DEAD BODY | పార్శిల్ శవం మిస్టరీ వీడలేదు, దర్యాప్తు ఆగలేదు!
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండికి వచ్చిన పార్శిల్ శవం (Parcel Corpse) మిస్టరీ వీడలేదు. డిసెంబర్ 19న సాగి తులసి ఇంటికి ఈ పార్శిల్ వచ్చింది.
By : The Federal
Update: 2024-12-23 06:30 GMT
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి వచ్చిన పార్శిల్ శవం (Parcel Corpse) మిస్టరీ ఇంకా వీడలేదు. డిసెంబర్ 19న సాగి తులసి అనే ఒంటరి మహిళ ఇంటికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఓ శవాన్ని పార్శిల్ చేసి ఆమె ఇంటికి పంపారు. గృహ నిర్మాణ సామగ్రి పార్సిల్ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయటపడింది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి చెల్లెలి భర్త శ్రీధర్ వర్మ అలియాస్ సురేంద్రవర్మ, సుధీర్‌వర్మ ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే ఈ శవం ఎక్కడి నుంచి వచ్చిందీ, ఎవరు పంపారనే దానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది. అక్కడి నుంచే పిప్పరకు చెందిన ఆటోడ్రైవర్‌తో తన వద్ద ఉన్న ఈ పెట్టెను యండగండి తీసుకెళ్లాలని కిరాయికి మాట్లాడి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె కారు ఏ వైపు వెళ్లిందనేది ఇంకా తేలలేదు. ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆ చెక్కపెట్టె వచ్చిన తర్వాతే వర్మ పరారీ...
ఆ పెట్టె తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించగానే ఆమె మరిది శ్రీధర్‌వర్మ పరారయ్యాడని, ఆయన కూడా ఎరుపురంగు కారులోనే పరారైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు శ్రీధర్ వర్మకు ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయా అనే విషయాన్నీ పోలీసులు పరిశీలిస్తున్నారు.
పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే.. అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. కేసు పురోగతిపై ఐజీ అశోక్‌కుమార్ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో డిసెంబర్ 22న సమీక్షించారు. మరోవైపు.. చెక్క పెట్టెలోని శవం ఎవరిదో గుర్తుపట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో 30-40 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు అదృశ్యమైతే తమకు తెలియజేయాలని ఉండి ఎస్సై నసీరుల్లా కోరారు.
అసలు కథ ఇదీ...
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి.. డిసెంబర్ 19వ తేదీ రాత్రి, ఓ ఓంటరి మహిళకు ఎక్కడి నుంచో ఓ పార్శిల్ ఆటోలో వచ్చింది. తాను కట్టుకుంటున్న ఇంటికి సంబంధించిన సామాగ్రి అనుకున్నారు. దాన్ని తర్వాత చూడొచ్చులెమ్మని ఆ పెట్టెను ఓ పక్కన పెట్టించారు. పొద్దుట్నుంచి పని చేసి ఉండడం వల్ల ఆమె నిద్రకు ఉపక్రమించారు. అలా ఓ గంట తర్వాత ఆ పార్శిల్ నుంచి ముక్కులు పగిలే వాసన వస్తోంది. ఎక్కడి నుంచి వస్తుందో తొలుత అర్థం కాకపోయినా ఆ తర్వాత పార్శిల్ నుంచి అని పసిగట్టి పగలగొట్టి చూశారు. అంతే ఆమె అవాక్కయింది. సామానుకు బదులు ఆ ప్లాస్టిక్ బ్యాగులో ఉన్న శవాన్ని చూసి భయంతో కంపించి పోయింది.(TERROR) కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు పోగయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యండగండికి చెందిన తులసీ అనే ఒంటరి మహిళ చాలా కాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో తనకో గూడు కట్టించుకోవాలని పలువురి సాయం కోరారు. అందుకు పలువురు అంగీకరించారు. వాళ్లకు తోచినవి పంపారు. కొందరు రంగులు, టైల్స్ వంటివి పంపారు. మరికొందరు ఇతరత్రా సామాగ్రి పంపారు. సరిగ్గా ఈ నేపథ్యంలో ఆమెకు ఇటీవల ఓ మెసేజ్ వచ్చారు. విద్యుత్తు సామగ్రి, మోటారు పంపుతున్నామన్నది ఆ మెసేజ్ సారాంశం. వాటిని కూడా అప్పటి దాతలే పంపారనుకున్నారామె. ఆటోలో వచ్చిన పెద్ద పెట్టెను ఇంట్లో పెట్టించారు. దుర్వాసన వస్తుండడంతో తెరిచి చూడగా లోపల ఓ కుళ్లిన శవం కనిపించింది.
ఈ పార్శిల్ లో వచ్చిన శవం వార్త ఓ పెద్ద కలకలం సృష్టించింది. యండగండి గ్రామానికి చెందిన తులసికి నిడదవోలుకు చెందిన సాగి శ్రీనివాసరాజు (శ్రీనుబాబు)తో 20 ఏళ్ల కిందట పెళ్లి అయింది. ఈ కాపురం కొంతకాలం బాగానే సాగింది. శ్రీనుబాబు అప్పులు చేయడంతో కుటుంబంలో కలహాలు వచ్చాయి. అప్పులు తీర్చలేక పదేళ్ల కిందట ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయారు. దీంతో తులసి పుట్టింటికి వచ్చేశారు. భీమవరంలోని ఓ దుకాణంలో పని చేస్తూ కుమార్తెను పోషించుకుంటున్నారు. ఆమెకు స్థానికంగా ప్రభుత్వ స్థలం మంజూరు చేసింది. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇల్లు కట్టుకోడానికి సాయం కోరుతూ ఒక సేవా సంస్థను అభ్యర్థించారు. వారు సెప్టెంబరులో రాజమహేంద్రవరం నుంచి రంగు డబ్బాలు, టైల్స్ ఆటోలో పంపారు.
ఈ క్రమంలో ఆమెకు డిసెంబర్ 19న ఓ మెసేజ్ వచ్చింది. విద్యుత్తు సామగ్రి, మోటారు పంపుతున్నామంటూ ఆమె ఫోన్‌కు వాట్సప్ ద్వారా సందేశం వచ్చింది. సాయంత్రానికి ఒక పెద్ద చెక్క పెట్టెను ఆటోలో తెచ్చి డ్రైవర్, మరో వ్యక్తి ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు. కరెంటు సామగ్రి కావచ్చని ఆమె అనుకున్నారు. అంతలో ఆ పెట్టె నుంచి దుర్వాసన వస్తుండటంతో.. రాత్రి 10.30 గంటలకు అనుమానంతో తాళం పగలగొట్టి చూశారు. అందులో సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
‘మీ భర్త మా వద్ద 2008లో కొంత అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి ఇప్పటికి రూ. 1.30 కోట్లు అయింది. ఆ సొమ్ము వెంటనే చెల్లించాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు’ అని రాసి ఉన్న ఓ కాగితం కూడా ఆ పెట్టెలో కనిపించింది. కంగారు పడిన తులసి కుటుంబ సభ్యులు వెంటనే ఉండి పోలీసులకు తెలిపారు. ఎస్.ఐ. నసీరుల్లా ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కాళ్లు, చేతులు దగ్గరకు మడత పెట్టి.. మూడు పెద్దపెద్ద పాలిథిన్ కవర్లలో గట్టిగా చుట్టి ఆ పెట్టెలో ఉంచారు. కుళ్లిపోవడంతో శవం నల్లగా రంగు మారిపోయి భయం గొలిపేలా ఉంది. గొంతుపై తాడుతో ఉరి బిగించినట్లు ఉందని చెబుతున్నారు. మిగతా శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. ఆ వ్యక్తి మృతిచెంది మూడు రోజులు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శవం విషయమై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు.
ఆస్తి గొడవలే కారణమా?
తులసి తండ్రి ముదునూరి రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు. తులసి పెద్ద కుమార్తె. రెండో కుమార్తె రేవతి. రేవతి కొద్దికాలం కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. రంగరాజు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలున్నాయని తెలుస్తోంది. శవం ఇంటికి చేరిన తర్వాత కొద్దిసేపటి నుంచి రేవతి భర్త కనిపించకుండా అదృశ్యం కావడం చర్చనీయాంశమైంది. ఆయనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తులసికి కొన్ని రోజులుగా ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి.. ఆస్తి తగాదాలేమిటి.. అదృశ్యమైన వ్యక్తి పాత్ర ఏమిటి? తులసి భర్త ఎవరి దగ్గర ఎంత అప్పు చేశారు వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలోని సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించారు. ఆటో డ్రైవరు కోసం గాలిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి చెప్పారు. గుర్తుతెలియని మృతదేహం ఎవరిది? ఎక్కణ్నుంచి తీసుకొచ్చారు? అనే వివరాలతో పాటు పరిసర ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా? అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు.