"సీమ" రైతుల్లో రెక్కలు తొడిగిన ఆశలు
రాయలసీమలో ఉద్యానవన పంటలకు ఊతం ఇవ్వాలని భావిస్తోంది. దీనికి ఎయిర్ స్ట్రిప్ ఉపయోగపడుతుందా? వాటికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తోంది. దీనివల్ల రైతులకు జరిగే మేలు ఏమిటి? ఉద్యాన పంటలకు డాలర్లు కురుస్తాయా?
By : SSV Bhaskar Rao
Update: 2024-07-15 02:44 GMT
రాయలసీమలో ఎయిర్ స్ట్రిప్ పదేళ్ల తరువాత మళ్లీ తెరమీదకు వచ్చింది. కుప్పంలో అర్ధంతరంగా భూసేకరణకే పరిమితమైంది. ఎయిర్ స్ట్రిప్ వల్ల ఉద్యానవన పంటలకు దేశీయంగా, అంతర్జాయ మార్కెటింగ్ కల్పించాలనేది లక్ష్యం. కుప్పంలో ప్రైవేటు వ్యక్తులు అంతర్జాయంగా ఎగుమతి చేశారు. ఆ తరువాత మందగించింది. ఎయిర్ స్ట్రిప్, మినీ విమానాశ్రయం ఉత్పత్తుల రవాణా, విద్యాభివృద్ధి, రవాణా రంగం అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందా? పర్యాటక రంగాన్ని కూడా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉందా? నిపుణులు ఏమంటున్నారు.
విభజనతో ఆగిన ప్రతిపాదన
2013లో రాష్ట్ర విభజనకు ముందు దేశంలో వంద విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్ లు ఏర్పాటు చేయడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విభజన వ్యతిరేక ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే అనంతపురం జిల్లాలో మినీ ఎయిర్ పోర్టు, స్ట్రిప్ ఏర్పాటుకు స్థల పరిశీలన జరిగింది. విభజన తరువాత మొదటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ విమానాశ్రాయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చదిద్దడానికి హామీ ఇచ్చింది. అందులో అనంతపురం ఎయిర్ స్ట్రిప్ లేకున్నా.. అంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం మేరకు..
ప్రతిపాదన ఎక్కడంటే..
అనంతపురానికి 11 కిలోమీటర్ల దూరంలోని బళ్లారి అనంతపురం రోడ్డులో ఒక ప్రదేశం, జాతీయ రహదారి-44లోని కనగానిపల్లె-రాప్తాడు మండలాల సరిహద్దులో మరో ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందిని అప్పట్లో గుర్తించి, కేంద్రానికి నివేదిక కూడా సమర్పించారు. ఈ ప్రాంతంలో రెండు వేల ఎకరాలు అనువుగా ఉందని సూచించారు. ఇక్కడ ఎయిర్ కార్గో స్ట్రిప్, పౌరవిమానయాన శిక్షణ సంస్థ ఏర్పాటుకు కేంద్రానికి సూచనలు చేశారు. ఈలోపు రాష్ర్ట విభజన ఉద్యమం తీవ్రతరం కావడం వల్ల ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఆ ప్యాకేజీలో అనంతపురం జిల్లాలో విమానాశ్రయం ప్రతిపాదన ఎక్కడా లేదు.
ఎంపీల చొరవ
ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి అవసరమైన మేరకు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉండడం ఉపకరిస్తోంది. ఈ అవకాశాన్ని టీడీపీ వీలైనంత మేరకు వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారం మారగానే అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మినారాయణ, బీకే. పార్థసారధి చొరవ తీసుకున్నారు.
"గతంలో పరిశీలన జరిగిందనే విషయం గుర్తు చేయడంతో పాటు, అనుమతికి చర్యలు తీసుకోండి" అని అభ్యర్థిస్తూ, వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు "విమానాశ్రయం ఏర్పాటుకు 1200 ఎకరాలు అవసరం. అనువైన స్థలం చూపిస్తే, పరిశీలన చేపడతాం. " అని సానుకూలంగా స్పదించడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"మినీ విమానాశ్రయం, ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు వల్ల కరువు ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుంది" అని సీనియర్ జర్నలిస్ట్ షఫీ అభిప్రాయపడ్డారు. ఉద్యానవన పంటలు ఇతర ప్రాంతాలు, దేశాలకు కూదా ఎగుమతి చేయడం వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుందని ఆయన విశ్లేషించారు.
ప్రయోజనం ఏమిటి?
అనేక దేశాలు, ప్రభుత్వాలు ఎయిర్ కార్గోకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. అనంతపురం సమీపంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాలు వల్ల కేవలం ఆ ప్రాంతానికే కాకుండా, సరిహద్దులోని 90 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప జిల్లా ఉద్యానవన రైతులకు కూడా మేలు జరుగుతుంది. రావాణా కష్టాలు తీరడంతో పాటు, ఉత్పత్తులకు ధర లభించే అవకాశం ఉంది.
ఉద్యానవన రైతులకు మేలేనా?
రాయలసీమలో బొప్పాయి. అరటి, చీనీ, దానిమ్మ, జామ. మామిది, టమాట, పుచ్చకాయలతో పాటు వినూత్న ప్రయోగాలతో అనేక రకాల పండ్ల తోటలు కూడా సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 2.02 లక్షల హెక్టర్లలో పూలు, కూరగాయలు, ఔషధ, సుగంధద్రవ్య పంటలు సాగులో ఉన్నట్లు ఉద్యానవన శాఖ రికార్డలు చెబుతున్నాయి. ఏటా దాదాపు 50 లక్షల టన్నుల ఫలసాయం దిగుబడి వస్తోందని వివరిస్తున్నారు. ఈ ఉత్పత్తులు రోడ్డు మార్గాన కాకుండా, దేశంలోని ప్రధాన నగరాలతో పాటు, విదేశాలకు కూడా గంటల వ్యవధిలో రవాణా చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఉత్పత్తి కూడా దెబ్బతినదని గుర్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం ముకుందాపురం ప్రాంతం చీనీ తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ చీనీ, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి. సపోటా, వక్క, చింత, రేగు, బెండ తోటలతో పాటు, కనకాంబరం పూల తోటలకు ప్రసిద్ది. అరటి, మామిడి, కర్బూజ, కళింగర, మిరప, టమాట, వంగ, ఉల్లి, బంతిపూల తోటలకు కూడా నెలవు. జిల్లా నుంచి దేవంలోని వివిధ మార్కెట్లతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా మేలు రకం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలోని బొమ్మనహాళ్మండలంలో అల్లనేరేడు పండ్లతో జూస్, జాం తయారీ చేస్తున్నారు. చౌడునేలల్లో కూడా అల్లనేరేడు మొక్కలు సాగు చేయవచ్చని కూడా సూచించారు.
నీటి పొదుపుతో..
రాష్టంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలో అనంతపురం ప్రధమ స్థానంలో ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో వాటర్ షెడ్ పధకాలు రైతులకు ఉపయోగపడ్డాయి. దీనికి తోడు నీటిని పొదుపుగా వాడేందుకు బిందు, తుంపర సేద్యం కూడా అనుసరిస్తుండడం వల్ల డాలర్లు, దినార్ల సేద్యం సాగిస్తున్నట్లు చెబుతున్నారు.
కుప్పంలో ఆగిన పనులు
సీఎం ఎన్. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇజ్రాయల్ సాంకేతికతతో వ్యవసాయం సాగింది. దీనిని పక్కన ఉంచితే, నియోజవర్గంలో సాగు చేసే పండ్లు, ప్రధానంగా పువ్వుల్లో లిల్లీ, చామంతి, కాగడాలు, మల్లెలు, అరటి, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, స్వీట్ కార్న్ గెర్కిన్ (చిన్న దోసకాయ) వంటిని అమెరికాతో పాటు అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో..
కుప్పం నియోజకవర్గం రామకుప్పం శాంతిపురం మధ్యలోని అమ్మవారిపేట వద్ద ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం. ఎన్. చంద్రబాబు 2019 జనవరి మూడో తేదీ ఎయిర్ స్ట్రిప్ కు శంకుస్థాపన చేశారు. వెయ్యి ఎకరాలు అవసరం కాగా, గతంలోనే 483 ఎకరాలు సేకరణ చేశారు. ఆ మేరకు వంద కోట్లు కేటాయించి రైతులకు రూ. 22 కోట్లు పరిహారం కింద కేటాయించారు. సేకరించిన కోంత భూమికి పరిహారం చెల్లించారు. నెలల వ్యవధిలోనే జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కుప్పం ఎయిర్ స్ట్రిప్ అటకెక్కింది. మళ్లీ ఈ కేంద్రానికి కూడా ఊపిరిపోయనున్నారు.
ప్రస్తుతం రాయలసీమలో తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలో రాత్రిళ్లు ల్యాండింగ్ సదుపాయం మినహా కార్గో వసతి అందుబాటులోకి రాలేదు. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖ, విజయవాడ, మధురై, ముంబై, హుబ్లీ, కడప, బెంగళూరు నగరాల మధ్య విమానాలు ఉన్నాయి. కడపలోని డొమస్టిక్ విమానాశ్రయం ఉంది. ఇక్కడ కార్గో సేవలు అందుబాటులోకి రాలేదు. దీనివల్ల 120 కిలోమీటర్ల దూరంలోని చెన్నై, 240 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయాలే
కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద కూడా 2017 లో సీఎం ఎన్. చంద్రబాబు శంకుస్థాపన చేసిన విమానాశ్రయంలో 2018లో ట్రయల్ రన్ కూడా ప్రారంభించారు. దానిని 2021లో మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ప్రారంభించారు.
"విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసులు ప్రారంభించాలని" పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి టీజీ. భరత్ కోరారు. ఓర్వకల్లు పారిశ్రామికంగా మరింత అభివృద్దికి దోహదం చేస్తుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు సూచించినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కార్గో సేవలు ప్రారంబిస్తే మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది.
ఎయిర్ స్ట్రిప్ తో ప్రయోజనం...
రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం జిల్లాలు కర్ణాటకకు అతిసమీపంలో ఉంటాయి. అక్కడి శీతోష్ణస్థితి ప్రభావం రాయలసీమ సరిహద్దులో ఎక్కువగా ఉండడం కూడా ఉద్యానవన పంటలకు ఉపయోగపడుతోంది. దీనివల్ల కుప్పం పట్టణానికి బెంగళూరు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ రోడ్డు మార్గంలో కోలార్ మీదుగా వెళితే నాలుగు నుంచి 4.5 గంటలు, హోసూరు మీదుగా ఆరు గంటలు పడుతుంది. అనంతపురం - బెంగళూరు రోడ్డు మార్గంలో 214 కిలోమీటర్లు. గగనతంలో 190 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్, మినీ ఎయిర్పోర్టు ఏర్పాటు వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు.
రాయలసీమలో చిత్తూరుకు దగ్గరగా చెన్పై, బెంగళూరులో రెండు అంతర్జాయ విమానాశ్రయాలు ఉన్నాయి. బెంగళూరు విమానాశ్రయానికి రోజుకు 720 విమానాలు రాకపోకలు సాగిస్తుంటే, ఏడాదికి 11 మిలియన్ మంది ప్రయాణిస్తున్నారు. ఇక్కడ కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి ఏటా 23 నుంచి 30 మిలియన్ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని లెక్కలు చెబుతున్నాయి. ఇవి కేవలం ఆయా రాష్ట్రాల వారికే కాకుండా, ప్రపంచంలో ప్రధానంగా గల్ఫ్, అరబ్ ఎమిరేట్స్ లో ఉపాధికి వెళ్లిన రాయలసీమలోని చిత్తూరు ప్రధానంగా కడప, కర్నూలు జిల్లాల నుంచి లక్షలాది మంది వలస కార్మికులు, వారి సరుకు రవాణాకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.
అందువల్ల..
"కుప్పం, అనంతపురం వద్ద ఎయిర్ స్ట్పిప్ ఏర్పాటు అవసరం ఉంటుంది" అని రేణిగుంట విమానాశ్రయం టెర్మినల్ ఇన్చార్జి సన్నిత్ ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. వీటివల్ల అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రద్దీ నియంత్రించడానికి ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని విమానాశ్రయం నుంచి ఎయిర్ బస్ రాకపోకలు, కార్గోకు వెసులుబాటు ఉన్నప్పటికీ నిద్రాణంగా మారింది.
కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మరింత చొరవ తీసుకుంటే ఈ ప్రాజెక్టుల సాధన ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఎలా మేలు చేస్తారనేది వేచిచూడాలి.