్ధారించారు. బుర్‌కోల్డెరియా సూడోమల్లై అనే బ్యాక్టీరియా వల్ల ప్రజలు జ్వరాల బారిన పడి మరణిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
తురకపాలెం గ్రామంలో 2,507 మంది జనాభా ఉన్నారు. వీరిలో సుమారు 500 మంది పిల్లలు. వీరికి మినహా మిగతావారందరికి గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌ వైద్యులు, వైద్య సిబ్బంది సుమారు 40 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. శనివారం శాంపిల్స్‌ సేకరించి వైద్య కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య కళాశాల ప్రిన్సి­పాల్‌ డాక్టర్‌ ఏవీ సుందరాచారి, గుంటూరు డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నాయి.
అసలేమిటీ మెలియాయిడోసిస్..
మెలియాయిడోసిస్ అనేది బుర్‌కోల్డెరియా సూడోమల్లై అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా నీరు, మట్టి, గాలిలో ఉంటుంది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలో ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. తీర ప్రాంతాల్లో, వర్షపు నీరు నిలిచిన బురదలో ఇది వృద్ధి చెందుతుంది. 'విట్‌మోర్ డిసీజ్' అని కూడా అంటుంటారు. దీని ప్రభావం మనుషులు, జంతువులపై ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, రక్తం, చర్మం, కీళ్లను దెబ్బతీస్తుంది.
మెలియోడోసిస్ లక్షణాలు ఏమిటీ?
-బాక్టీరియా వల్ల వచ్చే జ్వరం/వ్యాధి.
-ఈ బాక్టీరియా ఎక్కువగా మట్టి, నిల్వ నీటిలో ఉంటుంది.
-గాయాల ద్వారా, నీరు తాగడం ద్వారా లేదా ఊపిరితిత్తుల్లోకి చేరడం ద్వారా మనిషికి సోకుతుంది.
-పదే పదే జ్వరం వస్తుంది
-దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
-కీళ్ల నొప్పులు
-చిన్న గాయం పెద్ద పుండిగా మారడం
-బలహీనంగా అనిపించడం
ఎవరికి ఎక్కువగా సోకే అవకాశం?
-మధుమేహం ఉన్నవారు
-బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు
-రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు
ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి
-నిల్వ నీరు తాగకండి, ఎప్పుడూ మరిగించిన నీరు వాడండి.
-వర్షపు నీటిలో నడవడం, మట్టి తాకడం తగ్గించండి.
-గాయం అయితే వెంటనే శుభ్రం చేసుకోండి, కట్టుకోండి.
-అనుమానం ఉన్నా అస్పత్రిలో పరీక్షలు చేయించుకోండి.
చికిత్స ఉందా?
ఉంది. డాక్టర్ ఇచ్చే యాంటీబయాటిక్ మందులు తీసుకుంటే ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుంది.
-నీ మందులు కొన్ని నెలలు వరకూ క్రమం తప్పకుండా తీసుకోవాలి.
-ఈ వ్యాధి ప్రమాదకరం కానీ సమయానికి గుర్తిస్తే పూర్తిగా నయం అవుతుంది.
-జ్వరం, పుండ్లు, శ్వాస సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి.
Tags:    

Similar News