leopard caused a stir | తిరుపతి: అలిపిరి వద్ద చిరుత అలజడి
ఓ వ్యక్తికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. తిరుమల కాలిబాట సమీపంలో చిరుత కలకలం రేపింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-01-11 16:50 GMT
వాహనం అదుపుతప్పి కిందపడడంతో గాయపడ్డాడు. దీంతో స్వల్ప గాయాలతో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుత దాడిలో గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రెండేళ్లుగా తిరుమల, కాలిబాట సమీప ప్రాంతాల చిరుతపులి దాడి చేసిన ఘటనలు యాత్రికుల్లో ఆందోళన రేకెత్తించాయి. కాగా,
శనివారం జరిగిన సంఘటనపై తిరుపతి ఎఫ్ఆర్ఓ సుదర్శన్ స్పందించారు.
"సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం" అని తిరుపతి అటవీశాఖ రేంజర్ (Foreset Range Officer -FRO) పీ. సుదర్శన్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు. "అలిపిరి నుంచి జూపార్క్ వరకు పట్రోలింగ్ ఏర్పాటు చేసినట్టు ఎఫ్ఆర్ఓ సుదర్శన్ స్పష్టం చేశారు. జూ పార్క్ దానికటే ముందే ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రం సమీపంలో చిరుత రోడ్డు దాటే సమయంలో ఈ సంఘటన జరిగింది" అని ఆయన వివరించారు.
చిరుత సంచరించిన తిరుపతి జూపార్కు రోడ్డులో అటవీశాఖాధికారులు
తిరుపతి సమీపంలో జనావాసాలు, విద్య, ఆరోగ్య సంస్థలు కూడా ప్రాంతాలు శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలోనే విస్తరించి ఉన్నాయి. తిరుమల కాలిబాటలో చిరుత పులి దడ పుట్టించిన విషయం తెలిసిందే. తాజాగా నగరానికి సమీపంలోనే ఉన్న అలిపిరి కాలిబాటకు దగ్గరలోనే ఈ దాడి జరగడం వల్ల ఆ ప్రాంతంలో నివాసం ఉన్న జనాలే కాకుండా యాత్రికులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
ఏం జరిగిందింటే..
తిరుమల అశ్విని ఆసుపత్రిలో పనిచేసే డి. మణికుమార్ అలిపిరి నుంచి జూ పార్క్ మార్గంలో రోడ్డుపై బైక్ లో వెళుతున్నారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న చిరుతపులి మునికుమార్ గమనించారు. తీవ్రంగా కలవరపాటుకు గురైన మునికుమార్ తన బైక్ మరింత వేగంగా నడపడానికి యత్నించారు. అదే సమయంలో ఆయనపై దాడి చేయడానికి యత్నించిన చిరుత కూడా వాహనాల శబ్దాలకు బెదిరిపోయి, అడివిలోకి పారిపోయింది. తనపై దాడికి యత్నించింది. చిరుత కనిపించిన నేపథ్యంలో ఆందోళనకు గురైన మునికుమార్ బైక్ అదుపుతప్పడంతో ఆయన గాయపడ్డారు. సమీపంలోని వారు కేకలు వేయడంతో చిరుతపులి తిరుమల వైపు శేషాచలం అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు స్థానికుల కథనం. చిరుతపులి దాడిలో గాయపడిన ముని కుమార్ అందించిన సమాచారంతో...
"సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నాం" అని ఎఫ్ఆర్ఓ సుదర్శన్ చెప్పారు. కొద్దిసేపటిలోనే గాయపడిన మునికుమార్ ను వెంటనే సమీపంలోని రుయా ఆసుపత్రికి తరలించాం" అని కూడా ఎఫ్ఆర్ఓ వివరించారు.
వన్యప్రాణుల ఆవాసం
తిరుపతి నగరానికి సమీపంలోని ఉన్న అలిపిరి నుంచి తిరుమల కు వెళ్లడానికి శేషాచలం అడవుల్లో ప్రయాణించాలి. అదేవిధంగా.. అలిపిరి నుంచి శ్రీనివాసమంగాపురం వెళ్లే బైపాస్ రోడ్డు మొత్తం. శేషాచలం అడవికి ఆనుకునే సాగుతుంది. కుడివైపు రోడ్డుకు ఆనుకుని మొత్తం దట్టమైన అడవి తిరుమల వరకు విస్తరించి ఉంటుంది. ఎడమవైపు అలిపిరి సమీపం నుంచి రుయా ఆసుపత్రి, భారతీయ విద్యా భవన్, అరబిందో ఐ ఆస్పత్రి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వ్యవసాయ పరిశోధన కేంద్రంతో పాటు ఆ విద్యా సంస్థల హాస్టళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఈ ప్రదేశాలతో పాటు తరచూ వీటికి సమీపంలోనే ఉన్న స్విమ్స్ ఆస్పత్రి ఆవరణ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం హాస్టల్ సమీప ప్రాంతాలలో చిరుతల సంచారం కనిపిస్తోంది. అడవుల నుంచి సునాయాసంగా రోడ్డు దాటి ఈ ప్రదేశాలలోకి చిరుతల తరచూ సంచరిస్తుంటాయి.
గత ఏడాది డిసెంబర్ మధ్యలో కూడా ఒకసారి వేదిక్ వర్సిటీలో చిరుత సంచరించినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ సందర్భంలో కూడా విద్యార్థులు సెక్యూరిటీ నుంచి సమాచారం అందుకున్న తిరుపతి అటవీ శాఖ అధికారులు చిరుతపుడి జాడ కోసం ట్రాప్ కెమెరాలు కూడా అమర్చారు. ఇదిలా ఉంటే, తిరుపతిలో పట్టపగలే చిరుత రోడ్డు దాటుతూ టీటీడీ తిరుమల అశ్విని ఆసుపత్రిలో పనిచేస్తున్న మణికుమార్ పై దాడి చేయడం కలకలం రేకెత్తించింది.
"ఆ సంఘటన ప్రదేశాన్ని పరిశీలించాం" అని ఎఫ్ఆర్ఓ సుదర్శన్ చెప్పారు. సమీపంలోని విద్యా సంస్థల అధికారులను ప్రధానంగా వేదిక్ వర్సిటీ వీసీకి సూచనలు చేసినట్లు ఆయన వివరించారు. "తమ శాఖ సిబ్బందికి వాహనాలు ఇచ్చాం. ప్రజలకు ప్రమాదం జరగకుండా పట్రెలింగ్ చేపట్టాం" అని ఆయన వివరించారు. చిరుత జాడ కనిపిపెట్టడానికి ట్రాప్ కెమెరాలు అమర్చనున్నట్లు ఆయన వివరించారు. చిరుత వల్ల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎఫ్ఆర్ఓ సుదర్శన్ చెప్పారు. ఆ చిరుతను బంధించడానికి అధికారుల అనుమతి కోరనున్నట్లు ఆయన వివరించారు.
టీటీడీ అప్రమత్తం
తాజాగా చిరుత సంచారం సంఘటన నేపథ్యంలో తిరుపతి అటవీశాఖ అధికారులతో పాటు టిటిడి విజిలెన్స్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు.
2023 ఆగష్టు 13న నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన లక్షిత (6) చిరుత దాడిలో బలైంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు (ఆంజనేయస్వామి భారీ విగ్రహం) సమీపంలో కుటుంబీకులతో కలిసి వెళుతున్న ఆ బాలికను చిరుత దాడి చేసి, ఎత్తుకుపోయింది. మరుసటి రోజు గుర్తుపట్టలేనంతంగా బాలిక శరీరం ఛిద్రమైన స్థితిలో కనిపించింది. అదే ప్రదేశంలో అంతకుముందు కూడా కడప జిల్లాకు చెందిన బాలుడు కూడా అదృష్టవశాత్తు స్వల్ప గాయాలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాధ ఘటనల మచ్చలు ఇంకా చెరిగిపోలేదు. కాగా,
అలిపిరి సమీపంలోనే తాజాగా చిరుత సంచారం నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ విభాగం ముందుజాగ్రత్తలు తీసుకుంది. అలిపిరి కాలిబాట నుంచి వెళుతున్న యాత్రికులను అప్రమత్తం చేయడంతో పాటు మరింత రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మార్గంలో ఏడో మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి భారీ విగ్రహం వద్ద కూడా టీటీడీ సెక్యూరిటీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
నగరానికి సమీపంలోనే చిరుత దాడికి పాల్పడిన నేపథ్యంలో అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రుళ్ళు ఒంటరిగా తిరగకుండా జాగ్రత్త పాటించాలని సూచనలు చేశారు. తిరుమల కాలిబాటలో కూడా గుంపులుగా వెళ్లాలని టిటిడి భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు. జనసంచారానికి ప్రమాదం లేకుండా తమ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని ఎఫ్ఆర్ఓ సుదర్శన్ స్పష్టం చేశారు.